ఏకవీర….!

హస్తం పార్టీకి సమస్తం ఆయనే జారుకుంటున్న సహచరులు భారమవుతున్న బాధ్యత Advertisement పాపం.. రఘువీరారెడ్డి.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు.. నిజానికి ఈ పదవి బహు దొడ్డది, ఈ పదవి కోసం పరుగులు తీసిన…

హస్తం పార్టీకి సమస్తం ఆయనే
జారుకుంటున్న సహచరులు
భారమవుతున్న బాధ్యత

పాపం.. రఘువీరారెడ్డి.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు.. నిజానికి ఈ పదవి బహు దొడ్డది, ఈ పదవి కోసం పరుగులు తీసిన రోజులు ఉన్నాయి. ఎంతగానో పైరవీలు చేసిన సందర్బాలూ ఉన్నాయి. పీసీసీ చీఫ్ అంటే అదో ఇంద్ర సింహాసనమన్న భావన కూడా ఉంది. కాంగ్రెస్ వంటి అతి పురాతన పార్టీలో ఈ పదవి చేపట్టిన వారు మహా జాతకులన్న పేరూ ఉంది. పీసీసీ చీఫ్ అంటే తరువాయి ముఖ్యమంత్రి అన్న అర్ధమూ ఉంది. అటువంటిది ఇపుడు ఆ పదవి అంటే శిరోభారమవుతోంది, బాధ్యత అంటే ఇంత బరువా అనిపిస్తోంది. తెలియని దూరం, తరగని భారం.. ఇలా సాగుతోంది ఏపీ పీసీసీ చీఫ్ కథ.  విభజనకు ముందు ఉన్నప్పటి తీరు వేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే మోజు ఉండేది. పైగా ఏపీలో బలమైన పునాదులు కలిగిన పార్టీ నాడు. విభజన అనంతరం కథ అడ్డం తిరిగింది. ఇపుడు తెలంగాణాలో ఉనికిని చాటుకుంటూంటే ఏపీలో పునాదులు పూర్తిగా కదిలిపోయాయి. అసెంబ్లీ, పార్లమెంటులలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేని పార్టీగా ముద్ర పడింది. పైగా జనంలో చీత్కారభావం నిండా కమ్ముకున్న వేళ ఆ పార్టీ పెద్ద మనిషిగా జనంలోకి వెళ్లాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితి. చుట్టూ కారు చీకటి, కనుచూపు మేరలో కానరాదు గమ్యం. ఎడతెగని పోరాటం, ఫలితం లేని ఆరాటంగా ఏపీ కాంగ్రెస్ దుస్థితి ఉంది. దాని సారధిగా రఘువీరారెడ్డిది కడు దైన్య స్థితి. పార్టీలో అక్కడక్కడా మిగిలిన వాళ్లు కూడా జారుకుంటూంఠే ఒంటిచేత్తో కాడి మోస్తూ దుర్బరమైన భారాన్ని స్వయంగా అనుభవిస్తున్నారు.

హస్తం కకావికలైన వేళ…

గత ఏడాది విభజనకు తెర తీసిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కనుమరుగైంది. ఏకంగా లోక్‌సభలో ప్రతిపక్ష స్ధానానికి కూడా తగిన సంఖ్యాబలం లేని పరిస్థితి తలెత్తింది. ఇక, కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మరీ దారుణం. తెంగాణాలో అయితే, ఇచ్చామన్న పేరు కూడా లేకుండా పోయింది, పార్టీకి ప్రతిపక్ష ెదా మాత్రం కట్టబెట్టారు. ఇక, ఏపీలో చూసుకుంటే చట్ట సభలలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. పుట్టి బుద్ధెరిగి కాంగ్రెస్‌కు ఇటువంటి దురవస్థ ఎపుడూ పట్టలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను రెండుగా విభజించారు. తెలంగాణాకు పొన్నాల లక్ష్మయ్యను, ఏపీకి రఘువీరారెడ్డిని అధినాయకత్వం ఎంపిక చేసింది. నాడు ఈ పదవి కోసం కొంతలో కొంత పోటీ కూడా ఉంది. కనీసం పీసీసీ చీఫ్‌గానైనా ఉండవచ్చునని అనుకున్నారు చాలామంది అధికారం పోయినా ఏదో లాగించవచ్చునన్న ఆశతో. కానీ, ఎన్నికల ఫలితాలు చూస్తే దిమ్మదిరిగిపోయింది. పీసీసీ చీఫ్‌తో పాటు, అతిరధ మహారధులంతా ఓటమి పాలయ్యారు. మరోవైపు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ది దారుణమైన స్థితి. సమీప భవిష్యత్తులో కూడా కోలుకోలేదన్నది తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలలో రుజువవుతూ వచ్చిన సత్యం. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న వాళ్లు కూడా కాంగ్రెస్ పని ఖాళీ అన్న నిర్ణయానికి వచ్చేశారు. వారంతా కలసి వేరే పార్టీలలోకి జంప్ చేస్తున్నారు. మిగిలిన వారు కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు తప్ప, పార్టీ వైపు తొంగి చూడడంలేదు, వంగి వాలడంలేదు.

కన్నాతో మొదలైన జంపింగ్స్…

గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ కండువా కప్పకోవడం చిత్రాతిచిత్రం. విద్యార్ధి దశ నుంచి కాంగ్రెస్‌తోనే అనుబంధం పెనవేసుకున్న కన్నా లాంటి వారే పార్టీ నుంచి దూకేస్తే ఇక హస్తం పార్టీకి ఏపీలో దిక్కు ఎవరన్న మాట వినిపించడంలో తప్పులేదు. పీసీసీ చీఫ్ రాయలసీమకు చెందితే కోస్తాలో బలమైన సామాజికవర్గం నుంచి కొమ్ము కాస్తాడనుకున్న కన్నా ఇలా జారిపోవడంతో కాంగ్రెస్‌కు భారీగానే చిల్లు పడిందన్నది అవగతమైంది. కన్నా బాటలో మరికొందరు కూడా పయనించడానికి సిద్ధంగా ఉన్నారన్నదే ఇపుడు గుబులు పుట్టిస్తున్న సంగతి. విజయనగరం జిల్లాకు చెందిన పీసీసీ మాజీ చీఫ్, మరో బలమైన నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా  త్వరలో కమలతీర్ధం పుచ్చుకుని తరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇది హస్తం పార్టీకి ప్రమాద సంకేతంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్రలో బొత్స అనుచరులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారంతా కూడా పార్టీకి గుడ్‌బై కొడితే ఇక, ఉత్త హస్తం అవుతుందిక్కడ అనడంలో సందేహం లేదు. 

పట్టించుకోని చిరు….!

ప్రజారాజ్యం స్ధాపించి గత ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన తరువాత చిరంజీవికి కాంగ్రెస్ అధినాయకత్వం పెద్ద పీటనే వేసింది. ఏకంగా రాజ్యసభ సభ్యున్ని చేసేసి ఇండిపెండెంట్ ెదాలో మంత్రిని కూడా చేసింది. రెండేళ్ల పాటు అధికారాన్ని నిండుగా అనుభవించిన చిరంజీవి విభజన ముందూ, తరువాత కూడా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేదు. తనకు ఆశ్రయం ఇచ్చిన కాంగ్రెస్ గెలుపు కోసం గట్టిగా కృషి కూడా చేయలేదు. ఎన్నికల అనంతరం అసలు పార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఒంటరిగా పోరాడుతూంటే ఆయనకు అవసరమైన గ్రామర్‌ను, గ్లామర్‌ను అందించాల్సిన చిరంజీవి పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. చిరంజీవి రాజ్యసభ పదవీకాలం ఇంకా నాలుగేళ్ల వరకూ ఉంది. దాంతో, ఆయన నిబ్బరంగా ఉన్నారు. పదవీకాలం పూర్తి అయిన తరువాత ఆలోచన చేసుకోవచ్చునన్నది ఆయన ధీమాకు కారణం. ఏపీకి సంబంధించి పార్టీని పటిష్టం చేసేందుకు అధినాయకత్వం పలుమార్లు ఢిల్లీకి పిలిచినా కూడా చిరంజీవి గైర్ హాజరయ్యారు. ఇక, పార్టీకి జోష్ ఇవ్వాల్నిన ఈ నాయకుడు తన సొంత సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ పరిణామాలు స్వతహాగానే పీసీసీ చీఫ్‌ను హతాశున్ని చేస్తున్నాయి. 

నేరకపోయి…

పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే నేరకపోయి నెత్తిన బరువు పెట్టుకున్నాను అన్నట్లుగా తయారైంది. పార్టీ కోసం పనిచేయాలనుకున్నా సహకరించే వారు లేరు, రఘువీరారెడ్డి పేరుకు పీసీసీ చీఫ్ అయినా ఆయన జిల్లా స్ధాయి నాయకుడు మాత్రమే. జనాలను  రప్పించుకోగల ఆకర్షణ శక్తి లేదు, ఇక, వ్యూహ ప్రతి  వ్యూహాలను రచించడంలోనూ పెద్ద దిట్ట కాదు. కాంగ్రెస్ బొమ్మ మీద నెగ్గుకు రావాలి తప్ప, స్వయం ప్రతిభతో పార్టీని ముందుకు తీసుకుపోయే సామర్ధ్యం లేదు. ఆ మాటకు వస్తే పీసీసీ చీఫ్‌లందరికీ ఇదే కథ. కాంగ్రెస్ బలమైన పార్టీ కాబట్టి ఇంతవరకూ పీసీసీ చీఫ్‌లు కూడా బలంగానే కనిపిస్తున్నారు. పార్టీ ఇపుడు ఎన్నడూ లేనంతగా బలహీనపడింది. దాంతో, పీసీసీ చీఫ్‌లు కూడా ఇంకా బలహీనంగా కనిపిస్తున్నారు. అది రఘువీరా తప్పు కాదు, పార్టీ ఇలా కావడానికి అధినాయకత్వందే తప్పు. కానీ, ఇపుడు పీసీసీ సారధిగా ఆయన ఉండడం వల్ల కాంగ్రెస్ సోదిలోకి కూడా లేకుండా పోయిన నింద ఆయనపైనే పడుతోంది. ఏ జిల్లాకు ఆ జిల్లా కాంగ్రెస్ బలం నానాటికీ తగ్గిపోతోంది. కార్యకర్తలు కూడా చెల్లాచెదురైపోయారు. ఇపుడు జిల్లాకు బలమైన నాయకుడంటూ లేకుండా పోయాడు. పదమూడు జిల్లాలకు పీసీసీ చీఫ్‌గా ఉన్న రఘువీరాకు ఎటునుంచి ఎటు నరుక్కు రావాలన్నది ఇప్పటికీ సందేహంగా ఉంది. తమ వారెవరో తెలియదు, పరవారెవరో అంతకంటే తెలియదు. పార్టీ కోసం పనిచేసే వారిని ప్రోత్సహిద్దామనుకున్నా అలా వచ్చే వారూ కనిపించడంలేదు. ఓ వైపు టీడీపీ, బీజేపీ కాంబినేషన్ దూసుకుపోతూంటే, మరో వైపు వైసీపీ ప్రతిపక్ష పాత్రలో కుదురుకుపోయింది. ఆటలో అరటి పండు పాత్ర మాత్రమే కాంగ్రెస్‌కు మిగిలింది. దీంతో, ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు ఏపీ పీసీసీ చీఫ్. నిజంగా కాంగ్రెస్ రధ సారధులలో అత్యంత దురదృష్టవంతుల జాబితాలో రఘువీరాను ఉంచాల్సి ఉంటుంది, అలాగే, ఏకవీరగా ఆయనకు ట్యాగ్‌ను కూడా తగిలించాల్సి ఉంటుంది మరి.

పివిఎస్‌ఎస్ ప్రసాద్, 
విశాఖపట్నం,