వీరమరణమేకదా.. నివాళులర్పించేద్దాం.!

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. అన్నది చాలా సర్వసాధారణమైన విషయం. ఎన్‌కౌంటర్‌లో సైన్యం చనిపోతుంది.. తీవ్రవాదులూ చనిపోతారు. ఇదీ సాధారణమైన విషయమే. పోరాటం జరుగుతూనే వుంది. చాలా సందర్భాల్లో తీవ్రవాదులకన్నా సైన్యమే ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తోంది.…

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. అన్నది చాలా సర్వసాధారణమైన విషయం. ఎన్‌కౌంటర్‌లో సైన్యం చనిపోతుంది.. తీవ్రవాదులూ చనిపోతారు. ఇదీ సాధారణమైన విషయమే. పోరాటం జరుగుతూనే వుంది. చాలా సందర్భాల్లో తీవ్రవాదులకన్నా సైన్యమే ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తోంది. కారణం, అక్కడ తీవ్రవాదులకు రక్షణ కవచంగా నిలుస్తోన్నది రాజకీయ నాయకులు. వేర్పాటువాదులే జమ్మూకాశ్మీర్‌లో రాజకీయాల్ని శాసిస్తారు. యువతని తీవ్రవాదులకి రక్షణ కవచంగా వినియోగించడం జమ్మూకాశ్మీర్‌లో చాలా మామూలు విషయం. పౌరుల మీదకేమో సైన్యం కాల్పులు జరపకూడదు.. పెల్లెట్‌ బుల్లెట్ల స్థానంలో చిల్లీ పౌడర్‌ బుల్లెట్లు ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. దాంతోపాటుగా, జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటువాదులతో చర్చలకోసం ప్రయత్నించింది. 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, జమ్మూకాశ్మీర్‌లో మారణహోమానికి కారణం వేర్పాటువాదులే. వారి అండదండలే లేకుంటే తీవ్రవాదాన్ని ఎప్పుడో ఏరిపారేసేదే సైన్యం. కానీ, అక్కడి రాజకీయాలు సైన్యాన్ని సైతం ప్రభావితం చేస్తున్నాయి. లేకపోతే, అఖిలపక్షం వెళ్ళి వేర్పాటువాదుల ఇళ్ళ ముందు మోకరిల్లడమేంటో, చర్చలకు ససేమిరా అని వేర్పాటువాదులు అనడమేంటి.? పైగా, వాళ్ళను వేర్పాటువాదులని అనకూడదంటూ.. కొత్త వాదనలేంటి.! 

తీవ్రవాదంతో పోరులో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.. తమ కుటుంబ సభ్యులు వీరమరణం పొందితే, బాధని పంటి బిగువున బిగబెట్టి, తాము ఆ తుపాకీని అందుకుంటామనీ, తీవ్రవాదులపై పోరాడతామనీ ఆ సైనికుల కుటుంబాల నుంచి మళ్ళీ సైన్యంలో చేరేందుకు వస్తున్నారు. కానీ, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు.? సైనికులు చనిపోతే నివాళులర్పించేస్తారు. వారి త్యాగాలకు వెలకడతారు. అంతే, ఆ తర్వాత వ్యవహారం మామూలే. వేర్పాటువాదుల ఇళ్ళ ముందు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వాలు కల్పిస్తున్నాయంటే, సైన్యం తాగాలకు విలువ ఏంటి.? 

తాజాగా జమ్మూకాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. నలుగురు తీవ్రవాదులు చనిపోతే, 17 మంది సైన్యం ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో ఇది అతి పెద్ద ఎన్‌కౌంటర్‌. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విదేశీ పర్యటనను రద్దు చేసకున్నారు. జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కానీ, చివరకు ఏం తేలుస్తారు.? ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు.? ఆ ఒక్కటీ మాత్రం అడగొద్దంతే.