అచ్చంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా నడవడం, మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్ చాలా కష్టమైన విషయాలు అని మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి అన్నారు. యాత్ర సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈరోజు హైదరాబాద్ వచ్చి మీడియాతో ముచ్చటించారు. బౌండ్ స్క్రిప్ట్, వైఎస్ పాత్ర, జనాలతో మమేకం కావడం అన్న పాయింట్ ఇవన్నీ కలిసి తనను యాత్ర సినిమాకు అంగీకరించేలా చేసాయన్నారు. ఇన్నాళ్లు ఇలాంటి సరైన పాత్ర రాకనే తెలుగు సినిమాకు దూరంగా వున్నానన్నారు.
అయితే అలా అని దీనిపై విడియోలు చూడడం, రీసెర్చి చేయడం లాంటివి ఏమీలేదని, దర్శకుడు చెప్పిన మేరకు తన స్టయిల్ లోనే చేసానని, అయితే వైఎస్ ట్రేడ్ మార్క్ అయిన చేయి ఊపడం మాత్రం చేసానని మమ్ముట్టి వివరించారు. ఉచ్ఛారణలో కాస్త తేడా వున్నా, తెలుగులో డబ్బింగ్ చెప్పానని, తనకు స్వంతంగా డబ్బింగ్ చెప్పడమే మొదటి నుంచీ అలవాటని మమ్ముట్టి వివరించారు.
సరైన పాత్రలు వస్తే తెలుగులో నటించడం ఇష్టమే అని, కొత్త దర్శకులు, అనుభవం వున్న వారు అన్న తేడాలేదని, తన కెరీర్ లో ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేసానని, వారిలో చాలామంది మంచి స్థాయిలో వున్నారని అన్నారు. అదే సమయంలో నిర్మాణ సంస్థ, దాని సామర్థ్యం కూడా ముఖ్యమని వివరించారు.
తాను ఎప్పుడూ వైఎస్ ను కలవడం తటస్థించలేదని, మహీ రాసుకున్న స్క్రిప్ట్ కు అనుగుణంగా, ఆయన చెప్పినదానిని తన ఆలోచనకు మ్యాచ్ చేస్తూ నటించానని మమ్మట్టి తెలిపారు.