ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనేదానిపై నానా గందరగోళమూ సృష్టించి, చివరకి అంతా అనుకున్నట్టుగానే విజయవాడ పరిసరాల్లో రాసధాని.. అని తేల్చేసింది అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ. ‘అబ్బే.. రాజధానికి విజయవాడ అనుకూలం కాదు.. విజయవాడ – గుంటూరు మధ్య భూముల లభ్యత లేదు..’ ఇలాంటి కథనాలు కుప్పలు తెప్పలుగా వచ్చినా, రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే తేల్చినా, విజయవాడే రాజధాని అయ్యింది.
విజయవాడ దగ్గరలో కొత్త నగరాన్ని నిర్మించి, దాన్ని రాజధాని చేయాలనే ఆలోచనలో వుందిప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్. లక్ష కోట్లు సుమారుగా రాజధాని కోసం ఖర్చవుతాయని అంచనా కూడా వేశారు. ఆ సంగతలా వుంచితే, రాజధాని విషయంలో తెలుగు తమ్ముళ్ళు ముందే జాగ్రత్తపడ్డారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో భూముల్ని ఎడా పెడా కొనుగోలు చేసేశారు తెలుగు తమ్ముళ్ళు. వారిలో ఎంపీ సుజనా చౌదరి కూడా ఒకరు.
‘ఔను.. కంచికచర్లలో భూముల్ని కొన్నాను.. అది నా సొమ్ముతో కొన్న భూములు.. ప్రభుత్వం సొమ్ముతో కొనలేదు..’ అని సుజనా చౌదరి తాజాగా సెలవిచ్చారు. అధికార పార్టీ నేతలు భూములు తక్కువ ధరకి కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరలకు అమ్మేశారనే ఊహాగానాలు నిన్న మొన్నటిదాకా విన్పించగా.. ఇప్పుడది నిజమని తెలుస్తూ వుంది. గత ఎన్నికల్లో గెలుపు కోసం ‘కష్టపడ్డవారికి ఆర్థిక లబ్ది చేకూర్చే దిశగా’ పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్న విషయం విదితమే.
మొత్తమ్మీద, తెలుగు తమ్ముళ్ళు ఎంత జాగ్రత్తపడ్డారో.. ఇప్పటిదాకా గాసిప్స్ రూపంలో విన్పిస్తే.. ‘నిజమే..’ అంటున్నారిప్పుడు కొందరు నేతలు. ‘స్వార్జితం’ అని చెబుతున్నారుగానీ.. మతలబు ఏంటన్నది ఆ పైవాడికే తెలియాలి.