ఉందిలే ‘గడ్డు కాలం’ ముందు ముందునా….!

2014 కాల గర్భంలో కలిసింది. దాంతోపాటే ముగ్గురు రథ సారథుల హనీమూన్ ముగిసింది. కొత్త ఆశలతో, కొంగొత్త కోరికలతో 2015 ప్రారంభమైంది. కాబట్టి ఆ ముగ్గురూ ఇంకా  హనీమూన్  మత్తులోనే ఉంటామంటే కుదరదు. ‘మత్తు…

2014 కాల గర్భంలో కలిసింది. దాంతోపాటే ముగ్గురు రథ సారథుల హనీమూన్ ముగిసింది. కొత్త ఆశలతో, కొంగొత్త కోరికలతో 2015 ప్రారంభమైంది. కాబట్టి ఆ ముగ్గురూ ఇంకా  హనీమూన్  మత్తులోనే ఉంటామంటే కుదరదు. ‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా’ అని ప్రజలు అప్పుడే పాడటం ప్రారంభించారు. అప్పటికీ మత్తు వదలకుండా ఇంకా కలల్లో విహరిస్తూ, ప్రజలకు అరచేతిలో స్వర్గాలు, వైకుంఠాలు చూపిస్తూ కాలం గడిపితే ‘చెప్పడమే మా ధర్మం…వినకపోతే మీ ఖర్మం’ అని కూడా జనం పాడతారు.  ఈ ముగ్గురు రథ సారథులు ఎవరో తెలుసు కదా…! కేంద్ర ప్రభుత్వ సారథి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు. 2014 డిసెంబరు నాటికి వీరి ఏడు నెలల పాలన అయిపోయింది. వీరు ఏం చేస్తున్నా, ఎన్ని  మాట్లాడుతున్నా ప్రజలు ఏమీ అనలేదు. కొత్తగా పరిపాలనకు వచ్చారు కాబట్టి కొత్త సంవత్సరం మొదలయ్యేదాకా హనీమూన్‌గా పరిగణిద్దామని అనుకున్నారు. కాబట్టి 2015 జనవరి నుంచి ప్రతిదీ కౌంట్ అవుతుంది. వచ్చే నాలుగేళ్లలో ఫలితాలు చూపించకపోతే గడ్డు కాలం పొంచి ఉంటుంది. ఈ ముగ్గురూ ఇక జాగ్రత్తగా ఉండాలని మీడియా కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉంది. 

మాటలతో ఎక్కువ కాలం గడపలేరు

ప్రధాని, ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ మాటకారులేననడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం నుంచి ఇప్పటివరకు వీరిని గమనిస్తే మాటల మాయాజాలం బాగా చేస్తున్నారనిపిస్తోంది. ఈ మాటల ఇంద్రజాలానికి మీడియాలో బాగానే ప్రచారం లభిస్తోంది. పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ‘పలుకే బంగారమాయెనా’ టైపులో ఉంటే, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ గలగల పారే సెలయేరులా అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటల మత్తులో విదేశీయులు సైతం తూగిపోయారు. జోగిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ యావత్ ప్రపంచాన్ని సమ్మోహనపరిచారు. కొందరు ఆయన్ని స్వామి వివేకానందతో పోల్చారు. స్వామీజీకి, ఈయనకు పోలిక ఏమిటంటారా? ఒకప్పడు అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలో స్వామి వివేకానంద అద్భుతమైన ప్రసంగం చేసి ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు. అదేవిధంగా మోదీ అమెరికాలో చేసిన ప్రసంగాలు ఉర్రూతలూపాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది వాస్తవం కూడా. 

అనర్గళంగా, సమ్మోహనకరంగా ప్రసంగించడం ఏ నాయకుడికైనా చక్కటి క్వాలిఫికేషనే. సందేహం లేదు. కాని మాటలతోపాటు చేతలు  కూడా సమ్మోహనకరంగా ఉన్నప్పుడే పాలన సమన్వయంతో సాగుతుంది. మోదీ ఇప్పటివరకు ఈ మార్గంలో ప్రయాణించలేదనే విమర్శలున్నాయి. ఆయన విదేశాల్లోనే ఎక్కువకాలం గడుపుతున్నారని, అప్పుడప్పుడు మాత్రమే ఇండియాకు వస్తున్నారంటూ విమర్శనాత్మకమైన జోకులు పేలుతున్నాయి. ఇప్పటివరకూ ఆయన ‘పనిమంతుడి’ కంటే చక్కటి వక్తగా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడుపుతున్న నాయకుడిగా పేరు పొందారు. ‘ఇది మోదీ ఏడాదే’ అని ఓ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఇందులో సందేహం లేదు. ఆయన విశ్వరూపం ముందు మంత్రులు మరుగుజ్జులైపోయారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా దుర్ఘటన నేపథ్యంలో జరిగిన మత కలహాల కారణంగా ‘నరమేధం’ సృష్టించిన దుర్మార్గుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ కారణంగానే కదా అమెరికా కూడా ఆయన్ని తమ దేశం గడప తొక్కనివ్వలేదు. 

కాని ప్రధాని అయ్యాక ఆయన దుర్మార్గమూ క్రమంగా మరుగున పడిపోతోంది. అకృత్యాల్లో మోదీకి కుడిభజంగా ఉన్న ప్రస్తుత బాజపా అధ్యక్షుడు అమిత్‌షాకు కూడా న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇస్తున్నాయి. మోదీఅమిత్ ద్వయం దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించేందుకు తీవ్ర కృషి చేస్తోంది. ఓ పక్క ఎనలేని కీర్తిని సాధిస్తున్న మోదీ, మరో పక్క యుపిఎ ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నారు. ఆయన కొత్తగా ఏమీ చేయడంలేదనే విమర్శలున్నాయి.   ఆయన మానస పుత్రిక ‘స్వచ్ఛ భారత్’ ఓ ప్రహసనంలా మారింది.  మోదీ కార్పొరేట్లకు కొంగు బంగారంగా మారుతున్నారు. అందుకే వారి చేతిలో ఉన్న మీడియా మోదీకి విపరీతమైన ప్రచారం కల్పిస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో తనకు ఎదురులేకుండా చేసుకున్న మోదీ అహంకారంతో నియంతగా మారే అవకాశమూ ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాటలతో కోటలు కడుతున్నారని, చేతలు తక్కువగా ఉన్నాయినే విమర్శలు వస్తున్నాయి. 

సతమతమవుతున్న కేసీఆర్ ‘దొర’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మరాఠీ అనే సంగతి అందరికీ తెలుసు. ఎదుటివారిని సమ్మోహనపరిచేలా మాట్లాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో తెలుసు. తెలంగాణ సెంటిమెంటును ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. ‘ఆంధ్రోళ్ల దోపిడీ’ అనే సెంటిమెంటుతో ఇప్పటి వరకూ లాక్కొచ్చిన కేసీఆర్ కొత్త సంవత్సరంలోనైనా వాస్తవాలను గ్రహిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇంకా సెంటిమెంటుతో ప్రజలను మభ్యపెట్టడం కుదరదంటున్నారు. 2014 పూర్తిగా పొరుగు రాష్ర్టంతో వివాద పడటంతోనే గడిచిపోయింది. చివరకు కేసీఆర్ తన ముఖ్యమంత్రి స్థాయిని మరిచిపోయి పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించారు. పొరుగు రాష్ర్టంతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం కంటే తెలంగాణకు చంద్రబాబును ఓ శత్రువుగా చిత్రీకరించి, ఆయన కారణంగానే సమస్యలు వస్తున్నాయని ప్రచారం చేసి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం కనబడుతోంది. 2014 చివరి వరకు కేసీఆర్ హడావుడి చేయడం తప్ప తెలంగాణకు ఒరిగించింది ఏమీ లేదనే విమర్శలు వున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన పరంగా, పార్టీ పరంగా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. 

పొరుగున ఉన్నది తెలుగు రాష్ర్టం కావడం, అక్కడ అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం, ఆయన పార్టీ తెలంగాణలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో బలంగా ఉండటం, తెలంగాణ ప్రజలు అభివృద్ధి విషయంలో ఆంధ్రతో పొల్చి చూస్తుండటం….ఇలాంటివన్నీ ఆయన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. నిన్న మొన్నటివరకు కేంద్రంతోనూ సఖ్యత లేదు. ఇప్పుడిప్పుడే కేంద్రానికి దగ్గరవుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. కేసీఆర్‌కు ప్రతి విషయం గోరంతలు కొండతలు చేసి చెప్పడం అలవాటైంది. తాను చేపట్టే ప్రతి పని మీద హైప్ సృష్టించడం నేర్చుకున్నారు. ‘ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా’…‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా’…మొదలైనవి ఆయనకు ఊత పదాలుగా మారాయి. చివరకు ఈ పదాలు ఆయనేక ప్రతిబంధకాలుగా తయారయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆయన గోరంతలను కొండంతలు చేసి వర్ణిస్తున్న స్థాయిలో పనులు కాకపోతే ప్రజలు నిలదీస్తారు. ఇక కేసీఆర్‌లోని ‘దొర’ లక్షణాలు ఈ ఏడు నెలల కాలంలో బయటపడ్డాయి. రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింటుగా మారింది. 

తాను ఏం చేసినా సొంత పార్టీవారే కాక, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నించలేవనే అహంకారం బాగా పెరిగింది. తెలంగాణలోని బడా మీడియా ఆయనకు పాదాక్రాంతం అయింది.  ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌పై ఇంకా నిషేధం కొనసాగుతుండటం కేసీఆర్ దొరతనానికి నిదర్శనంగా చెప్పకోవచ్చు. ఒక ప్రజాస్వామ్య దేశంలో మీడియా నిషేధాన్ని (ఈ వ్యాసం రాసే సమయానికి 201 రోజులు) ఎవ్వరూ పట్టించుకోకపోవడం దురదృష్టకరం. మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా పూర్తిగా పురుష కేబినెట్‌ను ఏర్పాటు చేసినా  గట్టిగా ప్రశ్నించేవారు లేరు. ప్రస్తుతం ఆయన ఆడింది ఆటగా సాగుతున్నా ఇది ఎక్కువకాలం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో నిరసన గూడు కట్టుకుంటోందని అంటున్నారు. అది బయటపడాలంటే ఎన్నికలు రావాలి. త్వరలో జరగబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఫలితాలు వస్తే కేసీఆర్ పాలనకు ప్రమాద ఘంటికలు మోగినట్లే. 

టీఆర్‌ఎస్‌లో అంత​ర్గత కలహాలు?

దీర్ఘకాలం నుంచి పార్టీలో ఉన్నవారికి కాకుండా వలస నాయకులకు కీలక మంత్రి పదవులు ఇవ్వడం, ఉమ్మడి రాష్ర్టంలో ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించినవారికి పెద్ద పీట వేయడంతో పార్టీలో అసంతృప్తి చెలరేగుతోంది. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందిన తుమ్మల నాగేశ్వరరావు రెండు వారాలు దాటిపోయినా ఇప్పటివరకు బాధ్యతలు స్వీకరించలేదు. అయినా కేసీఆర్ పట్టించుకోవడంలేదు. ఈమధ్య కేసీఆర్ కుమారుడు, మంత్రి అయిన కేటీఆర్ మంత్రివర్గ సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ లుకలుకలే ఇందుకు కారణమని అంటున్నారు. పరిపాలనను, పార్టీ వ్యవహారాలను కేసీఆర్ ఏకకాలంలో నిర్వహించలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి కుమారుడికి అప్పచెబుతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. పాలనాపరమైన అనేక అంశాల్లో  కేసీఆర్ ముందు ముందు గడ్డు పరిస్థితి ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితి కూడా పైన పటారం..లోన లొటారం చందంగా ఉందని మంత్రులు చేస్తున్న ప్రకటనలే చెబుతున్నాయి. 

కలల్లో చంద్రబాబు….కష్టాల్లో ఆంధ్రప్రదేశ్

ప్రజలను కలల్లో విహరింపచేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడూ తక్కువ తినలేదు. అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఆంధ్ర ప్రజలను ఆయన కలల్లో ముంచేశారు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఆయన చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎట్టేకలకు రాజధాని కట్టబోయే ప్రాంతమేదో నిర్ణయించి అధికారికంగా చట్టం చేసిన చంద్రబాబు ఈ విషయంలో తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. రాజధాని విషయంలో హైడ్రామాలు జరిగిన నేపథ్యంలో బాబులో పారదర్శకత, నిజాయితీ లోపించాయనే విమర్శలు వినవస్తున్నాయి. సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తామని కుర్చీ ఎక్కగానే ఊరించిన బాబు ఆ కలలను సజీవంగా ఉంచేలా నానా హడావిడి చేశారు.

రాజధాని నిర్మాణంపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్  కమిటీ సిఫార్సులను పూర్తిగా పక్కకు పెట్టేశారు. వాస్తుపై విపరీతంగా నమ్మకం పెరిగిన చంద్రబాబు ఎట్టేకలకు ఏడాదికి మూడు పంటలు పండే సుక్షేత్రాలను రాజదాని నిర్మాణానికి తీసుకున్నారు. వాస్తుపై నమ్మకం అలా ఉంచితే రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతం సరైనదేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టవిటీ, పుష్కలమైన నీరు ఉన్న ఈ ప్రాంతం రాజధానికి అన్ని విధాల అనుకూలమైందని చెబుతున్నారు. రియల్‌ఎస్టేట్ వర్గాల ప్రయోజనాలు కూడా ఇందులో దాగిఉన్నాయనేది కొందరి విమర్శ. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించిన బాబు ప్రస్తుతం తానూ అదే బాటలో నడస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సెజ్ పేరుతో వేల ఎకరాల పంట భూములు తీసుకున్నారని అప్పట్లో బాబు విమర్శించారు. 

అది రాష్ర్టం అంతటికీ సంబంధించిన వ్యవహారమైతే ఇప్పుడు ఒక్కచోటనే వేల ఎకరాలు సేకరించారు. ఇక రాజధాని నిర్మాణం పేరుతో విదేశాలు తెలుగు రాష్ట్రానికి పరుగెత్తుకొని వస్తున్నాయి. మేం సహకరిస్తామంటే మేం సహకరిస్తామని పోటీలు పడుతున్నాయి. వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చాలి.  మొత్తం మీద రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుందో తెలియదు. దీనికి కేంద్రం ఎంత వరకు, ఎంతమేరకు ఆర్థిక సాయం అందిస్తుందో తెలియదు. తుపాను సాయమే ఇప్పటివరకూ సరిగా అందలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఎంతవరకు ఆదుకుంటుందో బాబుకు కూడా తెలియదు. ‘చంద్రబాబు హైదరాబాదును మించిన రాజధాని నిర్మిస్తే చెవులు కోయించుకుంటా’ అని సీపీఐ నాయకుడు నారాయణ సవాల్ చేశారు. ఒకవేళ అదే నిజమైతే బాబుకు గడ్డు కాలం ఎదురైనట్లే. 

మిత్రుల మధ్య బంధం సడలితే అభివృద్ధికి విఘాతమే

టీడీపీబీజేపీ మిత్ర బంధం వచ్చే ఎన్నికల్లో  కొనసాగుతుందా? ఈలోగానే అంతరిస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మిత్ర బంధం ఎక్కువ కాలం ఉండదంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీగా ఎదగాలని భాజపా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అంతరం పెరిగే అవకాశముంది. ఈ అనుమానాలు నిజం చేసేవిధంగా ఇరు పార్టీల నాయకులు అప్పడప్పుడూ ప్రకటనలు ఇస్తున్నారు. విభజన సమయంలో ఆంధ్రను అన్నివిధాల ఆదుకుంటామని చెప్పిన భాజపా అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండటం, ప్రత్యేక హోదా పై కొర్రీలు పెడుతుండటం, రాయితీల విషయం తేల్చకపోవడం మొదలైనవన్నీ టీడీపీలో అసంతృప్తి పెంచుతున్నాయి. ఎన్నికల లోగానే రెండు పార్టీల మద్య విభేదాలు రాజుకుంటే ఆ ప్రభావం రాష్ర్టంపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవడంతోపాటు పొరుగు రాష్ర్టమైన తెలంగాణతో సమస్యలు పరిష్కరించుకోవల్సి ఉంటుంది.

స్వప్నాలు, స్వర్గాలు వద్దు

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను స్వప్నాల్లో విహరింపచేయడం, స్వర్గాలు సృష్టించడం మానుకోవాలి. బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి ప్రచారాలు మానేయాలి. ఆర్థిక పరిస్థితిని బట్టి మాట్లాడాలి. ఉన్న వాస్తవాలు ప్రజలకు వివరించాలి. ప్రాధాన్యతా  క్రమంలో పనులు చేయాలి. సింగపూర్, ఇస్తాంబుల్, ట్యునీసియా చేస్తామంటూ ఊరించడం మానేయాలి. ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు కట్టడం తరువాత ముందుగా మౌలిక సమస్యలు తీర్చాలి. ఆంధ్ర రాజధానిని లండన్ తరహాలో తీర్చిదిద్దడం తరువాత ముందుగా ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగా ఉట్టికెగిరితే తరువాత స్వర్గానికి ఎగరొచ్చు. 

ఎం.నాగేందర్