ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని..!

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూసి మోసపోకుమా… అని ఓ పాత సినిమాలోని తెలుగు పాట చాలామందికి ప్రేరణనిస్తోంది. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం అందిస్తోన్న సహాయ కార్యక్రమాలెలా వున్నా, సామాన్యులు మాత్రం నడుం…

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూసి మోసపోకుమా… అని ఓ పాత సినిమాలోని తెలుగు పాట చాలామందికి ప్రేరణనిస్తోంది. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం అందిస్తోన్న సహాయ కార్యక్రమాలెలా వున్నా, సామాన్యులు మాత్రం నడుం బిగించారు. మరీ ముఖ్యంగా తుపాను దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ మహానగరంలో సామాన్యులు చూపిస్తోన్న తెగువ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

అక్కడా ఇక్కడా అని కాదు, విశాఖలో ఎక్కడ చూసినా సామాన్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ నగరాన్ని శుభ్రం చేసుకునే పనిలో బిజీ అయిపోయారు. విశాఖ అందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఆర్కే బీచ్‌, కైలాసగిరి తదితర ప్రాంతాల్లో యువత శ్రమిస్తున్న తీరుకి ఎవరైనా సరే సలాం.. అనాల్సిందే. జూపార్క్‌లో చెత్తా చెదారాన్ని ఏరివేయడానికి ఓ పది మంది యువకులు తొలుత నడుం బిగించారు. వారికి మరో పది మంది తోడయ్యారు.. క్షణాల్లోనే దాదాపు వంద మంది పోగయ్యారక్కడ.. అంతే, చెత్త మచ్చుకైనా కానరాలేదు.

‘మా నగరాన్ని మేం బాగు చేసుకుంటున్నాం.. ఇది మా బాధ్యత..’ అంటోన్న యువతరానికి సీనియర్‌ సిటిజన్లు సెల్యూట్‌ చేస్తున్నారు. తమవంతు బాధ్యత.. అంటూ ముసలీ ముతకా ముందుకొస్తున్నారు. చిన్నారులు సైతం తమ చిట్టి చేతులతో రోడ్లపై పేరుకుపోయిన మట్టిని తొలగించే పనిలో బిజీ అయ్యారు. తీవ్రంగా నష్టపోయాం.. కానీ ఆ నష్టం నుంచి తేరుకుంటామని చెబుతోన్న విశాఖ వాసులు, ప్రభుత్వం పని ప్రభుత్వానిదే మా పని మాదే అంటుండడం గమనార్హమిక్కడ.

స్వచ్ఛందంగా ప్రజలెంత చేసినా, ప్రభుత్వం చేయాల్సిన పనులు సక్రమంగా నిర్వర్తిస్తే, విశాఖ వీలైనంత త్వరగా కోలుకుంటుంది. ఇప్పటికే ఈ స్థాయిలో విశాఖ కోలుకోవడం పట్ల ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందేననడం అతిశయోక్తి కాదేమో.