హైదరాబాదులో యువ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసిన నలుగురు నరరూప రాక్షసులను చంపేయాలని జనం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఉరేయాలని నినదిస్తున్నారు. విచారణ పేరుతో ఆ మృగాలను జైల్లో కూర్చోబెట్టి మేపడం కాదు, మాకు అప్పగించండి సరైన శిక్ష మేం విధిస్తాం అంటూ షాద్‌నగర్ పోలీసు స్టేషన్ ముదు, చర్లపల్లి జైలు ముందు అగ్నిపర్వతాలై ఆవేశంతో ఊగిపోయారు. తమ కొడుకులను చంపేయండని వారి తల్లులు కూడా చెప్పారు. ఈ దుర్మార్గులు ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం నేరం చేశారని స్పష్టంగా తెలిశాక వెంటనే శిక్ష విధించకుండా విచారణ పేరుతో జాప్యం ఎందుకని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు.
'చట్టం చేతులు చాలా పొడుగు' అంటుంటారు కొందరు మేధావులు. కాని అంత పొడుగైన చేతులు అత్యాచారం కేసులో ఎందుకు కఠిన శిక్షలు వేయడంలేదు? ఒకవేళ వేసినా ఎందుకు ఏళ్ల తరబడి అమలు చేయడంలేదు? అనే ప్రశ్నలకు జవాబులు లేవు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ 'ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా విచారణ పూర్తయ్యేలా చూస్తాం' అంటూ రొటీన్‌గా పోలీసు అధికారులు ఇచ్చే స్టేట్మెంటే ఇచ్చాడు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని గవర్నర్ తమిళిసై ప్రియాంక కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారు కరెక్టే. విచారణ త్వరగా పూర్తి చేస్తారు కరెక్టే. కాని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడుతున్నాయా? అనేది ప్రశ్న. జనం దృష్టిలో కఠిన శిక్ష అంటే మరణ శిక్షే. కొందరు మేధావులు, మానవహక్కుల నేతలు మరణ శిక్షను అంగీకరించకపోయినా సుప్రీం కోర్టు ఏనాడో సమర్థించింది.
అత్యంత తీవ్ర నేరాల విషయంలోనే చాలా అరుదుగా మరణశిక్ష అమలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ శిక్ష అమలుకు కూడా ఏళ్లూ పూళ్లూ పడుతోంది. ఇందుకు ఉదాహరణ..ఢిల్లీలో నిర్భయ కేసు. 2012లో ఢిల్లీలో నిర్భయ కేసు తరువాత అంతటి తీవ్ర సంచనలం కలిగించింది ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య ఘటన. ఆనాడు ఢిల్లీలో బలైపోయింది కూడా యువ వైద్యురాలే. ఢిల్లీ నిర్భయ కేసులో కింది కోర్టు విధించిన మరణ శిక్షను హైకోర్టు, సుప్రీం కోర్టు సమర్థించి ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు దోషులకు మరణ దండన అమలు చేయలేదు. ఈమధ్యనే దోషులకు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం కల్పించారు. ఇందుకు ఏడు రోజుల సమయం ఇచ్చారు. ఆ తరువాత ఏమైందో తెలియలేదు.
దుర్మార్గులకు శిక్ష వెంటనే అమలు చేయకుండా క్షమాభిక్ష కోరుకోమనడం ఏమిటి? అప్పట్లో ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు కూడా. నిర్భయ కేసులో నిందితులు దోషులని తేలాక, మరణ శిక్షను సుప్రీం కోర్టు సమర్థించాక ఇంత జాప్యం ఎందుకో అర్థం కావడంలేదు. వరంగల్ జిల్లా హన్మకొండలో గత ఏడాది ఒక ముష్కరుడు 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 48 రోజుల్లో విచారణ పూర్తి చేసి మరణశిక్ష విధించాలని తీర్పు ఇచ్చింది. కాని హైకోర్టు దీన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. తుది శ్వాస విడిచేవరకు జైల్లో ఉంచాలని ఆదేశించింది. చాలా అత్యాచార కేసుల్లో కఠిన శిక్షలు పడటం లేదనేది వాస్తవం. ముఖ్యంగా పేదల కుటుంబాలకు న్యాయం జరగడంలేదు.
మైనర్లపై అత్యాచారం చేస్తే మరణదండనే అని కొంతకాలం కిందట కేంద్రం ప్రకటించింది. కాని అమలు జరుగుతోందా? అందుకే జనం దోషులను అప్పగిస్తే తామే శిక్షస్తామంటున్నారు. ఈ దేశంలో రానురాను మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అత్యాచారాలు, అకృత్యాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దోషులను పబ్లిగ్గా ఉరితీయాలనే జనం ఆగ్రహం, డిమాండ్ కరెక్టని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి క్రూర మృగాళ్లను ఉరితీస్తే సమాజానికి ఏమైనా నష్టమా? మానవత్వం మంటగలుస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక రెడ్డిపై కిరాతకం తరువాత ఆగ్రహంతో, ఆవేశంతో ఊగిపోతున్న ప్రజలు 'వరంగల్ ఎన్కౌంటర్' గుర్తు చేస్తున్నారు. ఓ చర్చా కార్యక్రమంలో కాంగ్రెసు అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కూడా ఈ సంగతి గుర్తు చేశారు.
వరంగల్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ పోసిన ముగ్గురు యువకులను పోలీసులు అడవుల్లోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి పారేశారు. ఇది జరిగింది 2008లో ఉమ్మడి ఏపీలో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పుడు సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ అప్పట్లో వరంగల్ ఎస్పి. వైఎస్ఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాకే సజ్జనార్ యువకులను ఎన్కౌంటర్ చేశారని అప్పట్లో చెప్పకున్నారు. ఎప్పటిమాదిరిగానే వాళ్లు కాల్పులు జరపబోతే ఆత్మరక్షణకు పోలీసులు కాల్పులు జరిపారని చెప్పేశారు. దీనిపై ఎక్కడా ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. పైగా విద్యార్థినులకు న్యాయం జరిగిందని సంతోషించారు. ఇప్పుడు నెటిజన్లు ఈ ఘటనను సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావిస్తున్నారు.