రాజకీయ విమర్శో.. ఆరోపణో.. నిజమో.. పార్టీలో తన తర్వాతి పొజిషన్‌ని ఎవరికీ ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకోరు.. అన్న వాదనైతే రాజకీయాల్లో ప్రముఖంగా విన్పిస్తుంటుంది. ఒకప్పుడు హేమాహేమీలైన నాయకులు చంద్రబాబు వెంట వున్నారు. వారిలో ఎవరూ ఇప్పుడు రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు.. వున్నా అప్పుడున్నంత పవర్‌ఫుల్‌గా అయితే లేరన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు టీడీపీలో వున్నవారిలో దేవేందర్‌గౌడ్ ఒకప్పుడు చంద్రబాబు హయాంలో హోంమంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయనే టీడీపీలో నెంబర్ టూ. దేవేందర్‌గౌడ్, టీడీపీని వీడాక నాగం జనార్ధన్‌రెడ్డికి ఆ ప్లేస్ దక్కింది. ఇప్పుడు నాగం జనార్ధన్‌రెడ్డి బీజేపీలో వుంటే, దేవేందర్‌గౌడ్, టీడీపీలోనే వున్నా అనారోగ్య కారణాల రీత్యా తూతూ మంత్రంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, మాధవరెడ్డి తదితరులెవరూ జీవించి లేరిప్పుడు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు కీలక నేతల్లో ఒకరిగా వున్నా, ఇప్పుడాయన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, పైగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత వుంటుంది.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి కొందరు నేతలు, ‘చంద్రబాబు ఎవర్నీ ఓ పట్టాన నమ్మరు.. ఎవరిపైనా ఆయనకు నమ్మకం వుండదు..’ అని పార్టీని వీడుతూ చెప్పారు. పార్టీలు మారేటప్పుడు ఎవరైనా ఇలాంటి విమర్శలే చేస్తారుగానీ, చంద్రబాబు విషయంలో ఈ తరహా విమర్శలు మరీ ప్రత్యేకంగా వుంటాయి. కారణమేంటి.? అంటే, చంద్రబాబుకి అభద్రతా భావం ఎక్కువ.. స్వర్గీయ ఎన్టీఆర్‌ని టీడీపీకి దూరం చేసిన క్రమంలో, తనకెవరూ పోటీ వుండకూడదని భావించి, అప్పటినుంచీ తన తర్వాత తనంతటి స్థాయి ఇంకెవరికీ రాకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్తారట. కానీ, చంద్రబాబుకీ ఓ కోటరీ వుంటుంది. అధికారంలో వున్నా, లేకపోయినా ఫ్రెష్‌గా చంద్రబాబు ఓ కోటరీని మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. మామూలుగా ఏ పార్టీలో అయినా ఇలాంటి కోటరీలు వుంటాయిగానీ, చంద్రబాబు కోటరీ గురించే రాజకీయాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. ‘కోటరీ’ అన్న పదానికే చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అనేంతలా ‘కోటరీ’కి ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఆ కోటరీలో నెంబర్ టూ అనేవారెవరూ లేకుండా జాగ్రత్త పడటం చంద్రబాబు స్పెషాలిటీ.
ఇప్పుడిదంతా ఎందుకంటే, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణలో పార్టీని తానే అధ్యక్షుడిగా నడిపిస్తూ, తెలంగాణ శాఖకు కొందర్ని ‘నామ్ కే వాస్తే’ అన్నట్టు నామినేట్ చేశారు. ఆ కోటరీ సంగతి పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కోటరీ విషయానికొద్దాం. ఈ కోటరీకి సంబంధించి యమనల రామకృష్ణుడు, పల్లె రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు తదితరుల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. కోటరీలూ గట్రా ఏమీ వుండవ్.. అని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నా, పార్టీలో ‘కోటరీ’ అని చెప్పుకునే స్థాయిలో ఓ ‘బృందం’ చంద్రబాబు చుట్టూ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే వుంటుందన్నది ఓపెన్ సీక్రెట్. కోటరీ కారణంగా పార్టీలో కింది స్థాయి నేతలకు చంద్రబాబు అందుబాటులో వుండడంలేదన్న విమర్శలకైతే కొదవే లేదు. పోనీ ఆ కోటరీలో వున్న నేతల్లో నెంబర్ టూ అనదగ్గ వారెవరన్నా వున్నారా? అంటే, దానికి సమాధానం ‘లేదు’ అనే వస్తోంది. అసలేంటీ కోటరీ.. అసలు చంద్రబాబుని ప్రభావితం చేయగల వ్యక్తులు టీడీపీలో వుంటారా.? తన తర్వాత తనంతటి స్థాయిలో ఇంకో నాయకుడ్ని చంద్రబాబు ఎదగనిస్తారా.? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్యకాలంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతున్నాయి. మీడియాలో హడావిడి చేస్తున్నవాళ్ళు, తెరవెనుక సందడి చేస్తున్నవాళ్ళు.. ఇలా అందర్నీ లెక్కల్లోకి తీసుకుంటే ‘చంద్ర కోటరీ’ తప్ప, నెంబర్ టూ అన్న ప్రస్తావనకే ఎవరూ నామినేట్ అవరేమో అన్న అనుమానం కలగకమానదెవరికీ.
ఉప ముఖ్యమంత్రి.. ఆరో వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాబినెట్‌లో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిచ్చారు. వారిలో ఒకరు కేఈ కృష్ణమూర్తి కాగా, ఇంకొకరు చినరాజప్ప. ఉప ముఖ్యమంత్రులంటే చిన్నా చితకా పదవులేం కాదు కదా. కానీ, ఉప ముఖ్యమంత్రుల పరిస్థితేమీ అంత గొప్పగా కన్పించడంలేదాయె. కేఈ కృష్ణమూర్తినే తీసుకుంటే, ఆయన ఏ స్థాయి వైరాగ్యం ప్రదర్శిస్తున్నారో ఇటీవల ఆయన ప్రెస్‌మీట్లకు వెళ్తోన్న పాత్రికేయులకే స్పష్టంగా కన్పిస్తోంది. రాజధాని విషయంలో కేఈ కృష్ణమూర్తి పూర్తిస్థాయిలో అప్‌సెట్ అయి వున్నారు. ‘నా అంతట నేనే రాజధాని కమిటీలో వుండకూడదనుకున్నా.. ఎందుకో మీకు తెలుసు..’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారాయన. ‘పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, రాజధాని విషయంలో తనకన్నా ఎక్కువ ప్రాధాన్యత ప్రజా బలం లేకుండా మంత్రి అయిపోయిన నారాయణకే చంద్రబాబు ఇస్తుండడం.. ఇవన్నీ జీర్ణించుకోలేక, అధినేతను ఎదిరించలేక కేఈ కృష్ణమూర్తి మౌనంగా వున్నారు..’ అంటూ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో మీడియా ఆయన్ను ప్రశ్నిస్తే, ‘మీకు తెలుసు కదా..’ అని ఆయన కేఈ కృష్ణమూర్తి అనడం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనకున్న ఇమేజ్‌ని చెప్పకనే చెబుతోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్యని ఉద్దేశించి తెలంగాణలో కొందరు దళిత నేతలు ‘ఉప ముఖ్యమంత్రి పదవి ప్రాధాన్యత లేని ఆరో వేలు వంటిది.. దాన్ని కట్టబెట్టి, దళితులకు అన్యాయం చేశారు..’ అని కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ఆ ఆరో వేలి పరిస్థితే ఆంధ్రప్రదేశ్‌లోని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిది అని అనుకోవాలేమో. చిన రాజప్పకి కీలకమైన హోంశాఖను అప్పగించడంతోవ ఉన్నంతలో ఆయన యాక్టివ్‌గానే కన్పిస్తున్నారు. అయినప్పటికీ, ఆయనకు తన తర్వాత తనంతటి పొజిషన్‌లో చంద్రబాబు చూడగలుగుతారని అనుకోలేం.!
నారాయణ.. అంతా ఆయనేనా.. నిజమేనా.?
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో మంత్రి నారాయణ మాట్లాడుతున్నంతగా ఇంకెవరూ మాట్లాడింది లేదు. నారాయణ చెప్పిందే వేదం.. నారాయణ ఏపీ మ్యాప్‌లో కళ్ళు మూసుకుని ఎక్కడ వేలు పెడితే అదే రాజధాని.. అన్నంతగా ఆయన పేరు మార్మోగిపోయింది. కానీ, అనూహ్యంగా నారాయణ హవా కాస్త తగ్గినట్లే కన్పిస్తోంది. రాజధాని విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. అని క్లాస్ పీకే సరికి నారాయణ కాస్త నెమ్మదించారు. అయినా రాజధాని కమిటీకి ఆయనే కింగ్. కానీ, ‘ప్రజా బలం లేని..’ అన్న ఒక్క కోణం చాలు, నారాయణ ఇమేజ్ రాత్రికి నీరుగారిపోవడానికి. రాజధాని విషయంలో ఏ చిన్న పొరపాట్లు జరిగినా, ఆ పొరపాట్లకు నారాయణను బాధ్యుడిని చేయకుండా చంద్రబాబు వుంటారా.? నారాయణకు రాజధాని విషయంలో ఇచ్చిన ప్రాధాన్యత వెనుక చంద్రబాబు ట్రేడ్ మార్క్ వ్యూహం ఏమీ వుండదని నమ్మొచ్చా.? అంటే అది అనుమానమే.
షాడో సీఎం.!
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో బాగా విన్పిస్తోన్న పేరు సీఎం రమేష్‌దే. వాస్తవానికి గత కొంత కాలంగా సీఎం రమేష్ మీడియాలో ఎక్కువగా కన్పించడంలేదు. కానీ పేరులోనే ‘సీఎం’ పెట్టుకున్న సీఎం రమేష్‌గారు, చంద్రబాబుకి షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారట. తన పేరు, తన ఫేసు పైకి కన్పించకుండా తెరవెనుక వ్యవహారాల్ని సీఎం రమేష్ చక్కబెట్టేస్తున్నారనీ, ఇతర పార్టీలకు చెందిన నేతల్ని తమ పార్టీలోకి లాక్కురావడం వంటి కీలక విషయాల్ని సీఎం రమేష్ డీల్ చేస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అందెవేసిన చెయ్యి కావడంతో సీఎం రమేష్‌ని, కీలకమైన పనులకోసం చంద్రబాబు ‘ఉపయోగించుకుంటున్నారట’. అంటే సీఎం రమేష్ ‘షాడో’ సీఎం అనే కదా.!
ఈయనగారెంత చెబితే అంతేనట
సీఎం రమేష్ షాడో సీఎం అయితే, సుజనా చౌదరి ` చంద్రబాబుకి రైట్ హ్యాండ్ అనే చెప్పాలి. రాజధాని విషయంలో అయినా, ఇతరత్రా విషయాల్లో అయినా కేంద్రంతో సంప్రదింపులు జరపాలన్నా, పార్టీలో అసంతృప్తి పెరిగితే దాన్ని చల్లార్చాలన్నా.. అది సుజానా చౌదరికి మాత్రమే సాధ్యమని చంద్రబాబు విశ్వసిస్తున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. సుజనా చౌదరి అంటే ఆర్థికంగా టీడీపీకి బ్యాక్ బోన్.. అన్న వాదన ఈనాటిది కాదు. ఇప్పటికీ అదే వాదన బలంగా వుంది.. కాదు కాదు చాలా గట్టిగా విన్పిస్తోంది ఆ వాదన. తెలంగాణ నేతల్నీ సుజనా చౌదరి ‘సమన్వయం’ చేయగలుగుతుండడం గమనార్హమిక్కడ. ఒక్కమాటలో చెప్పాలంటే, గత కొంతకాలంగా చంద్రబాబుకి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారట సుజానా చౌదరి. ఆయనతోపాటు గల్లా జయదేవ్ కూడా చంద్రబాబుకి తెరపై కన్పించకుండా కుడిభుజంలా వ్యవహరిస్తున్నారని వినికిడి.
వాయిస్.. అలా ఉపయోగపడ్తోంది
ప్రజలకు ఏం చేస్తున్నామనే విషయం పక్కన పెడితే, విపక్షాల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం రాజకీయాల్లో ఓ ‘కళ’ అని అధికార పార్టీలు భావిస్తుంటాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలకన్నా ముందే వుంటుంది. ఈ విషయంలో మిగతావారికన్నా ముందుంటున్నారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఎర్రన్నాయుడు ఆకస్మిక మృతితో జిల్లాలో బలమైన నాయకుడిగా ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు మారిపోయారు. దాంతో అచ్చెన్నాయుడికి బోల్డంత ప్రాధాన్యతనిస్తున్నారు చంద్రబాబు. అధినేత ప్రోత్సాహంతో అచ్చెన్నాయుడు విపక్షాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్తున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో అచ్చెన్నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘సెహబాష్ అచ్చెన్నా..’ అంటూ చంద్రబాబు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించేశారట అప్పట్లో. అయితే ఏ పార్టీలో అయినా ఎక్కువగా ఆవేశపడేవాళ్ళు ఎక్కువ కాలం అదే పార్టీలో వుండలేరన్న వాదన లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం.
హడావిడి మంత్రిగారు…
అసెంబ్లీలో అయినా, క్యాబినెట్ మీటింగుల తర్వాత ప్రెస్ మీట్స్‌లో అయినా వివరణాత్మకంగా అన్నీ వివరించే విషయంలో పల్లె రఘునాథ్‌రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాగ్ధాటి విషయంలో ఈయన కాస్త వీక్ అన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ప్రతి విషయాన్నీ వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నంలో తడబాటు చెందుతున్న పల్లె, ప్రెస్‌మీట్స్ ద్వారా చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. యనమల రామకృష్ణుడు సహా పలువురు మంత్రులు ఈ తరహా హడావిడితోనే తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు.. ఇలా ఆయా వ్యక్తులకు చంద్రబాబు ఆయా బాధ్యతలు అప్పగించారన్నదైతే సుస్పష్టమవుతోంది. కానీ, చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నేతగా టీడీపీలో ఎవరికి చోటు దక్కే అవకాశం వుంది.? అంటే మాత్రం ఎవరూ ఖచ్చితంగా ఫలానా అని చెప్పలేని పరిస్థితి. అదే చంద్రబాబు మ్యాజిక్. పార్టీలో ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గానే కన్పిస్తున్నారు. విమర్శలు చేసే విపక్షాలపై ఎదురుదాడికి దిగడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం అవుతుండడంతో.. సమర్థవంతంగా బుకాయించడం.. అన్నిటికీ మించి అధినేతకు బాకా ఊదడం.. వంటి అంశాల్లో అధికార పార్టీ నేతలు పోటీ పడ్తున్నారనే చెప్పాలి. అంతలా చంద్రబాబు తనదైన అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్‌ని చూపించుకుంటున్నారు.
ముఖ్యమంత్రిగా వంద రోజుల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు చేసిందేంటబ్బా.? అని ఆలోచిస్తే మాత్రం.. ప్చ్.! అన్న ఆవేదనే మిగులుతుంది. పార్టీ పరంగా ఫుల్ మార్క్స్ సాధించేలా అడ్మినిస్ట్రేషన్‌ని సెటప్ చేసుకున్న చంద్రబాబు, పరిపాలన పరంగా మాత్రం.. ‘నత్త’ను తలపిస్తున్నారు. ఇంకా మూడు నెలలే కదా.. రానున్న రోజుల్లో పాలనని పరుగులు పెట్టిస్తాం.. అంటోన్న చంద్రబాబు, ఇంకో వంద రోజులు పూర్తయ్యాక ఏం మాటలు చెబుతారోగానీ, అప్పటికల్లా ఆయన కోటరీ మాత్రం మరింత బలపడ్తుందన్నది నిర్వివాదాంశం. పరిపాలన సంగతి సరే, ఇంతకీ, తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ ఎవరబ్బా.? ఆ ఒక్కటీ అడగొద్దంతే.!
-సింధు