టాలీవుడ్: జనవరి బాక్సాఫీస్ రివ్యూ

జనవరి అంటే టాలీవుడ్ ఎప్పుడూ కళకళలాడుతుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి పెద్ద సినిమాలన్నీ ఇదే నెలలో విడుదలవుతుంటాయి. ఈ జనవరిలో కూడా ఆ సందడి కనిపించింది. కాకపోతే కళ్లముందు సినిమాలైతే కనిపిస్తున్నాయి కానీ థియేటర్లలోకి…

జనవరి అంటే టాలీవుడ్ ఎప్పుడూ కళకళలాడుతుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి పెద్ద సినిమాలన్నీ ఇదే నెలలో విడుదలవుతుంటాయి. ఈ జనవరిలో కూడా ఆ సందడి కనిపించింది. కాకపోతే కళ్లముందు సినిమాలైతే కనిపిస్తున్నాయి కానీ థియేటర్లలోకి వెళ్లి చూసేలా మాత్రంలేవు. అలా ఈ జనవరిలో భారీ సినిమాలున్నప్పటికీ బాక్సాఫీస్ వెలవెలబోయింది.

ఎప్పట్లానే జనవరి మొదటివారం పేలవంగా ప్రారంభమైంది. సంక్రాంతి సీజన్ ముందు ఇలా డల్ గా ఉండడం మామూలే. ఫస్ట్ వీక్ లో నటన, అజయ్ పాసయ్యాడు లాంటి 2 చిన్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. అసలైన బాక్సాఫీస్ సందడి 9వ తేదీ నుంచి మొదలైంది. ఆరోజు ఎన్టీఆర్-కథానాయకుడు విడుదలైంది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాలయ్య చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ బయోపిక్ ను అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయడంలో మేకర్స్ విఫలమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా మిగిల్చిన నష్టాల్ని లెక్కించే పనిలో బిజీగా ఉన్న యూనిట్.. బయోపిక్ పార్ట్-2ను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చి ఈ ఏడాది డిజాస్టర్ అయిన మొదటి సినిమా ఇదే.

ఇలా కథానాయకుడు ఫ్లాప్ తో డల్ గా ప్రారంభమైన జనవరి బాక్సాఫీస్, పేట సినిమాతో కూడా కోలుకోలేకపోయింది. కథానాయకుడు విడుదలైన 24 గంటల వ్యవధిలోనే థియేటర్లలోకి వచ్చిన ఈ సూపర్ స్టార్ సినిమా, తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. రజనీకాంత్ స్టయిల్, యాక్షన్ అన్నీ ఉన్నప్పటికీ సినిమా బోర్ కొట్టేసింది.

ఇక కచ్చితంగా హిట్ అవుతుందనుకున్న వినయ విధేయరామ మూవీ కూడా జనవరిలో నిరుత్సాహపరిచింది. నిజానికి ఈ సంక్రాంతి బరిలో కచ్చితంగా హిట్ అవుతుందని ఊహించిన సినిమాల్లో ఇదొకటి. కానీ రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. రిజల్ట్ సంగతి పక్కనపెడితే, మినిమం హోంవర్క్ చేయకుండా ఇంత చెత్తగా సినిమా ఎందుకు తీశారనే అప్రతిష్టను మూటగట్టుకున్నారు.

మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింట్ చేసిన టైమ్ లో వచ్చింది ఎఫ్2. స్టోరీ సంగతి పక్కనపెడితే, పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అనీల్ రావిపూడి డైరక్షన్ లో వెంకీ-వరుణ్ కలిసి చేసిన ఈ హిలేరియస్ మూవీ సంక్రాంతి బరిలో కాసులవర్షం కురిపించి, జనవరి బాక్సాఫీస్ ను కాస్త ఆదుకుంది.

ఇక జనవరి ఆఖరి వారంలో విడుదలైన మిస్టర్ మజ్ను కూడా నిరాశపరిచింది. అఖిల్ హీరోగా యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా, ఆ సెక్షన్ ను ఎట్రాక్ట్ చేయలేకపోయింది. దీంతో పాటు వచ్చిన కొత్తగా మా ప్రయాణం అనే సినిమా కూడా పోయింది. ఇలా జనవరి బాక్సాఫీస్ లో 9 సినిమాలు విడుదలైతే, కేవలం ఎఫ్2 మాత్రమే సక్సెస్ అయింది. మిగతావన్నీ ఫ్లాపులే.

జగన్ కు మంత్రుల లేఖలు- టిడిపి సెల్ప్ గోల్ అవుతుందా

YSR యాత్ర.. కన్నీళ్లు తెప్పించే పెంచల్ దాస్ పాట