పేరు చెప్పవా?…నీ రూపు చెప్పవా?

పేరు చెప్పనా?…నీ రూపు చెప్పనా?’…అనే సినిమా పాట ఉంది. దాన్ని కొద్దిగా మార్చుకొని ‘పేరు చెప్పవా?…నీ రూపు చెప్పవా? అని పాడుకుంటున్నారు జనం. ఇలా పాడుకునేది సామాన్య జనమే కాదు. అన్ని వర్గాల వారు.…

పేరు చెప్పనా?…నీ రూపు చెప్పనా?’…అనే సినిమా పాట ఉంది. దాన్ని కొద్దిగా మార్చుకొని ‘పేరు చెప్పవా?…నీ రూపు చెప్పవా? అని పాడుకుంటున్నారు జనం. ఇలా పాడుకునేది సామాన్య జనమే కాదు. అన్ని వర్గాల వారు. అన్ని రంగాలవారు.  ఇంతెందుకు? ఒక్కమాటలో చెప్పాలంటే ఆబాలగోపాలం. ఇంతకూ ఎవరి పేరు చెప్పాలి? ఎవరి రూపు చెప్పాలి? ఎవరైనా అమ్మాయా? కాదు. హీరోయినా? కాదు. మరెవరు? అసలు మనిషే కాదు. ఇంతకీ అసలెవరు? ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని. విజయవాడ పరిసరాల్లో నిర్మించాలని నిర్ణయమైన రాజధాని నగరం గురించి ఇప్పుడు  జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కొత్త రాజధాని ఎలా ఉంటుందోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే కాదు…తెలంగాణవారు కూడా. అంతర్జాతీయ నగరం హైదరాబాద్‌ రాజధానిగా ఉన్న తెలంగాణవారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎటువంటి రాజధాని కట్టుకుంటారోననే ఆసక్తి ఉంది. అందులోనూ హైదరాబాద్‌లో లక్షలాది మంది ఆంధ్రులు కూడా ఉన్నారు కదా…!  తమ సొంత రాష్ట్రంలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం కాబోతోందన్న వార్తలు వారికి ఆనందం కలిగిస్తున్నాయి. దానికి ఏం పేరు పెడతారు? ఎలా డిజైన్‌ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఎలా చేస్తారో నామక‘రణం’?
 
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడ నిర్మాణం కావాలో నిర్ణయమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అనుకున్నట్లుగానే చేశారు. విజయవాడ నగర పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించేసింది. దీన్ని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా స్వాగతించారు. రాజకీయ పార్టీలతో చర్చించకుండానే నిర్ణయించారని మొదట్లో కోపం తెచ్చుకున్నా రాజధానికి ఇంతకంటే మంచి ప్రాంతం లేదనుకున్నారో ఏమో ప్రభుత్వ నిర్ణయాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం లేస్తుందని, రాయలసీమ రగిలిపోతుందని, ముఖ్యంగా కర్నూలు కొరివిలా మండుతుందని అనేకమంది అనుకున్నారు. కాని…ఇప్పటివరకు రాష్ట్రం ప్రశాంతంగానే ఉంది. రాజధానిగా విజయవాడ ప్రాంతంపై పెద్దగా వ్యతిరేక పవనాలు వీచడంలేదు. అక్కడక్కడా నిరసన గళాలు వినబడుతున్నా అదంతా రాజకీయ క్రీడలో భాగమేననుకోవాలి. సో…విజయవాడ సమీపంలో కొత్త రాజధాని నగర నిర్మాణానికి నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఇక మిగిలింది దానికి నామకరణ మహోత్సవం. రాజధాని ప్రాంతం నిర్ణయంపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా పేరు పెట్టే విషయంలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పులు తప్పవనిపిస్తోంది. నామకరణం పదంలోనే ‘రణం’ అనేది కూడా ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా నిరసనలు వ్యక్తం కాక తప్పదు. ప్రధానంగా ఎవరో రాజకీయ నాయకుడి పేరు పెట్టాలనుకుంటే మాత్రం పెద్ద గొడవలయ్యే ప్రమాదం ఉంది. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ నాయకులకు కొదవలేదు. రాజుల కాలం నుంచి రాకెట్‌ యుగం వరకూ పదమూడు జిల్లాల్లోనూ అనేకమంది నాయకులున్నారు. ప్రతి జిల్లావారు తమ జిల్లా నాయకుడి పేరు  పెడితే బాగుంటుందని అనుకుంటారు. రాజధాని యోగం కోల్పోయిన జిల్లాలవారు కనీసం తమ జిల్లా నాయకుడి పేరు పెట్టినా తమకు న్యాయం జరుగుతుందని అనుకుంటారు. ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి కూడా. రాజధాని నిర్మాణం కృష్ణా జిల్లాలో జరుగుతోంది కాబట్టి ఆ జిల్లా నాయకుల పేరు పెట్టాలని అక్కడివారు అనుకుంటారు. కాబట్టి పేరు పెట్టడమనేది రాజధాని ప్రాంతం నిర్ణయించడమంత సులభం కాదనిపిస్తోంది. 

ఎన్టీఆర్‌ పేరు పెడతారనే అనుమానం?

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నటరత్న ఎన్‌టి రామారావు పేరు పెడతారనే అనుమానం ఎక్కువగా ఉంది. ఇదే విషయమై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారని టీడీపీ నాయకులు కొందరు చెబుతున్నారు. ఎన్‌టిఆర్‌ నగర్‌ అనో, తారకరామ నగర్‌ అనో నామకరణం చేస్తారని అనుకుంటున్నారు. రాజధాని నగరానికి ‘పెద్దాయన’ పేరు పెట్టి ఆయన పేరును చిరస్మరణీయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. ఎన్‌టిఆర్‌కు వెన్నుపోటు పొడిచారనే అపకీర్తిని మూటగట్టుకున్న చంద్రబాబు దాన్ని శాశ్వతంగా చెరిపేసుకోవాలని అనుకుంటున్నారేమో. అందుకు పరిహారంగా రాజధానికి ఎన్‌టిఆర్‌ పేరు పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు. ఎన్‌టిఆర్‌ పేరుతో విజయవాడలో హెల్త్‌ యూనివర్శిటీ ఉంది. అది ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుంది కాబట్టి ఆ పేరు మార్చే అవకాశం లేదు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం ప్రస్తుతం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టీడీపీ హయాంలో పునాదులు పడినా అది పూర్తయింది కాంగ్రెసు పాలనలో కాబట్టి  రాజీవ్‌ గాంధీ పేరు పెట్టారు. దానికి ఎన్‌టిఆర్‌ పేరు పెట్టాలని టీడీపీ అనేకసార్లు డిమాండ్‌ చేసింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఎన్‌టిఆర్‌ పేరు పెట్టే అవకాశం లేదు. కేసీఆర్‌ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ పేరు తీసేసి మరో పేరు పెట్టొచ్చు కూడా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు కడప జిల్లాకు పెట్టారు. టంగుటూరు ప్రకాశం పంతులుగారి పేరు ఒంగోలు జిల్లాకు పెట్టారు. కాబట్టి ఎన్‌టిఆర్‌పేరు రాజధానికి పెడితే తప్పేమిటని టీడీపీ నాయకులు వాదించవచ్చు. 

విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణానికి అన్ని అర్హతలున్నాయి. విజయవాడ ఎంపిక సరైనదేనని అత్యధికులు భావిస్తున్నారు. అయితే విజయవాడ ప్రాంతమే ఎంపిక కావడానికి ప్రధానంగా చంద్రబాబు సామాజికవర్గం చేసిన లాబీయింగ్‌ ప్రధాన పాత్ర పోషించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బాబు సామాజికవర్గం విస్తృతంగా ఉండటమే కాకుండా రాజకీయంగా, వాణిజ్యపరంగా బలంగా ఉంది. పార్టీ పరంగా చూసుకుంటే టీడీపీకి అనుకూలంగా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విజయవాడ మీదే దృష్టి పెట్టి  ఓ పథకం ప్రకారం దాన్ని రాజధానిగా నిర్ణయించారు. ఏది ఏమైనా దాదాపు అన్ని పార్టీలు విజయవాడ ప్రాంతాన్ని అంగీకరించాయి. వామపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఎన్‌టిఆర్‌ పేరు పెట్టేందుకు ప్రయత్నిస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.  రాజధాని ఎంపిక టీడీపీ సొంత వ్యవహారంలా తయారైందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయించారని వైసీపీ ఆగ్రహంగా ఉంది. ఎన్‌టిఆర్‌ పేరు నిర్ణయిస్తే రాయలసీమ జిల్లాల్లో ఆందోళనలు జరిగే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ, కాంగ్రెసు ఉద్యమించే అవకాశమూ ఉంది. కాబట్టి రాజధానికి పేరు నిర్ణయించడం బాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్‌టిఆర్‌ పేరును చిరస్థాయిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు పెద్దాయనకు భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. రాజధానికి కూడా ఆయన పేరు పెడితే తన వెన్నుపోటు పాపం ప్రక్షాళన అయిపోతుందని భావిస్తున్నట్లుగా ఉంది. అయితే అదంత సులభంగా తేలే విషయం కాదు.

సింగపూర్‌ కల…ఆర్థికం వెలవెల

చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సింగపూర్‌ పేరు జపిస్తున్నారు. అంతటి గొప్ప నగరం కట్టాలని తపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కలల్లో తేలియాడిస్తున్నారు. అందమైన పేర్లు పెట్టి ప్రచారం చేయడంలో బాబు సిద్ధహస్తుడు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌’ అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు సింగపూర్‌ పేరుతో ఊరిస్తున్నారు. కాని…పరిస్థితి చూస్తే ‘పేరు గొప్ప…ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంది. సింగపూర్‌ పేరుతో ప్రజలను కలల ప్రపంచంలోకి తీసుకువెళుతున్న బాబు అదే నోటితో ప్రతి రోజూ బీద అరుపులు అరుస్తున్నారు. పాలనకు వంద రోజులు నిండిన సందర్భంగా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఏడుపొస్తోందని అన్నారు. ఇతోధిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఆయన ఎంత అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాని మంత్రులు వెంకయ్య నాయుడు, తెలుగువారి కోడలైన నిర్మాలా సీతారామన్‌ ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ బాబు ఆశలను సజీవంగా ఉంచుతున్నారు. అంతేకాకుండా ఏపీ రాజధానిని స్మార్ట్‌ సిటీ చేస్తామని వెంకయ్య పదే పదే చెబుతున్నారు. ఆయన ఈమధ్య స్మార్ట్‌ సిటీ అంటూ ఒకటే జపం చేస్తున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ వంటి నాయకులు తేల్చిపారేశారు. వెంకయ్య తదితర మంత్రులు కేవలం ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఇక మూడేళ్లలో రాజధాని మొదటి దశ పూర్తి చేస్తామని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు. ఈయన ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ అందమైన రాజధానులుగా పేరున్న గాంధీనగర్‌, చండీఘడ్‌, నయా రాయ్‌పూర్‌లలో పర్యటించింది. ఈ నెలాఖరులో సింగపూర్‌, మలేషియా, చైనాకు వెళుతోంది. ఈ కమిటీ సింగపూర్‌ను, మలేషియా పరిపాలనా రాజధాని పుత్రజయను, చైనాలోని సుజోర్‌, షాన్కో, పెన్‌జాన్‌ నగరాలను పరిశీలిస్తుంది. ‘మీరు కోరితే సింగపూర్‌వంటి నగరం నిర్మించి ఇస్తాం’ అంటూ సింగపూర్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపాదన సరే…మరి నిధులు? రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా డబ్బు ఇచ్చే పరిస్థితి కనబడటంలేదు. విభజన సమయంలో  అంతచేస్తాం..ఇంత చేస్తాం అని హామీలు ఇచ్చిన భాజపా నాయకులు అధికారంలోకి వచ్చాక నీళ్లు నములుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ రాజధాని రూపం ఎలా ఉండబోతున్నదో ఊహించలేకుండా ఉన్నాం. సింగపూర్‌ సంగతి తరువాత ముందు కనీస సౌకర్యాలతో రాజధాని కట్టుకుంటే అదే పదివేలని, క్రమంగా అభివృద్ధి చేసుకోవచ్చని నాయకుల గొప్పలు నమ్మని విజ్ఞులు అంటున్నారు. 

-ఎం.నాగేందర్‌