వీరి ఉరితోనైనా భయపడతారా?

మహిళలపై అత్యాచారాలకు కేరాఫ్‌ అడ్రసుగా మారిన భారత్‌లో ఇకనైనా ఈ దారుణాలు ఆగుతాయా? ప్రపంచంలో ఇండియా పరువు తీస్తున్న అత్యాచారాలకు ఇకనైనా అడ్డుకట్ట పడుతుందా? ప్రతిరోజూ వందలకొద్దీ అత్యాచారాలు చేస్తున్న రాక్షసులు భయపడే రోజులు…

మహిళలపై అత్యాచారాలకు కేరాఫ్‌ అడ్రసుగా మారిన భారత్‌లో ఇకనైనా ఈ దారుణాలు ఆగుతాయా? ప్రపంచంలో ఇండియా పరువు తీస్తున్న అత్యాచారాలకు ఇకనైనా అడ్డుకట్ట పడుతుందా? ప్రతిరోజూ వందలకొద్దీ అత్యాచారాలు చేస్తున్న రాక్షసులు భయపడే రోజులు వస్తాయా? ఆరేళ్ల క్రితంనాటి ఢిల్లీ నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని ఈరోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో పరిస్థితి మారితే ఆ తీర్పుకు సార్థకత ఏర్పడుతుంది.

ఉరిశిక్ష పైశాచికమని, అనేక దేశాల్లో దీన్ని రద్దు చేశారని కొందరు మానవ హక్కుల సంఘాలవారు, మేధావులు వాదిస్తుంటారు. కాని ఆ వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అత్యంత హేయంగా, దారుణంగా, పైశాచికంగా, రాక్షసంగా 2012 డిసెంబరు 16న ఢిల్లీలో నడుస్తున్న బస్సులోనే వైద్య విద్యార్థినిపై పాశవికంగా అత్యాచారం చేసి, ఆమె మరణానికి కారకులైనవారిని నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాల్సిందే. ఆరేళ్ల తరువాత కూడా వారిని ఉరితీయకుండా ఏవో కారణాలతో కాలయాపన చేస్తే, రాష్ట్రపతి క్షమాభిక్ష పేరుతో జాప్యం చేస్తే అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు.

అక్షయ ఠాకూర్‌, ముకేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తాలను వెంటనే ఉరి తీస్తే అత్యాచారాలకు తెగబడుతున్నవారు కొంతలో కొంత భయపడే అవకాశం ఉంటుంది. ఈ శిక్ష అమలు చేయకుంటే ఈ దేశంలో జీవించడం కంటే ఇతర దేశాలకు వలసపోతే సుఖంగా ఉంటామనే భావన జనంలో కలుగుతుంది. నిర్భయ కేసులోని ఆరుగురు దోషుల్లో రాజు అనేవాడు మైనర్‌ కాబట్టి బతికిపోయాడు. బస్సు డ్రైవర్‌ రామ్‌సింగ్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురికి ట్రయల్‌ కోర్టు మరణ శిక్ష విధించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ దోషులు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అది ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థించింది. చివరకు సుప్రీం కోర్టుకు వెళ్లగా గత ఏడాది మే 5న ఉరిశిక్షను సమర్థించింది. అయినప్పటికీ దోషులకు ఆశ చావక సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం ఉరి తీయాల్సిందేనని ఈరోజు తీర్పునిచ్చింది. దీంతో నిర్భయ కుటుంబానికి న్యాయం జరిగింది. దేశంలోని లక్షలాదిమంది అత్యాచార బాధితులకు న్యాయం జరగాలంటే దోషులను ఉరితీయాల్సిందే.

ఏకకాలంలో నలుగురిని ఉరి తీసినప్పుడు ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అత్యాచారాలకు పాల్పడేవారిని వదిలిపెట్టబోమనే సంకేతం పంపినట్లవుతుంది. ఢిల్లీ ఘటన తరువాత అప్పటి యూపీఏ సర్కారు నిర్భయ చట్టం చేసింది. కాని విచిత్రంగా ఈ చట్టం చేసిన తరువాతే అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. మీడియాలో ఈ వార్తలే ప్రధానమవుతున్నాయి. ఢిల్లీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించడం, పెద్దఎత్తున యువత, విద్యార్థులు, మహిళలు ఉద్యమించడం, మీడియా ప్రాధాన్యం ఇవ్వడంతో చివరకు అది ఉరిశిక్ష వరకు వచ్చింది.

కాని ఢిల్లీ ఘటనకు మించినవి అనేకం జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రులు, నాయకులు రేప్‌లను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన దాఖలాలున్నాయి. రేపిస్టులను రక్షించిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పాలకుల చర్యలు, వ్యాఖ్యలు సిగ్గుతో తలదించుకునేవిధంగా ఉంటున్నాయి. తాజాగా యూపీకి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 'ఈ దేశంలో రాముడే దిగొచ్చినా రేప్‌లు ఆపలేడు' అని అన్నాడు. పాలక పార్టీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడొచ్చా?

అంటే ఈయన రేప్‌లు జరగాలని కోరుకుంటున్నాడా? సురేంద్ర నారాయణ్‌ సింగ్‌ అనే ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 'మహిళలపై అత్యాచారాలను శ్రీరాముడు కూడా ఆపలేడు. ఇది చాలా సహజం' అన్నాడు. ఇతను ప్రజాప్రతినిధా? రాక్షస మూకకు ప్రతినిధా? ఇలాంటి ఘటనలను రాజ్యాంగాన్ని ఉపయోగించి ఆపలేమని, ప్రజలకు విలువలు నేర్పాలని అన్నాడు. తప్పు చేసినవారిని శిక్షించే దమ్ము లేనప్పుడు పాలన చేయడమెందుకు? దోషి అని తేలగానే కఠినంగా శిక్షించాలిగాని విలువలు నేర్పుతూ కూర్చోవాలా? ఇలాంటి మూర్ఖ శిఖామణులకు నిర్భయ కేసులోని నలుగురి ఉరిశిక్ష కనువిప్పు కావాలి.