మహాత్మాగాంధీ పుట్టిన రాష్ట్రంలో మహిళలకు తీవ్ర అవమానం. రుతుస్రావంలో ఉన్న అమ్మాయిలను గుర్తించేందుకు రెండుమూడు రోజుల క్రితం ఓ కళాశాలలో అధ్యాపకుల విపరీత ధోరణులకు కారణమైన గుజరాత్‌లోనే…మహిళలను అవమానించేలా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకొంది.
ఫిజికల్ టెస్ట్ నిమిత్తం ట్రైనీ మహిళా క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టడంతో పాటు పెళ్లి కాని అమ్మాయిలకు గర్భధారణ పరీక్షలు చేశారు. సూరత్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దర్యాప్తునకు ఆదేశించారు.
ట్రైనీ సిబ్బంది మూడేళ్ల శిక్షణ కాలం పూర్తి చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఫిజికల్ టెస్ట్ చేయించుకోవాలనేది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధన. శిక్షణ తర్వాత ఉద్యోగం చేసేందుకు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు ఈ నిబంధన తప్పని సరి చేశారు. ఈ నేపథ్యంలో పది మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష కోసం వాళ్లంతా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సూరత్ మున్సిపల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రికి వెళ్లారు.
ఆ పది మందికి ఫిట్‌నెస్ పరీక్ష ఓ పిటీ పరీక్షైంది. ఎందుకంటే తమను మహిళా వైద్యులు సామూహికంగా నగ్నంగా నిలబెట్టారని వాపోయారు. అంతేకాదు తమను ప్రిగ్నెన్సీకి సంబంధించి లేడీ డాక్టర్ ఇబ్బందికర ప్రశ్నలతో మానసిక వేదనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పెళ్లికాని వారికి ప్రిగ్నెన్సీ పరీక్షలు చేసి దారుణంగా అవమానించారని ట్రైనీ మహిళా క్లర్క్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిమిత్తం త్రీమెన్ కమిటీని వేశారు.