టాలీవుడ్: సెప్టెంబర్ బాక్సాఫీస్ రివ్యూ

ఆగస్ట్ లో గీతగోవిందం ఇచ్చిన ఊపు సెప్టెంబర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ లో కనిపించలేదు. ఆగస్ట్ లో గీతగోవిందం, గూఢచారి, చిలసౌ లాంటి సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటే, సెప్టెంబర్ లో మాత్రం ఒక్కటంటే…

ఆగస్ట్ లో గీతగోవిందం ఇచ్చిన ఊపు సెప్టెంబర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ లో కనిపించలేదు. ఆగస్ట్ లో గీతగోవిందం, గూఢచారి, చిలసౌ లాంటి సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటే, సెప్టెంబర్ లో మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ రేంజ్ కు రాలేదు. ఈ నెలలో సినిమా రిలీజ్ లు కూడా తక్కువే.

అల్లరినరేష్, సునీల్ కలిసి నటించిన సిల్లీ ఫెలోస్ సినిమాతో సెప్టెంబర్ బాక్సాఫీస్ కు బోణీ పడుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఈ స్టార్స్ ఇద్దరూ కలిసి చేసిన కిచిడీ కామెడీ బెడిసికొట్టింది. సిల్లీఫెలోస్ కథ అంతే సిల్లీగా ముగిసింది. ఇదే వారంలో విడుదలైన కేరాఫ్ కంచరపాలెం సినిమాది మరో వ్యథ. విడుదలకు ముందు నుంచి విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయింది. సినిమా బాగుందని అందరూ చెబుతున్నారు కానీ థియేటర్లకు వెళ్లి సినిమా చూసే నాథుడు మాత్రంలేడు. అలా కంచరపాలెంకు ఆ ప్రశంసలే మిగిలాయి. 

సిల్లీ ఫెలోస్, కేరాఫ్ కంచరపాలెం సినిమాలతో పాటు ఆ వారంలో వచ్చిన ఇతర సినిమాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. టెక్నికల్ వండర్ అంటూ వచ్చిన మను సినిమా డిజాస్టర్ అయి, బ్రహ్మానందం కొడుకు ఆశల్ని మరోసారి అడియాసలు చేసింది. అటు రవిచావలి తీసిన సూపర్ స్కెచ్, కొత్త నటీనటులతో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 

సెప్టెంబర్ రెండోవారంలో నాగచైతన్య, సమంత సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. చైతూ నటించిన శైలజారెడ్డి అల్లుడు, సమంత నటించిన యూటర్న్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో యూటర్న్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ కలెక్షన్లు మాత్రం దక్కలేదు. శైలజారెడ్డి అల్లుడు సినిమాకు ఓపెనింగ్ వసూళ్లు బాగున్నప్పటికీ తర్వాత సినిమా చతికిలపడింది.

చైతూ కెరీర్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది. చైతూ-సమంత సినిమాలతో పాటు ఎందుకో ఏమో, మసక్కలి, జనతా హోటల్ అంటూ మరో 3 సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చినప్పటికీ వీటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు. మూడోవారంలో సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమా వచ్చింది.

స్వయంగా తనే నిర్మాతగా మారి, నటించి సుధీర్ బాబు తెరకెక్కించిన సినిమా ఇది. కొత్త దర్శకుడు ఆర్ఎస్ నాయుడు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. హీరోహీరోయిన్ల పాత్రలు బాగున్నప్పటికీ, ఓవరాల్ గా ప్రేక్షకుల మనసుల్ని దోచుకోలేకపోయింది ఈ సినిమా. అలా ఓ సగటు చిత్రంగా మాత్రమే మిగిలిపోయింది.

ఇక ఇదే వారంలో వచ్చిన సామి సినిమాను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విక్రమ్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులతో నరకం స్పెల్లింగ్ రాయించింది. ఈ ఏడాది ప్రేక్షకులపై పాశవికంగా దాడిచేసిన సినిమాల్లో సామిదే అగ్రస్థానం. ఈ సినిమాతో పాటు వచ్చిన కురుక్షేత్రం, ఈమాయ పేరేమిటో సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

తన 150వ చిత్రంగా అర్జున్ రిలీజ్ చేసిన కురుక్షేత్రం ఎవ్వర్నీ ఆకట్టుకోలేదు. ఇక ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమైన ఈమాయ పేరేమిటో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా సెప్టెంబర్ బాక్సాఫీస్ ఎంత స్తబ్దుగా సాగుతున్నప్పటికీ జనాలందరికీ ఒక సినిమాపై మాత్రం ఏదో మూల ఆశ ఉండేది. అదే దేవదాస్.

అలా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ పెంచుకున్న ఆశల్ని మొదటిరోజే తుంచేసింది. నాగ్-నాని కాంబినేషన్ మినహా సినిమాలో చెప్పుకోడానికి ఏమీలేదు. ఆకట్టుకోని సన్నివేశాలు, 80లనాటి క్లైమాక్స్ ఈ సినిమాను పూర్తిగా నీరుగార్చేశాయి. కేవలం మల్టీస్టారర్ అనే కోణంలో మాత్రమే ఈ సినిమా థియేటర్లలో కొనసాగుతోంది.

ఈ 'కాంబినేషన్' దాటి రచయితలు, దర్శకుడు ముందుకు వెళ్లలేకపోవడంతో దేవదాస్ ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఈ మూవీతో పాటు వచ్చిన నవాబ్ సినిమా బాగున్నప్పటికీ తెలుగులో ఇది హిట్ కాదు. సినిమాలో స్టార్ వాల్యూ లేకపోవడం, ఓ సెక్షన్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చడం ఈ సినిమాను హిట్ కు దూరం చేశాయి. 

ఓవరాల్ గా సెప్టెంబర్ లో 17 సినిమాలు థియేటర్లలోకి వస్తే, అందులో సూపర్ హిట్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. సెప్టెంబర్ తమకు చాలా లక్కీ అంటూ అక్కినేని కుటుంబసభ్యులు నాగ్, నాగచైతన్య, సమంత చెప్పుకుంటున్న రేంజ్ లో వాళ్ల సినిమాలు లేవు.