ఒకవైపు 2020 సంవత్సరం ప్రపంచాన్ని భయపెట్టేసింది. ఒక రకమైన క్షామంలోకి నెట్టేసింది. కరోనా వ్యాప్తి, భయాల నేపథ్యంలో ప్రపంచం కొన్ని నెలల పాటు స్తంభించిపోయింది. కోట్ల మంది ప్రణాళికలు తలకిందుల అయ్యాయి. బహుశా ఏ ఒక్కరూ ఊహించని ఉత్పాతం 2020లో మానవాళికి ఎదురైంది.
ఈ హాలీవుడ్ సినిమాల్లోనో ఇలాంటి వైపరీత్యాలు వస్తాయని చూపిస్తే.. అదంతా ఊహ అనుకున్న ప్రపంచానికి 2020లో షాక్ తగిలింది. ఒక పెద్ద వైపరీత్యం అనుభవంలోకి వచ్చింది. కనీసం రెండు మూడు నెలల పాటు లాక్ డౌన్లతో ప్రపంచం ఎక్కడిక్కడ ఆగిపోవడం కూడా చిన్న విషయం ఏమీ కాదు. ఆ తర్వాత ఆరు నెలలు అయినా ఇప్పటికీ ఇంకా ధైర్యంగా కదిలే పరిస్థితి లేదు.
కంటికి కనిపించని కరోనా వైరస్ అతలాకుతలం చేసింది. అనేక వ్యవస్థల్లో గందరగోళం రేపింది. మానవాళిని భయాందోళనల్లోకి నెట్టింది. సమీప కాలంలో మానవాళి ప్రస్థానం గురించి ప్రస్తావిస్తే కరోనా వైరస్ కు ముందు- కరోనా వైరస్ కు తరువాతా అని విభజించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచం ఇప్పుడు ఒక దేశం మీద మరో దేశం ఆధారపడి ఉంది, ఒక మనిషి అవసరం మరో మనిషికి ఉపాధి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల వల్ల భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితం కూడా ప్రభావితం అయ్యింది. 2020 అంటే భవిష్యత్తుకు కూడా కరోనాతో గుర్తుండిపోయే అవకాశాలున్నాయి.
మరి ఇలాంటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కరోనాతోనే ఏపీ కూడా తీవ్ర ఇబ్బందులు పడింది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది ఏపీ. అదే సమయంలో గమనించాల్సిన అంశం.. దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించిన రాష్ట్రం కూడా ఏపీనే.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ద్వారా కరోనాను నియంత్రించవచ్చని కోవిడ్-19 పై పరిశోధనలు చేసిన వారు చెప్పగా.. ఆ నియమాలను చక్కగా ఫాలో అయిన రాష్ట్రం ఏపీనే. అనుమానితులకే గాక, ప్రైమరీ కాంటాక్ట్, సెకెండరీ కాంటాక్ట్ పర్సన్లకు కూడా పరీక్షలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి తనవంతు ప్రయత్నం చేసింది.
అలాగే కరోనా సోకిన వారిని ఐసొలేషన్ సెంటర్లకు తరలించి వైద్య చికిత్సతో పాటు మంచి ఆహారాన్ని కూడా అందించి వారు కోలుకోవడానికి సహకారం అందించింది. ఏపీలో కోవిడ్ కేర్ సెంటర్లు వాటిల్లో చికిత్స పొందిన చాలా మంది రోగుల ప్రశంసలు పొందాయి. అయితే మహమ్మారి అనేక మంది ప్రాణాలను తీసింది.
ప్రభుత్వ ప్రయత్నాలు, వైద్యుల ప్రయత్నాలు కొంతమంది విషయంలో ఫలించలేదు. అలాంటి ఘటనలతో 2020 ఒక చేదు అనుభవాల సంవత్సరంగా మిగులుతుంది. ఇక్కడ నంబర్ ను నిందించేది ఏమీ లేదు కానీ, కాలగమనంలో మహమ్మారి ఈ ఎదురైన సందర్భం ఇది.
మరి ఇలాంటి సంవత్సరం ఏపీకి మరో రకంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. అదే సంక్షేమ నామ సంవత్సరంగా. 2019లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి ఆరు నెలలనూ కుదురుకోవడానికి సమయంగా తీసుకుని.. 2020లో తన పని మొదలుపెట్టారు. ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేయడానికి కంకణం కట్టుకుని పని చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎంతలా అంటే..2020లో సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ను సైతం ప్రకటించి వాటిని అమలు చేసేంతలా!
మార్చి నెలాఖరులోనే కోవిడ్-19 వ్యాప్తితో జగన్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. అయితే వాటిని ఖాతరు చేయక జగన్ సంక్షేమం బండి దూసుకుపోయింది. కరోనా పరిస్థితుల్లో భారీ ఎత్తున అంబులెన్స్ లను ప్రారంభించి దేశం దృష్టిని ఆకర్షించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒక్కో మండలానికి రెండు కొత్త అంబులెన్స్ లను అందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జాతి మొత్తం అభినందించింది.
జూన్ నెల నుంచి సంక్షేమ పథకాల విషయంలో మరింత దూకుడుగా వెళ్లారు జగన్. 2020లో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..
2020 మే లో..
మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం.
2020 జూన్‌లో..
జూన్ 4వ తేదీన వైయస్‌ఆర్ వాహన మిత్ర. సొంత ఆటో, క్యాబ్ ఉన్నవారికి వాహన మిత్ర ద్వారా రూ.10 వేల సాయం. జూన్ 10వ తేదీన షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు రూ. 10 వేల సాయం.
జూన్ 17న మగ్గమున్న చేనేత కుటుంబాలకు వైయస్‌ఆర్ నేతన్న హస్తం. ఈ పథకం కింద ఒక్కో చేనేతకారుడికీ ఏడాదికి 24 వేల రూపాయల సాయం. జూన్ 24న వైయస్‌ఆర్ కాపు నేస్తం. జూన్ 29న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల.
2020 జూలైలో..
జూలై 1న 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లు ప్రారంభం.
జూలై 29న రైతులకు వడ్డీలేని రుణాలు.
2020 ఆగస్టులో..
ఆగస్టు 3న వైయస్‌ఆర్ విద్యా కానుక. పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్, బెల్టు, షూ, సాక్స్‌లు.
ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీ.
ఆగస్టు 12న వైయస్‌ఆర్ చేయూత.
ఆగస్టు 19న వైయస్‌ఆర్ వసతి దీవెన.
2020 సెప్టెంబర్‌లో..
సెప్టెంబర్ 11న వైయస్‌ఆర్ ఆసరా
సెప్టెంబర్ 25న వైయస్‌ఆర్ విద్యా దీవెన.
2020 అక్టోబర్‌లో..
అక్టోబర్‌లో రెండో విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి రూ.4 వేలు.
అక్టోబర్‌లో హాకర్స్‌కు ఆర్థికసాయం. గుర్తింపు కార్డు ఉన్న ప్రతి చిరు వ్యాపారికి సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం. 10 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు.
2020 నవంబర్‌లో..
నవంబర్ నెలలో విద్యా దీవెనకు సంబంధించి రెండో దఫా.. పిల్లల ఫీజులు నేరుగా తల్లుల అక్కౌంట్‌లో జమ.
2020 డిసెంబర్‌లో..
డిసెంబర్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు సాయం.
ఇవి గాక.. భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. ఆగస్టులోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావించినా అనేక వాయిదాల అనంతరం.. ఏడాది ఆఖరులో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ జరిగింది. నూతనంగా చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. దాదాపు 30 లక్షల మంది లబ్ధిదారులకు ఈ ఇళ్ల వల్ల ప్రయోజనం చేకూరుతూ ఉంది.
ఇక డిసెంబర్ నెలాఖరులో వైఎస్ఆర్ రైతు భరోసా కింద చివరి విడత సొమ్ములను జమ చేశారు. పంటల బీమాను అందజేశారు. ఇన్ పుట్ సబ్సిడీలను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారాలను అందజేశారు.
ఇవీ 2020లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు. నవరత్నాల హామీలో భాగంగా తాము ఇచ్చిన ప్రతి హామీని 2020లో అమల్లో చూపించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఇలా సంక్షేమ పథకాల అమలు విషయంలో క్యాలెండర్ ను ప్రకటించి మరీ చెప్పినవి చెప్పినట్టుగా చేస్తూ, చెప్పనివి కూడా అమలు చేస్తూ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న ఘనత నిస్సందేహంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే. బహుశా రానున్న ఎన్నికల వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాలను మాత్రమే అమలు చేసినా.. సంక్షేమ పథకాల విషయంలో జగన్ ను ఢీ కొట్టగల పాలకుడు మరొకరు ఉండరు. 2021కి కూడా ఆల్రెడీ క్యాలెండర్ రెడీ అయ్యింది.
2021 జనవరిలో రెండో విడత అమ్మ ఒడి
2021 జనవరిలోనే చివరి విడత రైతు భరోసా.
2021 ఫిబ్రవరి విద్యా దీవెన మూడో త్రైమాసం, రెండో దఫా వసతి దీవెన.
2021 మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.
ఇలా తొలి క్వార్టర్ కు జగన్ దగ్గర క్యాలెండర్ రెడీగా ఉంది. ఇక 2020లో ద్వితియార్థంలో అమలు చేసిన పథకాల కొనసాగింపు ఎలాగూ ఆయా నెలల్లో కొనసాగేలా ఉంది. దీంతో ప్రతి నెలలోనూ రెండు మూడు పథకాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడానికి జగన్ పూర్తి స్కెచ్ తో ఉన్నారు. వచ్చే ఏడాది కూడా ఈ క్యాలెండర్ లో ఎక్కడా లోటు ఉండదని స్పష్టం అవుతోంది.
సంక్షేమం సరే, మరి అభివృద్ధి?
ఈ ప్రశ్నకే జగన్ ప్రభుత్వం ఇంకా పూర్తి సమాధానం ఇవ్వడం లేదు. మూడు రాజధానుల విషయంలో ఏదో ఒకటి తేలిపోయి ఉంటే… అభివృద్ధి విషయంలోనూ అడుగులు పడేవి. అయితే ఆ అంశం కోర్టుల పరిధిలో చిక్కుకుంది. ఆఖరికి విశాఖలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణానికి జగన్ ప్రభుత్వం పూనుకున్నా.. దానికి కూడా న్యాయస్థానాల్లో బ్రేకులు పడ్డాయి. దీంతో నిర్మాణాలు, ఇతర శంకుస్థాపనలకు కూడా అవకాశం లేకపోయింది. దీంతో ఈ లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది.
అలాగే.. భారీ వర్షాలకు ఏపీలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చాకా కొత్త రోడ్ల నిర్మాణానికి పూనుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ అంశంపై దృష్టి సారించాల్సి ఉంది.
ఇక పారిశ్రామిక అభివృద్ధి విషయానికి వస్తే.. పలు విషయాలు చర్చలోకి వచ్చాయి. కియా పారిశ్రామిక వాడ సమీపంలోనే ఒక బస్ ల రూపకల్పన ఫ్యాక్టరీ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అపాచీ లెదర్ ఫ్యాక్టరీ, కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీల విషయంలో సన్నాహాలు మొదలయ్యాయి. అంతకు మించి భారీ ప్రాజెక్టులు మాత్రం ఏవీ పట్టాలెక్కినట్టుగా కనిపించడం లేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో భారీ ప్రాజెక్టుల అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. అది కూడా జగన్ సంక్షేమ పథకాల విషయంలో ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు కాబట్టి.. అన్నీ సంక్షేమ పథకాలేనా? అభివృద్ధి పథకాలేవీ? అనే ప్రశ్నకు ఉతం లభిస్తూ ఉంది. రానున్న రోజుల్లో అయినా ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం చాలానే కనిపిస్తూ ఉంది.
జగన్ అదృష్టం.. వర్షాలొచ్చాయ్!
పాలకుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2020లో కలిసి వచ్చిన అంశాల్లో ప్రధానమైనది.. పుష్కలమైన వర్షాలు. 2019లో జగన్ పీఠమెక్కాకా ఎగువున కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు పుష్కలమైన జలకళ లభించింది. ఆ సంవత్సరంలో రాయలసీమ వైపుకు గరిష్టంగా 170 టీఎంసీల వరకూ నీటిని తరలించగలిగారు. ఆ నీటిలో కూడా మళ్లీ కోస్తా ప్రాజెక్టులకు నీళ్లు వెళ్లినా, సీమ ప్రాజెక్టులకు నీటి లభ్యత కచ్చితంగా పెరిగింది.
2020 విషయంలో మరింత లక్ ఏమిటంటే.. రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అయితే గత పాతిక, ముప్పై సంవత్సరాల్లో ఎన్నడూ కురవనంత వర్షాలు కురిశాయి కొన్ని చోట్ల. దీంతో ఎటు చూసినా వాగులూ, వంకలు, చెరువులు పొంగాయి. దీంతో భూగర్భ జల లభ్యత భారీగా పెరిగింది.
ఒక దశలో ఖరీఫ్ సమయంలో వర్షాలు తీవ్రం కావడంతో వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టిన పంటపై పైసా కూడా తిరిగిరాని పరిస్థితి. అయితే వర్షాలు భారీగా కురవడంతో.. రబీ పంటలు, బోర్ల కింద వ్యవసాయం చేసుకునే వాళ్లకు కలిసి వచ్చింది. రాయలసీమలో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పంట సాగు జరిగింది. ఇక మిగతా ప్రాంతాల్లోనూ ఎక్కడా ఈ ఏడాది వర్షాలకు కొదవలేదు.
పలు చోట్ల అతివృష్టి చోటు చేసుకుంది కానీ, అనావృష్టి లేదు. అతివృష్టి వల్ల ఒక పంట పోయినా, రెండో పంట అయినా సాగుకు అవకాశం ఉంటుంది. ఇది వైఎస్ జగన్ పాలనలో రైతులకు సానుకూలమైన అంశంగా నిలుస్తోంది. ఒకరకంగా జగన్ కు ప్రకృతి నుంచి సహకారం అందుతూ ఉంది.
ఈ ఏడాది రాయలసీమ ఎత్తి పోతల పథకంతో పాటు.. కుందూ నదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. వీటిల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కొన్ని ఆటంకాలున్నా.. ఆ పథకం పూర్తి చేయగలిగితే మాత్రం.. జగన్ ఖ్యాతి రాయలసీమలో శాశ్వతంగా ఉండిపోతుంది.
రాజకీయం మాటేంటి?
ముందుగా వేసుకున్న ప్రణాళికల ప్రకారం అయితే ఈ ఏడాది ఏపీలో స్థానిక ఎన్నికలు జరగాల్సింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసిన తర్వాత అనూహ్యంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి తో వాయిదా పడ్డప్పటికీ.. ఆ నిర్ణయాన్ని ఏపీ ఎన్నికల సంఘం ఏకపక్షంగా తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.
తొమ్మిది నెలలుగా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కూ మధ్య రాద్ధాంతం కొనసాగుతూ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తున్నా.. దానికి ప్రభుత్వం సానుకూలంగా లేదు. బంతి కోర్టుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఏమీ తేలలేదు. ప్రభుత్వం, ఎస్ఈసీనే ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని కోర్టు సూచించి పంపింది.
మరో రెండు నెలల్లో కూడా ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అయితే తను ఎస్ఈసీ పదవి నుంచి రిటైరయ్యేలోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
ఈ పట్టువిడుపుల్లోని ద్వంద్వ యుద్ఘం 2020 అంతా కొనసాగింది. ఈ ఏడాది ఏపీలో అధికార పార్టీకి, ప్రతిపక్ష పోరు ఎలా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మాత్రం గట్టిగా జరిగింది. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు కూడా సంఘర్షణ చోటు చేసుకుంది. ఇలా రాజకీయంగా రసవత్తరంగా సాగిన సంవత్సరం ఇది!
ప్రతిపక్షాలు..ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గురించి ఒక్క మాటలో చెప్పడానికి పై సామెత సరిపోతుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా సాగింది తెలుగుదేశం తీరు. కరోనా వ్యాప్తికి ముందే అమరావతి వదిలి హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆ రాష్ట్రానికి చుట్టపుచూపుగా మారిపోయారు.
పది నెలల వ్యవధిలో పట్టుమని పది రోజులు కూడా చంద్రబాబు నాయుడు ఏపీలో గడపలేదంటే ఆయన ఏపీకి ఎంత దూరం అయ్యారో అర్థం చేసుకోవచ్చు. జూమ్ మీటింగుల ద్వారా, అనుకూల మీడియా రాతల ద్వారా చంద్రబాబు నాయుడు ఏపీలోనే ఉన్నట్టుగా ఏవో భ్రమలు కల్పించే ప్రయత్నం చేశారు. అయితే సొంత మీడియాలో మెరిసినంత మాత్రాన చంద్రబాబుకు రాజకీయంగా దక్కేదీ ఏమీ ఉండదని వేరే చెప్పనక్కర్లేదు.
పార్టీ క్యాడర్ కు చంద్రబాబు నాయుడు పూర్తిగా దూరం అయిపోయారు. వయసు రీత్యా కరోనా ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాల్లో కనిపించకపోయినా.. ఆయన తనయుడు అయినా బాధ్యత తీసుకోవాల్సింది. అయితే లోకేష్ కూడా తండ్రి వలే హైదరాబాద్ లో కూర్చున్నారు.
రెండు మూడు నెలలకు రెండు మూడు రోజులు కేటాయించి ఏపీకి వచ్చి ఏదో చేయబోయారు. అది కూడా మరేదో అయ్యింది. అటు చంద్రబాబు నాయుడుకు వయసు సహకరించకపోవడం, లోకేష్ కు శరీరం సహకరిస్తూ ఉన్నట్టుగా లేకపోవడంతో.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
కేవలం చంద్రబాబు, లోకేష్ లు మాత్రమే కాదు.. రాష్ట్రంలో యాక్టివ్ గా కనిపిస్తున్న టీడీపీ లీడర్ల ను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. చాలా నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల ఊసు లేదు. చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ఏడాదిలో ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా జనం మధ్యకు, జనం ముందుకు రాలేదంటే.. టీడీపీ పరిస్థితి ఎలా మారి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అమరావతి ఆందోళనలకు మాత్రమే పరిమితమైపోయి.. టీడీపీ తన పరిధిని మరింత తగ్గించుకుంది. ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఉందా? అనే ప్రశ్నకు చాలా సులువుగా లేదు అనే సమాధానం ఇచ్చేలా సాగాయి ఈ ఏడాది రాజకీయాలు.
షూటింగు విరామాల్లో పవన్ కల్యాణ్, అప్పుడప్పుడు కమలనాథులు కాస్త హల్చల్ చేశారు. అయితే ఈ రెండు పార్టీలనూ ఏపీ ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. దీంతో వీరిది పక్క వాయిద్యంగానే మారింది.
కరోనా భయాలతో, కష్టాల్లో సంక్షేమంతో, కరువులను మరిపించే వానలతో, అంతంత మాత్రపు అభివృద్ధి పథకాలతో, ప్రతిపక్ష పార్టీల ప్రహసనాలతో.. ఏపీ రాజకీయంలో 2020 గడిచిపోయింది.
2021 లో జగన్ తన సంక్షేమపథాన్ని కొనసాగించనున్నారని స్పష్టం అవుతోంది, అది మరింత అభివృద్ధి దిశగా కూడా సాగితే మంచిదే. 2021లో మాత్రం స్థానిక ఎన్నికలే కాదు, తిరుపతి లోక్ సభ సీటు ఉప ఎన్నిక కూడా జరగబోతోంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు అయ్యే తరుణంలో జరగబోయే ఈ ఎన్నికలు.. ఎవరి రాజకీయ శక్తి ఎలా మారిందో కూడా చాటబోతున్నాయి!
జీవన్ రెడ్డి.బి