ఉత్తరాంధ్ర గుండెల్లో గునపాలు

అటు అణు విద్యుత్ … ఇటు బాక్సైటు  నాడు వ్యతిరేకించిన బాబు ఇపుడు సీన్ రివర్స్ Advertisement తెల్లబోతున్న తమ్ముళ్లు.. వీధికెక్కుతున్న విపక్షం తరచూ అభిప్రాయాలు మార్చుకోకపోతే రాజకీయ నాయకులు కారన్నది ఎంతటి నీతి…

అటు అణు విద్యుత్ … ఇటు బాక్సైటు 
నాడు వ్యతిరేకించిన బాబు
ఇపుడు సీన్ రివర్స్

తెల్లబోతున్న తమ్ముళ్లు.. వీధికెక్కుతున్న విపక్షం

తరచూ అభిప్రాయాలు మార్చుకోకపోతే రాజకీయ నాయకులు కారన్నది ఎంతటి నీతి సూత్రమైనా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరీ ఇంతగా వంటబట్టించుకోవడం చూసి తమ్ముళ్లే నివ్వెరపోతున్నారు. అధికారంలో ఉంటే ఓ మాట ప్రతిపక్షంలో ఉంటే మరో మాట చెప్పడం బాబుకు చెల్లినంతగా వేరే నేతకు చెల్లదేమే. నాడు కాదన్నది ఇపుడు ఔనవుతుంది, దాంతో ఇపుడు ఉత్తరాంధ్రలో ఇపుడు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో రెండు కుంపట్లను జనం నెత్తిన రుద్దేందుకు పథక రచన సాగుతోంది. దానిని విపక్షాలు వ్యతిరేకిస్తున్నా, తమ్ముళ్లు మొత్తుకుంటున్నా బాబు తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. ఇపుడు కక్కలేక మింగలేక నలిగిపోవడం టీడీపీ నేతలదైతే జనాగ్రహాన్ని రెట్టింపు చేసే పనిలో ప్రతిపక్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు బాబు సర్కార్ సై అంటోంది, అలాగే, విశాఖ జిల్లా ఏజెన్సీలో బాక్సైటు తవ్వకాలకు కూడా పచ్చ జెండా ఊపేసింది. ఈ రెండు పరిణామాలలో జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీకి పట్టం కట్టిన ఈ జిల్లాలు ఇపుడు వ్యతిరేకం అవుతున్నాయి. నాడు బాక్సైటుకు, అణు విద్యుత్‌కు ప్రతిపక్ష నాయకుని హోదాలో వ్యతిరేకంగా మాట్లాడిన బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే యూ టర్న్ తీసుకోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 

ఇదీ బాక్సైటు కథ…!

దాదాపు పుష్కరం కాలం క్రితం విశాఖ జిల్లా ఏజెన్సీలో బాక్సైటు నిక్షేపాలపై అప్పటి టీడీపీ సర్కార్ కన్ను పడింది. వాటి తవ్వకాలు జరిపించాలని కూడా బాబు ప్రభుత్వం యోచించింది. అప్పట్లో కేంద్రంలో ఎన్‌డిఎ సర్కార్ అధికారంలో ఉంది. దాంతో, బాక్సైట్ తవ్వకాలకు అంతా సిద్ధమైంది. రస్ ఆల్ ఖైమా అనే విదేశీ సంస్ధను కూడా రప్పించి బాక్సైటు తవ్వకాల వ్యవహారాన్ని అప్పగించారు.  అయితే, దానిపై వామపక్షాలు, నాటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యతిరేకించడంతో బాక్సైటు కథ అలా కంచికి చేరింది. ఆ తరువాత 2004లో వైఎస్‌ఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ హయాంలోనూ బాక్సైటు తవ్వకాలపై ఆలోచన చేశారు. మళ్లీ అదే రస్ ఆల్ ఖైమా సంస్ధనే పిలిచారు. ఆ సంస్ధ ప్రతినిధులు కూడా మారిన సర్కార్‌తో మంతనాలు జరిపి తమకు అనుకూలం చేసుకున్నారు. 2007లో మళ్లీ దీనిపై కదలిక రావడంతో నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరతీసింది. ఆ పార్టీకి వామపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. ఇక, విశాఖ జిల్లాలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న సిహెచ్ అయ్యన్నపాత్రుడు, మరో సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి వంటి వారు ఏకంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. బాక్సైటు తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణను సైతం అడ్డుకున్నారు. దీనికి తోడు అరకు నియోజకవర్గం కాంగ్రెస్ ప్రతినిధులు, మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ వంటి వాళ్లు కూడా బాక్సైటు తవ్వకాలపై పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేంద్రంలోని తమ పార్టీ నాయకత్వంతో మాట్లాడడమే కాకుండా, పార్టీ తరఫున సోనియాగాంధీకి కూడా విన్నపాలు చేసుకున్నారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబునాయుడు సైతం బాక్సైటు తవ్వకాలపై పూర్తిగా తన వ్యతిరేకతను తెలియచేశారు. 2012 డిసెంబర్‌లో ఆయన ఏకంగా గవర్నర్‌కు దీనిపై లేఖ కూడా రాశారు తవ్వకాలు జరపవద్దంటూ ఫలితంగా వైఎస్‌ఆర్, ఆ తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్‌లు కూడా  వెనకడుగు వేశారు. ఇక, కథ కంచికి చేరిందని, శాశ్వతంగా బాక్సైటు తవ్వకాలకు తెర పడిందని అంతా భావించారు. కానీ, మళ్లీ అది మొదటికి వచ్చింది.

కొవ్వాడదీ ఇదే తీరు…!

అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుచేయాలని నాటి యూపీఏ సర్కార్ నిర్ణయించింది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుచేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని, అదుపు చేసే సాంకేతిక సామర్ధ్యం కూడా మనకు ఉండదని నాడు ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. అందులో కీలకమైన పాత్రను టీడీపీ పోషించింది. శ్రీకాకుళం జిల్లాలోని రణస్ధలం మండలం కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.  అయితే, ప్రధానంగా పర్యావరణానికి సమస్యగా మారుతుందని, ఇక్కడ జనవాసాలకూ నష్టం వాటిల్లుతుందని మేథావులతో పాటు, పర్యావరణ వేత్తలు కూడా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఈ ప్రతిపాదన చాలా పాతది, అంటే పాతికేళ్ల క్రితమే అణు విద్యుత్ ప్లాంటుకు ఈ ప్రాంతం అనుకూలమని నిపుణులు నిర్ధారించారు. కొవ్వాడ, మత్స్యలేశం గ్రామాలను ఆనుకుని అణు విద్యుత్ ప్లాంటును ఏర్పాటుచేయాలన్నది సంకల్పం. దీంతో, ఈ రెండు  గ్రామాలనూ పూర్తిగా ఖాళీ చేయించాల్సివస్తుంది. అంతటితో కూడా ఇది ఆగదు, అణు విద్యుత్ పార్కు వస్తే పర్యావరణం పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయని మేధావులు అంటున్నారు. ఇక్కడ పంటలకు, వాతావరణానికి కూడా అది దెబ్బేనని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు ప్లాంటుకు ఏదైనా విఘాతం సంభవిస్తే దానిని తట్టుకుని ముందుకు సాగే సామర్ధ్యం మనకు ఉందా అన్నది కూడా ఓ ప్రశ్నగానే ఉంది.  ఈ విషయాలన్నింటిపైనా నాడు చంద్రబాబు సైతం టీడీపీ నాయకులంతా ఏకీభవించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు అణు విద్యుత్ కేంద్రం వద్దంటూ ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. 

2010లో జరిగిన రిలే దీక్షలలో టీడీపీ సీనియర్లు పలువురు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఆందోళనలో పాలుపంచుకుని అణు విద్యుత్ ప్లాంట్ వద్దంటూ నినదించారు. తమ సర్కార్ వస్తే వ్యతిరేకించి తీరుతామని కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ కొవ్వాడపైనే దృష్టి పెట్టడం పలువురిని ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం  అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టీడీపీ పచ్చ జెండా ఊపేసింది. దీంతో అనేక జీవోలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ జారీ చేస్తోంది. చంద్రబాబు వైఖరిలో వచ్చిన మార్పు వల్లనే ఈ జీవోలు వస్తున్నాయని అంతా భావిస్తున్నారు. కాగా, అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు రావాల్సిఉంది. ప్రతిపాదించిన ప్రాంతాన్ని నాలుగు జోన్లుగా విభజించి కొత్తగా ఎటువంటి నిర్మాణాలూ చేపట్టరాదని ప్రభుత్వం 16 నంబర్‌తో ఒక జీవోను జారీ చేసింది.  దీని ప్రకారం రణస్ధలం మండలంలోని 17 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శాశ్వతంగా తెర పడినట్లే. ప్లాంటుకు అయిదు కిలోమీటర్ల దూరంలో ప్లాంటు ఉద్యోగులు, కాలనీలు, ఆసుపత్రులు, పాఠశాలలు, సామాజిక భవనాలు, క్రీడామైదానాలు నిర్మిస్తారు. ఇక, 30 కిలోమీటర్ల మేర దూరం వరకూ అణు విద్యుత్ ప్లాంటు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి  భూసేకరణ యూనిట్ ఏర్పాటుతో ప్రభుత్వం తొలి అడుగు వేయగా, జీవో నంబర్ 16తో కీలకమైన మరో అడుగు వేసినట్లైంది.

ఉద్యమాలకు రంగం సిద్ధం

కాగా, చెప్పింది ఓ మాట చేసింది మరో మాటగా టీడీపీ సర్కార్ ఉండడంతో విపక్షాలు ఉద్యమానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లా ఏజెన్సీలో బాక్సైటు తవ్వకాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళన బాట పట్టాయి. సీపీఏం సీనియర్ నాయకుడు బీవీ రాఘవులు బాక్సైటు జోలికి వస్తే బాబు సర్కార్‌ను వదిలిపెట్టమని హెచ్చరించారు. అలాగే, వైసీపీ కూడా బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ఆ పార్టీకి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, ఏజెన్సీలో రెండు స్ధానాలను గెలుచుకుంది. దాంతో, స్ధాన బలంతో పోరాటానికి సిద్ధమనవుతోంది. అలాగే, టీడీపీలోని సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి సైతం బాక్సైటుకు వ్యతిరేకంగా గళం విప్పారు. తమ సర్కార్ అయినా సరే అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. అలాగే, కొవ్వాడ అణు విద్యుత్‌పైన కూడా అగ్గి రాజుకుంటోంది. కాంగ్రెస్, సహా, ప్రతిపక్షాలు సమరానికి సై అంటూంటే టీడీపీ నాయకులు మాత్రం ఇరకాటంలో పడుతున్నారు. బాబు సర్కార్ దగ్గరుండి మరీ ఇలా చేయడంతో తమ్ముళ్లకు ఏమీ పాలుపోవడంలేదు. వీటికి సాయంగా మావోలు సైతం బాక్సైట్ తవ్వకాలను ప్రతిఘటిస్తూ ఏజెన్సీలో పోరాటానికి వ్యూహ రచన చేస్తున్నారు. ఈ పరిణామాలు టీడీపీ నేతలకు ఊపిరి తీసుకోనీయడంలేదు.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,