ఇటీవల కాలంలో మహారాష్ట్రలో మతఘర్షణలు హఠాత్తుగా పెరిగాయి. హిందూ ముస్లిములు కలహించుకోవడం అసాధారణమేమీ కాదు కానీ, ఒక ప్రణాళికతో రాజకీయకారణాలతో వీటిని ఎన్నికల సమయంలో రగిలించినట్టు కనబడుతోందని పరిశీలకులు అంటున్నారు. సతారా జిల్లాలోని కోరేగావ్ గ్రామంలో మే 31 అర్ధరాత్రి హఠాత్తుగా సైరన్ మోగింది. ఎందుకో చూద్దామని కొందరు అక్కడ పోగుపడ్డారు. కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఉపన్యసిస్తూ వారిని మతపరంగా రెచ్చగొట్టారు. అంతే ఆ గుంపు దాడులకు పాల్పడింది. దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగింది. బాధితుల్లో ఎక్కువమంది ముస్లిములే! ఆ సైరన్ చాలా ఏళ్లగా పని చేయడం లేదు. ఈ ఘటనకు ముందు ఎవరో కానీ దాన్ని రిపేరు చేయించి, వైర్లు తెచ్చి లౌడ్స్పీకర్లకు కలిపి రెడీ చేశారని పోలీసులు అంటున్నారు. కానీ అలా చేసినవారెవరో తెలియటం లేదంటున్నారు. ‘‘బాధిత ముస్లిములు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్కి వెళితే వందా రెండు వందల మంది బయట కాచుకుని వుంటున్నారు. భౌతికంగా ఏమీ చేయకపోయినా, ఏదైనా చేయగలమన్న భీతిని కలిగిస్తున్నారు.’’ అంటున్నాడు ఒక ముస్లిము.
కోరేగావ్ సంఘటన జరిగిన రెండు రోజులకు పుణెలో హిందూ రాష్ట్ర సేన అని చెప్పుకునే ఒక సంస్థ చేతిలో 24 ఏళ్ల ముస్లిము ఐటీ ఉద్యోగి చచ్చిపోయాడు. పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వారిలో ఆ సేన వ్యవస్థాపకుడు ధనంజయ్ దేశాయ్ కూడా వున్నాడు. జూన్ 1 న కోరెగావ్కు పక్కనే వున్న జలగావ్లో ఒక గుంపు మసీదుపై సుత్తులతో, గునపాలతో దాడి చేసి గోడలు పగలకొట్టింది. పోలీసులు చూస్తూ నిలబడ్డారు కానీ అడ్డుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే శశికాంత్ షిండే ముస్లిములను కలిసి దాడి చేసినవారి పేర్లు పైకి చెప్పకుండా వుంటే నష్టపరిహారం ఇప్పిస్తానని బేరం పెట్టాడట. ఎందుకంటే వాళ్లు అతని మనుష్యులే కాబట్టి! కల్లోలాలు రెచ్చగొట్టడానికి ఫేస్బుక్ చాలా ఉపయోగపడుతోంది. ఛత్రపతి శివాజీ, బాల ఠాక్రేల బొమ్మలు ఎవరోగాని వికృతం చేసి ఫేస్బుక్లో పెట్టారు. అంతే, పశ్చిమ మహారాష్ట్ర అంతా అల్లర్లు మొదలయ్యాయి. పుణె, కొల్హాపూర్, సతారాలలో జనసమూహాలు పోగుపడి నినాదాలు చేశాయి. స్థానిక శివసేన కార్యకర్తలు వారిని ఉద్దేశించి ఉపన్యాసాలు చేశారు. కొల్హాపూర్లో 200 బస్సులు మరో 0 వాహనాలను ధ్వంసం చేశారు. కొందరు ముస్లిముల ఇళ్లపై దాడులు జరిగాయి. ఘుడాన్ పీర్ దర్గాపై సుత్తులు, గునపాలతో తెగబడ్డారు.
రౌడీ వర్గాలు అల్లర్లు చేసినపుడు అన్ని వర్గాల వారూ నష్టపోతారు. కానీ ఇవి ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని ఎందుకు అనుమానం వస్తోందంటే – కొల్హాపూర్లో చెప్పులు అమ్మే షాపులు వందలాది వున్నా, కేవలం హాలీవుడ్ షూస్ దుకాణం మీద మాత్రమే దాడి జరిగింది. ఓనరు ముస్లిము. పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో ముస్లిముల బేకరీ షాపులన్నీ ధ్వంసం చేయబడ్డాయి. మసీదులు, దర్గాలపై దాడి జరిగింది. ఎందుకిలా అని అడిగితే కొల్హాపూర్ సిటీ బజరంగ్ దళ్ శాఖ అధ్యక్షుడు బందా సలోఖే ‘‘ఇక్కడ వున్న ముస్లిముల సంఖ్య అత్యల్పం. కానీ మసీదులెన్ని వున్నాయో తెలుసా? 161! అవసరమా!?’’ అని అడిగాడు. రాబోయే ఎన్నికలలో మతపరంగా ఓట్లను చీల్చుదామనే ప్రయత్నంలోనే ఇలాంటి విషయాలన్నిటిని చర్చకు తెస్తున్నారని అనుకోవచ్చు. మతపరమైన చీలిక నష్టదాయకమని సెప్టెంబరు 16 ఉపఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి కాబట్టి వీరి దూకుడు కాస్త తగ్గవచ్చు.
ఎమ్బీయస్ ప్రసాద్