అతి వేగం ప్రమాదకరం.. రహదార్లపై ఎక్కడికక్కడ కనిపించే హెచ్చరిక బోర్డుల సారాంశం ఇది. కానీ ఏం లాభం.? ‘సిగరెట్ స్మోకింగ్ క్యాన్సర్ కారకం’ అని సిగరెట్ ప్యాకెట్లపై ముద్రిస్తున్నా, పొగరాయళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే వుంది.. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, వాటి ద్వారా వచ్చే లాభాలూ పెరుగుతున్నాయి.. క్యాన్సర్ కేసులూ, మరణాలూ పెరుగుతూనే వున్నాయి.
సినీ నిర్మాత నందమూరి జానకిరామ్ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అసలు ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టలేమా.? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాహనాలకు ‘వేగ నియంత్రణ వ్యవస్థ’లు తప్పనిసరి.. అని ఆ మధ్య పాలకులు హడావిడి చేశారు. ఆ తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది.రోడ్డు కాస్త బావుంటే.. సింగిల్ రోడ్ అయినా, గంటకు వంద నుంచి రెండొందల కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకుపోతున్నాయి.
విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్న అతి ఖరీదైన బైక్‌లే 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంటే, కార్లు, వోల్వో బస్సులు, లారీల పరిస్థితి ఇంకెలా వుంటుందో ఊహించుకోవడమే కష్టం. జాతీయ రహదార్లపై అడ్డదిడ్డంగా తిరిగే వాహనాలకు కొదవే వుండదు. నిన్నటి ప్రమాదం ఓ ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో రావడం వల్లే జరిగిందంటే రహదార్ల నిర్వహణ ఎంత చెత్తగా వుందో అర్థం చేసుకోవచ్చు.
రహదార్ల నిర్వహణ అంటే, రోడ్లను బాగు చేయడమే కాదు.. రోడ్డుపై వాహనాలు ఎలా ప్రయాణిస్తున్నాయి.? అన్న దానిపై పర్యవేక్షణ కూడా.. అన్న విషయాన్ని అంతా పక్కన పెట్టడంవల్లే రహదార్లు నిత్యం రక్తమోడుతున్నాయి. ఎర్రన్నాయుడు మరణించినప్పుడూ, ఆ తర్వాత ఇంకో సెలబ్రిటీ మరణించినప్పుడూ జాతీయ రహదార్ల నిర్వహణపై నిపుణుల నుంచి చాలా సూచనలొచ్చాయి.
కానీ, రహదార్ల నిర్వహణ మెరుగుపడలేదు. వేగంగా దూసుకెళ్ళే వాహనం వుంటే చాలు.. మృత్యువు వైపు వేగంగా పరుగులు పెట్టడమే.. అదృష్టం కలిసొస్తే గమ్యం చేరడం.. లేదంటే మృత్యుకౌగిలికి చేరుకోవడం. వేగాన్ని అదుపు చేస్తే సగం రహదారి మరణాల్ని నివారించొచ్చు. కానీ, అంత చిత్తశద్ధి పాలకుల్లో ఎక్కడుంది.?
జానకీరామ్ మృతి ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌పై పోలీసులు కేసులు పెట్టారట. పరారైన డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. పాలకుల నుంచి వేగ నియంత్రణపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటనా రాకపోవడం.. వారి చిత్తశుద్ధిని లోపాన్ని బయటపెడ్తోంది.