ఎన్‌కౌంటర్లు మనకు కొత్త కాదు. తెలుగు రాష్ట్రాల్లో నక్సలైట్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం దశాబ్దాలుగా చూస్తున్నాం. ఒక్కోసారి ఇద్దరు ముగ్గురిని ఎన్‌కౌంటర్ చేస్తే, మరోసారి పదిమందికి పైగా ఎన్‌కౌంటర్‌లో హతమవుతుంటారు. ఎప్పుడు ఎక్కడ ఎంతమంది ఎన్‌కౌంటర్ అవుతారో చెప్పలేం. అలాగే నక్సలైట్లు పోలీసులనూ హత్య చేయడం మనకు తెలుసు.
పోలీసులను హత్య చేసినప్పుడు మాట్లాడని పౌరహక్కుల సంఘాలు నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేసినప్పుడు మాత్రం పెద్దఎత్తున విమర్శలు చేస్తాయి. ఉద్యమిస్తాయి. పోలీసులు చేసేవి నిజమైన ఎన్‌కౌంటర్లు కాదనే ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో రుజువైంది కూడా. అసలు ఎన్‌కౌంటర్ అంటే ఏమిటి? ఎదురు కాల్పులు లేదా ఎదురు దాడి. ఆ సందర్భంగా చనిపోతే ఎన్‌కౌంటర్లో చనిపోయాడని అంటారు.
కాని కొన్నిసార్లు పోలీసులు పట్టుకెళ్లి కాల్చేసి 'మాపై కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తే గత్యంతరం లేని పరిస్థితిలో ఎదురు కాల్పులు జరిపాం. ఆ సందర్భంగా చనిపోయారు' అని కథలు చెబుతారు. అందుకే కొన్ని సినిమాల్లో పోలీసు అధికారి పాత్ర చేత 'నిన్ను ఎన్‌కౌంటర్ చేయిస్తా' అనే డైలాగ్ చెప్పిస్తుంటారు. కొన్ని సినిమాల్లో హీరో పోలీసు అధికారి అయినట్లయితే రౌడీలను, గూండాలను టపటప కాల్చిపారేస్తుంటాడు. అంటే ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అన్నమాట. నిజమైన పోలీసు అధికారుల్లోనూ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులున్నారు. కరడుగట్టిన గూండాలను, క్రిమినల్స్‌ను పట్టుకొని విచారణ జరపడం కంటే కాల్చిపారేయడమే మంచిదనుకొని సమయం చూసుకొని ఎన్‌కౌంటర్ చేసి 'ఆత్మరక్షణ' కథ వినిపిస్తారు.
పట్టుకొని కేసు బుక్ చేసినా రాజకీయ నాయకుల అండతో బయటకు వస్తుంటారు. దీంతో పోలీసు అధికారులు పాన్డ్‌గా లేపేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో పోలీసు అధికారులు నిజమైన ఎన్‌కౌంటర్లు చేశారో, ప్లాన్ ప్రకారం చేశారో తెలియదుగాని గత 48 గంటల్లో 18 మందిని ఎన్‌కౌంటర్ చేసిపారేశారు. యథాతథంగా 'ఆత్మరక్షణ' కోసం మేం ఈ పనిచేయక తప్పలేదని స్టోరీ చెప్పారు.
48గంటల్లో 18మందిని చంపడమంటే సామాన్యమైన విషయం కాదు. అంతేకాదు తమ వాంటెడ్ లిస్టులో ఉన్న పాతికమందిని అరెస్టు చేశారు. చనిపోయినవారు, అరెస్టయినవారంతా పేరుమోసిన, కరడుగట్టిన నేరగాళ్లని పోలీసు అధికారులు చెప్పారు. ఇలాంటివారిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు ఇంద్రపాల్ అనే రౌడీని కాల్చేశారు. ఇతనిపై 33 క్రిమినల్ కేసులున్నాయి.
గత ఏడాది మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచి 950 ఎన్‌కౌంటర్లు జరిగాయి. 200 మందిని అరెస్టు చేశారు. 30 మంది గూండాలను కాల్చిపారేశారు. మీడియా వార్తలు, కథనాల ద్వారా ఎన్‌కౌంటర్ల విషయం జాతీయ మానవహక్కుల కమిషన్ దృష్టికి వెళ్లడంతో అది నివేదిక కోరింది. గూండాలను, క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్ చేయడం తప్పు కదా.
వారిని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయించాలని అంటారు కొందరు. మన దేశంలో విచారణ ఎంత చక్కగా జరుగుతుందో, శిక్షలు ఎంత పకడ్బందీగా విధిస్తారో తెలిసిందే. అందుకే కరడుగట్టిన నేరగాళ్లను కాల్చిచంపితే తప్పులేదంటారు మరికొందరు. ఏదిఏమైనా రెండు రోజుల్లో ఇంతమందిని కాల్చేశారంటే పోలీసులకు ప్రభుత్వం బలమైన మద్దతు లేనిదే సాధ్యం కాదు.