ఉగ్రవాదులకు అడ్డా.. ఇంకెన్నాళ్ళు.?

హైద్రాబాద్‌ భాగ్యనగరం.. హైద్రాబాద్‌ భవిష్యత్తులో కాబోయే విశ్వనగరం.. హైద్రాబాద్‌ దేశంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటి.. అన్నిటికీ మించి హైద్రాబాద్‌.. ఉగ్రవాదులకు అడ్డా.!  Advertisement ఇది ఇప్పుడు కొత్తగా విన్పిస్తున్న మాట కాదు. దేశంలో…

హైద్రాబాద్‌ భాగ్యనగరం.. హైద్రాబాద్‌ భవిష్యత్తులో కాబోయే విశ్వనగరం.. హైద్రాబాద్‌ దేశంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటి.. అన్నిటికీ మించి హైద్రాబాద్‌.. ఉగ్రవాదులకు అడ్డా.! 

ఇది ఇప్పుడు కొత్తగా విన్పిస్తున్న మాట కాదు. దేశంలో ఎక్కడ ఏ మూల తీవ్రవాద ఘటన జరిగినా, తీగ లాకితే డొంక కదిలేది హైద్రాబాద్‌లోనే. హైద్రాబాద్‌, ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిపోతోందా.? అన్న అనుమానాలూ కలుగుతుంటాయి. దేశంలో ఏ నగరానికీ లేని ప్రత్యేకత తీవ్రవాదం విషయంలో హైద్రాబాద్‌కే ఎందుకు.? అనే ప్రశ్నకు సమాధానం వెతకడం కష్టమే. కారణాలేవైతేనేం, అభివృద్ధిలోనే కాదు.. తీవ్రవాదం విషయంలోనూ హైద్రాబాద్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతూనే వుంది. 

ఉగ్రవాదుల్ని తయారు చేయడంలోనే కాదు, ఉగ్రవాద పీడిత నగరంగానూ హైద్రాబాద్‌కి 'ట్రాక్‌ రికార్డ్‌' వుంది. మతకల్లోలాలు సృష్టించడానికి చాలా తేలిక హైద్రాబాద్‌లో.. అన్న భావనే, ఉగ్రవాదులకు ఇక్కడ షెల్టర్‌ లభిస్తుండడానికి కారణం అయి వుండొచ్చేమో.! ఎక్కువగా ఉగ్రవాదులు పాత బస్తీలోనే బస చేస్తుంటారు. అలాగని, మిగతా ప్రాంతాల్లో వుండరని కాదు. చిత్రమైన విషయమేంటంటే, భాగ్యనగరంలో ఎప్పటినుంచో 'స్లీపర్‌ సెల్స్‌' అనే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇక, తీవ్రాదులు చుట్టం చూపుకి.. అన్నట్లు వచ్చిపోతుంటారు.. తమ పనుల్ని చక్కబెట్టేస్తుంటారు. స్లీపర్‌ సెల్స్‌ ఎప్పుడోగానీ యాక్టివ్‌ అవరు గనుక, బయట నుంచి వచ్చే తీవ్రవాదుల మీదనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాల్సి వస్తోంది. పోలీస్‌ శాఖ ఇంత సమర్థవతంగా పనిచేయబట్టే, భాగ్యనగరం ఇంకా సేఫ్‌గా వుందన్నది నిర్వివాదాంశం. అయినప్పటికీ, ఎప్పుడంటే అప్పుడు హైద్రాబాద్‌లో ఉగ్రవాదులు పట్టుబడ్తుండడం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. 

ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చె, ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చె.. అనుకోవడం తప్ప, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పోలీసింగ్‌ వీలుకాని పరిస్థితి. పాతబస్తీలో తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా వున్న ప్రాంతాలు నిత్యం పోలీసులకు సవాల్‌ విసురుతూనే వుంటాయి. ఏ పార్టీ అధికారంలో వున్నా, వారి వారి రాజకీయ అవసరాల కోసం పాత బస్తీని చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం చూస్తూనే వున్నాం. 

ఇదివరకటి పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. తీవ్రవాదం ప్రపంచ వ్యాప్తంగా వికటాట్టహాసం చేస్తోంది. గతంలో అయితే, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి మాత్రమే తీవ్రవాదులు ఇంపోర్ట్‌ అయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఎవరూ ఎక్కడికీ కదలక్కర్లేదు. అంతా అలా జరిగిపోతుందంతే. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఐసిస్‌, ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా విధ్వంసం సృష్టించగలదు. తృటిలో ఎన్‌ఐఏ స్పందించబట్టి సరిపోయిందిగానీ, లేదంటే భాగ్యనగరం తీవ్రవాదుల దాడులతో విలవిల్లాడేదే. 

ఈ మధ్యకాలంలో 'కార్డన్‌ సెర్చ్‌' పేరుతో హైద్రాబాద్‌లో పోలీసింగ్‌ అద్భుతంగా జరుగుతోందన్నది కాదనలేని వాస్తవం. అదే సమయంలో, తీవ్రవాదంపైనా ఇంకో కన్ను వేసి వుంచాల్సిందే. లేదంటే, అన్నిసార్లూ అదృష్టం కలిసి రాదు కదా. విశ్వనగరంగా మారనున్న హైద్రాబాద్‌లో మళ్ళీ విధ్వంసం.. అనే మాట వినడానికి సగటు హైద్రాబాదీ సిద్ధంగా లేడు.. వుండడు.