“లక్ష కోట్లు తినేసాడని చెప్పాం కదా… అన్నేసి కేసులు పెట్టి అపరాధిగా నిలబెట్టేసాం కదా… జగన్ మోహన్ రెడ్డి ఇంకేంటి సీ.ఎం అయ్యేది…” అని విర్రవీగారు పచ్చ పార్టీవారు. కానీ అదేంటో గూబ గుయ్యిమనేంత మెజారిటీతో 2019 ఎన్నికల్లో నెగ్గేసారు జగన్. ముఖ్యమంత్రి కూడా అయిపోయారు.
ఆ గుయ్యిమనే సౌండు రెండున్నరేళ్లైనా ఇప్పటికీ పచ్చ తమ్ముళ్ల చెవుల్లో మోగుతూనే ఉంది. అందుకే బయటి జనం వీళ్ల గురించి, వీళ్ల పత్రికల గురించి ఏం మాట్లాడుతున్నారో ఆ చెవిటి చెవులకి వినపడట్లేదు. పైగా ఊహించని ఆ పరిణామానికి పచ్చ లీడర్లకి, పచ్చ మీడియాకి నరాల బలహీనత వచ్చేసింది. అందుకే మాట్లాడే నాలుకకి, రాసే వేళ్లకి నరాల పట్టు లేకుండా పోయింది. ఏది పడితే వాగడం, ఏది తోస్తే అది రాసుకోవడం. ఇదే తంతు.
ఎప్పడెప్పుడు జగన్ కుర్చీ దిగిపోతాడా..ఎప్పుడు చేజారిన ప్రభుత్వం మళ్ళీ చేజిక్కుతుందా అనే వృధాయాసం తప్ప మరొక ఆలోచన, పని పెట్టుకోకుండా బతుకుతున్నారంటే ప్రతిపక్షం ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థమవుతోంది.
జగన్ ముఖ్యమంత్రి అయిన లగాయత్తు ఇప్పటి వరకు జగన్ జైలుకెళ్లడం ఖాయమని తద్వారా పార్టీ కూలిపోవడం తథ్యమని, జగన్ ఇంట్లో కుటుంబ కలహాలు సత్యమని ..ఒకటి కాదు నానా రాతలూ రాసేసారు.
ఇక శిశుపాలుడులాంటి రఘురామరాజు ఆది నుంచీ ప్రెస్మీట్ల పేరుతో కొన్నాళ్లు చిరాకు, కోపం తెప్పించినా క్రమంగా రాజకీయ సర్కస్సులో వినోద వస్తువుగా మారారు. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఏరి కోరి సీబీయై కోర్టులో పిటీషన్ వేసి కాలక్షేపం చేసారు.
ఈ నేపథ్యంలో జగన్ కి బెయిల్ రద్దవడం, ఫలితంగా జెయిల్ కి వెళ్లాల్సి రావడం ఖాయమని నొక్కివక్కాణించారు.
“జగన్ మోహన్ రెడ్డి తన బెయిల్ రద్దు కావడం ఖాయం అని నిర్ణయించుకున్నాడు. అందుకే తాను జైలుకు వెళ్తే ఎలా ప్రభుత్వాన్ని నడిపించాలో భారతికి సాయంత్రం వేళ శిక్షణ ఇస్తున్నాడు..అధికారులతో భారతికి నేర్పిస్తున్నాడు” అని ఒక నాయకుడు కారుకూత కూసాడు.
“ఇక జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయం అని తేలిపోవడంతో విజయమ్మ, షర్మిల, భారతిల మధ్య అంతర్యుద్ధం మొదలైందని, విజయమ్మకే ముఖ్యమంత్రి గద్దెను ఇవ్వాలని షర్మిల భారతి, జగన్ మీద ఒత్తిడి తెస్తున్నారని, కూతురు, కోడలు, కొడుకు మధ్య విజయమ్మ నలిగిపోతున్నదని” అని ఒక చెత్తపలుకు విసర్జించారు.
“అయితే జైలు శిక్ష పదేళ్లు పడుతుందో, ఇరవై ఏళ్ళు పడుతుందో తెలియకపోవడంతో వైసిపి శ్రేణులన్నీ ఆందోళనకు గురవుతున్నాయి…జగన్ జైలుకు వెళ్లే పక్షంలో పార్టీ చీలిపోయే అవకాశాలు ఎక్కువ. మెజారిటీ ఎమ్మెల్యేలు బొత్సా వైపు చూస్తున్నారని” అర్థం లేని కుళ్లు వార్త కక్కారు.
ఈ రోజు సీబీయై కోర్టు కేసు కొట్టేయడంతో శ్మశాన నిశ్సబ్దంతో పీక్కుతినడానికి కళేబరం దొరకని నక్కల్లాగ మూలన కూర్చున్నారు పచ్చ మీడియా మరియు పచ్చపార్టీ సభ్యులు.
శిశుపాలుడు మాత్రం హైకోర్టుకి వెళ్తానని, అక్కడా పని జరగక పోతే సుప్రీం కోర్టుకి వెళ్తానని తన సీక్వెల్స్ గురించి ప్రకటించి కూర్చున్నాడు.
అసలిందంతా కాదు. ఏది పడితే రాస్తే జనాలు నమ్మే పాత రోజులు కావివి. సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ప్రస్తుత నేపథ్యంలో దేనినీ మసి పూసి మారేడు కాయ చేయలేరు. గతంలో అయితే చంద్రబాబు నిర్వహించే బహిరంగా మీటింగులకి వందమంది వస్తే గ్రాఫిక్స్ కలిపి వెయ్యి మందిగా చూపించే వీలుండేది. ఇప్పుడా సౌకర్యం లేదు. పేపర్లకంటే ముంది సోషల్ మీడియాలో అసలు ఫోటోలు, కామెంట్లు విడుదలైపోతాయి.
చంద్రబాబు సభల్లో జూ. ఎన్.టి.ఆర్ పేరు నినదించడం సోషల్ మీడియా పుణ్యం వల్ల బయటపడింది కానీ లేకపోతే పచ్చ మీడియా దీనిని ప్రస్తావించేది కాదు, ఆపోజిట్ మీడియా రాస్తే అది కట్టుకథ అని కొట్టి పారేసేవారు.
ఇంతకీ చెప్పేదేంటంటే టి.డి.పి కి భవిష్యత్తు ఏ మాత్రం ఉందో చంద్రబాబు వృద్ధాప్యం, లోకేష్ అమాయకత్వం చెబుతూనే ఉన్నాయి. కనుక వాటిని పక్కన పెట్టి ప్రభుత్వపక్షం మీద ఏదో ఒక నెపంతో విరుచుకుపడడమొక్కటే మార్గమని పచ్చ మీడియా మరియు పార్టీ పేట్రేగిపోతున్నాయి.
కానీ ఎంత రాసుకున్నా జనానికి, కోర్టులకి నిజానిజాలు తెలుసు కనుకనే ఫలితం పచ్చ పార్టీ ఆశించినట్టు రాలేదు.
ఇక్కడ మరొక ముఖ్య విషయం ప్రస్తావించుకోవాలి.
ఎవరిదైనా కేసు కోర్టులో ఉన్నప్పుడు, “కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడం” అంటారు.
కానీ కోర్టులో ఉన్న కేసుల ఫలితాలు ఎలా రాబోతున్నాయో ఊహాజనితమైన కథలు రాసే పత్రిక మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా?
ముందే ఎలా తెలుసని అడిగితే తమకు కోర్టుల్లో కోవర్టులున్నారని చెబుతారు.
కానీ ఏ ఫలితమైతే వస్తుందని రాసారో దానికి పూర్తి భిన్నమైన ఫలితం వచ్చింది. అంటే కోర్టుల్ని ప్రభావితం చేసే ఉద్దేశ్యంతోనో, ఒక వర్గంలో అనవసరమైన అలజడి సృష్టించే కుతంత్రంతోనో రాసిన రాతలే కదా అవి.
ఎంతటి పత్రికకైనా కోర్టుల గురించి రాసే విషయంలో పరిమితులుంటాయి. వాటిని కూడా విస్మరించి రెచ్చిపోతున్నారంటే పైన చెప్పుకున్నట్టు నాలికకి, వేళ్లకే కాదు మెదడుకి కూడా నరాల బలహీనతో, మెదడు వాపు వ్యాధో వచ్చిందనుకోవాలి.
– శ్రీనివాస మూర్తి