సెప్టెంబర్ 21, ఆదివారం, ఉదయం 10 గంటల నించి సాయంత్రం 5 గం||వరకు బేఏరియా తెలుగు సాహిత్యాభిలాషులతో మిల్పిటాస్ స్వాగత్ హోటల్ కళకళలాడింది. సాహితీ మిత్రులు తమ “వీక్షణం” ద్వితీయవార్షికోత్సవాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత , కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మచిలీపట్నం 'సాహితీ మిత్రులు' సంస్థ అధ్యక్షులు, 'రావిరంగారావు సాహిత్యపీఠ' వ్యవస్థాపకులు డా. రావి రంగారావు గార్లు విశిష్ట అతిథులు..
వీక్షణం నిర్వాహకులు డా|| కె.గీత గారి ఆత్మీయ ఆహ్వానం తో సభ ప్రారంభమయింది. మొదటి సెషన్ కు అధ్యక్షులు డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. మొదటి వక్త రావి రంగారావు గారు.
రావి రంగారావు గారు 'బాల గేయాలు' అంశం పై ప్రసంగించారు. తరువాత అనిల్ రాయ్ గారు 'సోషల్ మీడియాలో కథ' అంశంగా ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. పిదప వేణు అసూరి గారు తెలుగు పద్యం మీద తనకున్న ప్రేమను, అభిరుచిని అత్యంత ఆకర్షణీయ మైన శైలిలో అభివ్యక్తీకరించారు. సింగారాచారి, అరిపిరాల విశ్వం వంటి ఉపాధ్యాయుల స్ఫూర్తి తోనే పద్యం పై మక్కువ పెరిగిందని తెలిపారు.
తరువాతి కార్యక్రమం పుస్తకావిష్కరణలు. ఇరవై రచనలతో కూడిన వీక్షణం ప్రత్యేక సంచిక -2014, ఇరువైనాలుగు నెలలుగా జరిగిన వీక్షణం సమావేశాల రివ్యూల సంచిక-ఈ రెండు ఈ- పత్రికలు తెర పైన ఆవిష్కరించబడినవి. శ్రీమతి శంషాద్ గారి తొలి వచన కవితా సంపుటి 'ఈ కిటికీ తెరచుకునేది ఊహల్లోకే' ను శ్రీ కిరణ్ ప్రభ, డా|| కె.గీత, శ్రీ ఇక్బాల్, రచయిత్రి భర్త అహ్మద్ గార్ల సమక్షంలో శ్రీ గంగిశెట్టి లక్ష్మి నారాయణ గారు, శ్రీ రావి రంగారావు గారు సంయుక్తం గా ఆవిష్కరించారు.
ఈ వేడుకల రెండవ సెషన్ రావి రంగారావు అధ్యక్షతన డా|| కె.గీతా మాధవి గారు శ్రావ్యం గా పాడిన కృష్ణశాస్త్రి గారి లలితగీతాలతో ప్రారంభమయింది.
డా|| కె.గీత గారికి 'రావి రంగారావు సాహిత్యపీఠం' సాహితీ మిత్రుల సంస్థ వారు కవితా రజతోత్సవ సాహిత్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
తదనంతర కార్యక్రమ అంశం శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి కీలక ప్రసంగం-“మహా భారతం -పర్వ పునః సృజన”. ప్రసిద్ధ కన్నడ రచయిత S.L.బైరప్ప మహాభారత ఇతిహాసాన్ని ఆధునిక క్లాసిక్ గా మలచి రచించిన “పర్వ” కు శ్రీ లక్ష్మీనారాయణ గారు తెలుగులో అనుసృజన చేసి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. అత్యంత ఆసక్తి దాయకంగా సాగిన వారి ప్రసంగం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. కిరణ్ ప్రభ గారు చరిత్ర పుటల్లో తెరమరుగైన అసామాన్య వ్యక్తి శ్రీ బంకుపల్లి మల్లయ్య గారి జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. తదుపరి కార్యక్రమం కవిసమ్మేళనం. చక్కని కవితలు వ్రాసిన పన్నెండు మంది కవులు సమ్మేళనం లో పాల్గొన్నారు.రావు తల్లాప్రగడ గారు 'అహంకార స్తోత్రం', శ్రీ నాగరాజు రామస్వామి 'ఆప్త సంధ్య', డా|| కె.గీత గారు 'అతనితో నడచే సాయంత్రం', శ్రీచరణ్ 'పద్యాలు', శ్రీమతి శంషాద్ 'ఇదే ఇదే పదే పడదే', వరకురు ప్రసాద్ గారు 'పని', ఇక్బాల్ గారు 'ఉపవాసం', రాచకొండ విజయలక్ష్మి గారు 'వీక్షణం ', వేణు ఆసూరి గారు 'అమ్మా నువ్వు గుర్తొచ్చావే' , రాధిక గారు 'రాబోయే తరం లో కనపడనివి', నరసింహాచార్యులు గారు 'కాలమహిమ' కవితలను వినిపించారు. చుక్కా శ్రీనివాస్ గారు బాల గంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం లోని 'నిన్న రాత్రి ' కవితకు ఆంగ్లానువాదం 'లాస్ట్ నైట్ ' వినిపించారు.
కిరణ్ ప్రభ గారి సాహిత్య క్విజ్ ఆసక్తి కరంగా జరిగింది. ఆఖరు గోష్ఠి 'ప్రత్యేక చర్చా కార్యక్రమం'. ఈ మధ్య విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు వేర్వేరు ప్రామాణిక భాషలు ఉండాలా అన్నది చర్చనీయాంశం. శ్రోతల నుండి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. చర్చ ఆసక్తి కరంగా సుహృద్భావ వాతావరణంలో కొనసాగింది. ఆరు గంటల పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ 'వీక్షణం' ద్వితీయ వార్షికోత్సవం ఆనంద సందోహంగా, ఆత్మీయ సంగమంగా ,సాహితీ వీక్షణ గమనంలో మరుపురాని మైలు రాయిగా మిగిలి పోయిందనడం లో సందేహం లేదు. ఈ సభలో కె.శారద, లెనిన్, పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్, గోపాల స్వామి, కాంతి పాతూరి, ప్రసాద్ మంగిన, రాధిక, మంజుల జొన్నలగడ్డ, సింధూర, అపర్ణ గునుపూడి మొ.లైన వారు పాల్గొన్నారు.