వెంకయ్యపై అలిగిన చంద్రబాబు

కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుకు, తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య సంబంధాలు సరిగా లేవా? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. వెంకయ్యనాయుడు ద్వారా రాష్ట్రానికి అనేక…

కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుకు, తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య సంబంధాలు సరిగా లేవా? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. వెంకయ్యనాయుడు ద్వారా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు సాధించాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తుంటే, వెంకయ్య ఈ విషయంలో సహకరించడం లేదని, తనదైన స్వతంత్ర ధోరణిలో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు నెల రోజుల నుంచీ వారిద్దరూ కలుసుకున్న దాఖలాలు లేవు. వెంకయ్యనాయుడు పలుసార్లు హైదరాబాద్‌ వెళ్లినప్పటికీ చంద్రబాబునాయుడును ప్రత్యక్షంగా కలుసుకోలేదు. అదే విధంగా చంద్రబాబునాయుడు గత నెలరోజుల్లో రెండుసార్లు ఢిల్లీ వచ్చినప్పటికీ వెంకయ్యనాయుడును కలుసుకోలేదు. ఒకసారి చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు వెంకయ్య ఉద్దేశపూర్వకంగా రాజధానిలో లేకుండా పోయారు. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వచ్చి కేవలం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని పరామర్శించి వెళ్లిపోయారు. వెంకయ్యను కలుసుకోవడానికి కూడా ఆయన ప్రయత్నించలేదు. అయితే వారిద్దరూ ఫోన్లలో మాట్లాడుకున్నారని, వారిద్దరి మధ్య సంబంధాలు పైకి కనపడనంతగా చెడిపోలేదని అనేవారు కూడా ఉన్నారు. కాని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వారిద్దరూ ఎవరి గేమ్‌ వారు ఆడుతున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి వెంకయ్యనాయుడును నరేంద్రమోడీని కర్ణాటక నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్‌ కోటాలోకి ఎప్పుడో నెట్టేశారు. కర్ణాటక రాజకీయాల్లో తలదూర్చవద్దని వెంకయ్యనాయుడుకు ఆయన స్పష్టమైన ఆదేశాలనిచ్చారు. అదే సమయంలో తెలంగాణలో కూడా జోక్యం చేసుకోకూడదని వెంకయ్యకు ఆయన స్పష్టంగా చెప్పారు. వెంకయ్య జోక్యం వల్లే తెలంగాణలో బీజేపీ దెబ్బతిన్నదని ఆ పార్టీ తెలంగాణ నేతలు అధిష్ఠానవర్గానికి ఫిర్యాదు చేయడంతో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా వేగంగా పావులు కదిపారు. తెలంగాణకు చెందిన దత్తాత్రేయ, మురళీధర్‌ రావులను ఆయన ప్రోత్సహించడం ప్రారంభించారు. దత్తాత్రేయను కేంద్రమంత్రివర్గంలోకి రాకుండా వెంకయ్య చేసిన ప్రయత్నాలు తెలిసిన అమిత్‌షా ఆయనకు జాతీయ స్థానంలో పార్టీ ఉపాధ్యక్షుడుగా స్థానం కల్పించారు. తెలంగాణలో ఎవరి ప్రమేయం లేకుండా బీసీలను కలుపుకునేందుకు ప్రయత్నించాల్సిందిగా ఆయన దత్తాత్రేయను కోరారు. ఇక వెంకయ్యకు ఏమాత్రం తెలియకుండానే నరేంద్రమోడీ విద్యాసాగర్‌ రావును మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. 

కరీంనగర్‌కు చెందిన వెలమ అయిన విద్యాసాగర్‌ రావును పైకి ఎదగనీయకుండా వెంకయ్య చాలా కాలం పాటు తొక్కిపెట్టారు. వాజపేయి హయాంలో కేంద్రంలో కేబినెట్‌ పదవి రానివ్వలేదు. జాతీయ స్థాయిలో పార్టీలో ఆయనకు అవకాశం లేకుండా చేశారు. ఈ రీత్యా విద్యాసాగర్‌ను ప్రోత్సహించడమంటే వెంకయ్యను విస్మరించడమే. 2019 ఎన్నికలకు ముందు విద్యాసాగర్‌ రావును కేంద్రం మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పేందుకు పంపే అవకాశాలున్నాయి. అంతవరకు ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పమని పంపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ, తెలుగుదేశం సంబంధాలు 2014 ఎన్నికల్లో పొత్తు వరకే పరిమితమని, ఇప్పుడు బీజేపీ స్వంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాలని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ నేతలందరికీ పరోక్షంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయన రాంమాధవ్‌ లాంటి నేతలను ప్రోత్సహిస్తూ పార్టీ నిర్ణయాల్లో వెంకయ్యకు అవకాశం లేకుండా చేస్తున్నారు. బీజేపీ స్వయంగా ఎదిగేందుకు ప్రయత్నించాలని వెంకయ్యకు కూడా ఆయన చెప్పారు. అందువల్ల వెంకయ్య తరుచుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తల దూరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏది జరిగినా తన గొప్పేనని వెంకయ్య చెప్పుకుంటున్నారు. ఆఖరుకు దూరదర్శన్‌ విజయవాడ కేంద్రం పెట్టినా అది తన ఘనతేనని వెంకయ్య చెప్పుకున్నారు.

నిజానికి వెంకయ్యకు కేంద్రమంత్రి పదవి రావడం చంద్రబాబు చలవేనని, చంద్రబాబు తమ వారికే మంత్రి పదవులు కేటాయించాలని గట్టిగా పట్టుబడితే వెంకయ్యను పార్టీకి పంపించేవారనే ప్రచారం ఒకటున్నది. అందుకే వెంకయ్యకు పార్టీ పదవి ఇస్తారన్న లీక్‌ ఆయన వద్దనుంచే వెలువడిరది. కాని వెంకయ్య కేంద్ర పదవిలో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఆయనకే పదవి ఇవ్వాలని, తనకు పదవులు ముఖ్యంకాదని నరేంద్రమోడీకి చెప్పారు. అందువల్లే వెంకయ్యకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి పదవి దక్కిందని ఒక వర్గం ప్రచారం. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్య బలంగా పనిచేయడం, నరేంద్రమోడీ స్మార్ట్‌ సిటీల కార్యక్రమాన్ని వెంకయ్య బలంగా ముందుకు తీసుకెళ్లడంతో ఆయన సత్తా ఏమిటో తెలిసింది. అయితే అంత మాత్రాన చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చేందుకు వెంకయ్య ప్రయత్నిస్తానంటే నరేంద్రమోడీ ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రెవెన్యూలోటు పూర్తిపై వెంకయ్య గతంలో రాజ్యసభలో గట్టిగా పోరాడారు. కాని అయనే ఇప్పుడు ఇవన్నీ సాధించే విషయంలో తెలుగుదేశంకు సహకరించడం లేదు. ఇదే చంద్రబాబుకు ఆయనపై కోపం తెప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఏది చేసినా అది బీజేపీ చేసినట్లేనని ప్రచారం రావాలన్నదే మోడీ అభిప్రాయం. వచ్చే ఎన్నికల నాటికి పవన్‌ కళ్యాణ్‌తో కలిపి స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. అందువల్ల చంద్రబాబుకు పేరు తెచ్చే పని ఒక్కటీ వెంకయ్య చేయలేరు. ఆఖరుకు జగన్‌ను ఫినిష్‌ చేసేందుకు కూడా వెంకయ్య సహకరించే అవకాశం లేదు. చంద్రబాబు ఆత్మబంధువైన రాధాకృష్ణ ఛానెల్‌ను కేసీఆర్‌ నిషేధిస్తేనే వెంకయ్య ఏమీ చేయలేకపోయారు. ఇలాంటి వెంకయ్యపై చంద్రబాబు స్నేహంగా ఉండగలరా? అన్నదే పలువురి అనుమానం.

హరీష్