విశాఖ.. విశాఖే

రాజధాని రాజసంతో మహా నగరం ఏపీకి దిక్సూచిగా ఖ్యాతి Advertisement విశాఖపట్నం.. అందమైన నగరమే కాదు, అభివృద్ధి నగరం కూడా. అందరి నగరం కూడా. విభజన తరువాత అమాంతం ఈ నగరం ఖ్యాతి పెరిగిపోయింది.…

రాజధాని రాజసంతో మహా నగరం
ఏపీకి దిక్సూచిగా ఖ్యాతి

విశాఖపట్నం.. అందమైన నగరమే కాదు, అభివృద్ధి నగరం కూడా. అందరి నగరం కూడా. విభజన తరువాత అమాంతం ఈ నగరం ఖ్యాతి పెరిగిపోయింది. మధ్యలో హుధ్‌హుధ్ తుపాను నగరాన్ని అతలాకుతలం చేసినా తన ప్రగతి పరుగు ఆగదని స్పష్టం చేస్తోంది ఓ వైపు రాజకీయ కార్యక్రమాలు, మరో వైపు ఐపీఎల్ క్రికెట్ సంబరాలు, ఇంకోవైపు సినిమా షూటింగులు.. మరో వైపు పర్యాటక, సాంస్కృతిక సందడి.. ఇలా విశాఖ నలు చెరగులా విస్తరిస్తోంది. తనకు తానే సాటి అని చెబుతోంది. అందరి నోళ్లలో వైజాగ్ నానుతోంది ఇప్పుడు. ఎన్నో జాతీయ స్ధాయి సమావేశాలకు వేదికగా వైజాగ్ నిలుస్తోంది. మరెన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలకు ఇక్కడే శ్రీకారం చుడుతున్నారు. అధికార ప్రముఖులెందరో ఈ ప్రాంతాన్ని పదే పదే సందర్శిస్తున్నారు. నిత్యం నాలుగైదు రకాలైన కార్యక్రమాలతో నగరం బిజీగా మారుతోంది. 

కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాని రోజు దాదాపుగా గడచిన ఆరు నెలల కాలంలో లేదంటే లేదు. ఆర్ధిక, పారిశ్రామిక, రాజకీయ కార్యకలాపాలకు విశాఖ అచ్చమైన స్ధావరంగా వెలుగొందుతోంది. విశాఖ ఇప్పుడు ఓ ప్రకటిత రాజధాని, విభజన తరువాత హైదరాబాద్‌కు దీటుగా. సాటిగా ఎదుగుతున్న మహా నగరం. విశాఖలో ఇప్పుడు జరుగుతున్న వరుస కార్యక్రమాలు, హడావుడి చూసిన వారెవరికైనా ఆరు నెలల క్రితం హుధ్‌హుధ్ తుపాను బారిన పడి అతలాకుతలమైన నగరం ఇదేనా అన్న అనుమానం రాకమానదు. 

నాడు కూకటి వేళ్లతో సహా దెబ్బతిని కుమిలిన ఈ ప్రాంతం ఇప్పుడు అంతే వేగంగా ఎదగడం విశాఖ ఘనతను, వర్తమాన పరిస్థితులలో దీనికి ఉన్న అవసరాన్ని తెలియచేస్తుంది. పదమూడు జిల్లాల ఏపీకి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న విశాఖ ప్రగతిని గతిని ఎవరూ ఆపలేరన్న ధీమాను కూడా కలుగచేస్తోంది. ఎవరి సహాయం లేకుండానే తనంతట తాను  వెలుగొందగలనన్న సత్యాన్ని కూడా తెలియచేస్తోంది. నిజానికి హుధ్‌హుధ్ తరువాత విశాఖ పని అయిపోయిందని అనుకున్న వారికి ఇప్పుడు నగరంలో కనిపిస్తున్న సందడి ఊహకందని వాస్తవంగానే ఉంది. 

విభజన తరువాత ఏపీకి విశాఖే సరైన రాజధాని అని అంతా అనుకున్నా కాదని వేరే ప్రాంతాన్ని ఎంపిక చేసినా కూడా తనేకమీ కాలేదని, కాదని కూడా నిరూపించుకున్న నగరంగానూ విశాఖ ఖ్యాతి గడించింది. ఓ విధంగా చెప్పా లంటే విశాఖ అప్రకటిత రాజ ధాని,  కొత్త రాజధాని వచ్చినా, మహా నగరాలు మరిన్ని ముస్తాబు చేసుకున్నా కూడా విశాఖ విశాఖే అన్న నగ్న సత్యాన్ని కూడా కళ్ల ముందు ఆవిష్కరింపచేసింది

నిత్యం విఐపీల సందడి

విశాఖలో వరుస కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అన్నీ చాలా ప్రధానమైనవే. అంతేనా, అన్నీ జాతీయ, రాష్ట్ర స్ధాయి కార్యక్రమాలే. వీటిలో పాలుపంచుకుంటున్న వారంతా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కీలకమైన నేతలే. గత వారం విశాఖలో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ కామన్వెల్త్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా పది దేశాలకు చెందిన స్పీకర్లు, ఇతర ప్రముఖులతో పాటు, దేశంలోని ఇరవై రాష్ట్రాలకు చెందిన స్పీకర్లు హాజరయ్యారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పాల్గొన్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు కూడా హాజరయ్యారు. అలాగే, ఎందరో వీఐపీలతో మూడు రోజుల పాటు విశాఖ కళకళలాడింది. అదే సమయంలో స్మార్ట్ సిటీపై రౌండ్ టేబిల్ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అలాగే, విశాఖలో నాలెడ్జి మిషన్‌ను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇలా ఒకే రోజు పలు కార్యక్రమాలలో అటు అధికారగణం, ఇటు రాజకీయ బృందం, మీడియా సైతం హడావుడి పడ్డారు. విశాఖలో వైజాగ్ ఫెస్టివల్‌ను వారం రోజుల పాటు తాజాగా నిర్వహించారు. . దేశంలోని కవులు విశాఖ వేదికగా చేరి సాహితీ కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. 

కుడి, ఎడమలకు వేదికగా…

విశాఖ సరైన వేదికగా భావించి రాజకీయ పార్టీలు తమ అతి ముఖ్యమైన సమావేశాలను, సదస్సును నిర్వహించుకోవడం కూడా ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇటీవలే నగరంలోని రుషికొండలో నిర్వహిరచారు. ఈ సమావేశాలకు రాష్ట్ర స్ధాయిలో కీలకమైన స్ధానాలలో ఉన్న బీజేపీ ప్రముఖులంతా హాజరు అయ్యారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులతో పాటు, కేంద్రంలో కీలకమైన నేతగా ఉన్న మంత్రి జెపి నడ్డా ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక, సీపీఎం 21వ జాతీయ స్ధాయి సమావేశాలు కూడా నగరం వేదికగా జరగడం విశేషం.  ఈ నెల 14వ తేదీ నుంచి వారం పాటు సీపీఎం 21వ జాతీయ మహాసభలు ఘనంగా జరిగాయి.్న ఈ సమావేశాలకు  దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన సీపీఎం ప్రముఖులు హాజరై  వారం పాటు నగరంలోనే సందడి చేశారు. 

ఐపీఎల్ ఫీస్ట్

క్రికెట్ అభిమానులకు కన్నుల పంటగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను కూడా విశాఖలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తొలి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్ధాన్ రాయల్స్ మధ్యన నిర్వహించారు. ఈ నెల 18, 22వ తేదీలలో కూడా మ్యాచ్‌లు కొనసాగాయి. విశాఖలోని వైఎస్‌ఆర్ క్రికెట్ స్డేడియం అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా నిలిచి క్రికెట్ అభిమానులను మురిపిస్తోంది. దాంతో, ఇటు ఉత్తరాంధ్ర, అటు ఉభయ గోదావరి జిల్లాల క్రీడాభిమానులు కూడా విశాఖ స్డేడియం వైపు చూస్తున్నారు. రానున్న రోజులలో మరిన్ని మెరుపులు మెరిపించేందుకు ఈ స్డేడియం సిద్ధంగా ఉంది. 

స్మార్ట్ సిటీ దిశగా…

విశాఖ పరిసరాలలో పలు జాతీయ విద్యా సంస్ధలు రానుండడం కూడా నగర ఖ్యాతిని ఇనుమడింపచేస్తోంది. ఆనందపురం గంభీరం వద్ద ఇప్పటికే ఐఐఎంకు శంకుస్ధాపన జరిగింది. విశాఖ. విజయనగరం జిల్లా సరిహద్దుగా ఉన్న కొత్తవలస వద్ద గిరిజన వర్శిటీ రాబోతోంది. సబ్బవరంలో న్యాయ విద్యాలయం ఏర్పాటైంది. ఇంకా పలు విద్యా సంస్ధలు కూడా విశాఖలో ఏర్పాటుకానున్నాయి. అలాగే, భారీ పరిశ్రమలు కూడా నగరానికి ప్రైవేటు రంగంలో రానున్నాయి. సింగపూర్, జపాన్‌లకు చెందిన పారిశ్రామికవేత్తల చూపు కూడా ఈ మహానగరంపైన ఉంది.  అదే విధంగా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం తధ్యంగా కనిపిస్తోంది. ఇక, మెట్రో రైలును కూడా విశాఖకు మంజూరు చేశారు. స్మార్ట్ సిటీ దిశగా విశాఖ ముందుకు సాగుతోంది. రానున్న కాలంలో విశాఖ ఏ విధంగా చూసినా తిరుగులేని స్ధాయికి చేరుకోబోతోందన్నది తధ్యమన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. సహజ సిద్దమైన ప్రకృతి అందాలకు నెలవైన విశాఖ సినీ రాజధానిగానూ, పర్యాటక కేంద్రంగానూ రాణించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయన్నది నిజం. ఏది ఏమైనా విశాఖ పేరు ఇపుడు జాతీయ, అంతర్జాతీయంగా మార్మోగుతోంది. 

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం.