కంగనా రనౌత్ గురించి బాలీవుడ్లో అందరికీ తెలుసు. అందుకే ఆమెతో నటించేందుకు నటీనటులు ముందుకురారు. దర్శక నిర్మాతలూ కంగనా రనౌత్ పేరుచెబితే పారిపోతారు. కానీ, ఆమె స్టార్డమ్ సంపాదించుకుంది. ఈ విషయంలో కంగనా రనౌత్‌ని 'ఐరన్ లేడీ' అనాల్సిందే. 'మణికర్ణిక' లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో సెట్స్ మీదకు వెళ్ళినప్పుడే చాలామందికి చాలా అనుమానాలు కలిగాయి. సినిమాని కంగన తనకు అనుకూలంగా మార్చేసుకుంటుందన్న వాదనలు తెరపైకొచ్చాయి.
అందరి అనుమానాలూ నిజమయ్యాయి.. కంగనా రనౌత్, దర్శకుడు క్రిష్‌ని పక్కనపెట్టి 'తన పని' తాను చేసుకుపోయింది. క్రిష్ బయటకొచ్చాడు, సినిమా విడుదలయ్యింది.. విడుదలయ్యాక, క్రిష్ తెరకెక్కించింది సినిమాలో 30శాతం కూడా కాదంటూ కంగన తరఫునుంచి ఆమె చెల్లెలి ప్రకటన రూపంలో 'నిజం' బయటకొచ్చింది. అది నిజమా.? కాదా.? అన్నది కేవలం ఆ చిత్ర యూనిట్‌కి మాత్రమే తెలుస్తుంది. క్రిష్ మాత్రం 'మణికర్ణిక' తనదేనంటున్నాడు. క్రిష్ ఎంత గగ్గోలు పెట్టినా చివరికి నిర్మాత కూడా వినడంలేదాయె.. ఆ నిర్మాత కమల్ జైన్ మద్దతు కూడా కంగనకే లబించింది.
'మీ మీద కాస్తో కూస్తో వున్న గౌరవంతో టైటిల్స్‌లో మీ పేరు వేశాం.. పండగ చేస్కోండి..' అంటూ క్రిష్ పట్ల కంగన వెటకారంగా మాట్లాడుతున్నట్టుందిప్పుడు వ్యవహారం చూస్తోంటే. ఒక్కరంటే ఒక్కరు కూడా బాలీవుడ్ నుంచి క్రిష్ తరఫున మాట్లాడకపోవడం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే, 'మణికర్ణిక' విషయంలో క్రిష్ ఒంటరి అయిపోయాడు. 'చేతనైతే న్యాయపోరాటం చేస్కో' అని తాజాగా 'మణికర్ణిక' నిర్మాత కమల్ జైన్ ఇచ్చిన ఉచిత సలహాతో క్రిష్ పరిస్థితి మరింత దిగజారిపోయి వుంటుందన్నది నిర్వివాదాంశం.
బాలీవుడ్లో సినిమా.. అది కూడా 'మణికర్ణిక' లాంటి చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమా.. ఇలా ఆలోచించి క్రిష్ వెళ్ళాడుగానీ, కంగన గురించి ఇతరులు చేసిన ముందస్తు హెచ్చరికలేవీ పట్టించుకోకపోవడం వల్లనే క్రిష్‌కి ఈరోజు ఈ పరిస్థితి దాపురించిందన్నది చాలామంది నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. 'వాట్సాప్ ఛాట్' స్క్రీన్ షాట్స్‌ని క్రిష్ సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా బౌన్స్ బ్యాక్ అయ్యాక క్రిష్ ఇకపై చేయగలిగిందేమీ లేదు.
ఓ వైపు 'ఎన్టిఆర్ బయోపిక్' తొలి పార్ట్ 'ఎన్టిఆర్ కథానాయకుడు' కొట్టినదెబ్బ, ఇంకోపక్క 'మణికర్ణిక' వివాదం వెరసి, క్రిష్ ఇన్నాళ్ళూ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని అటకెక్కించేశాయా.? ఏమో, అలాగే అనుకోవాలేమో.