ఎన్టీఆర్ బయోపిక్ రెండుభాగాలుగా వుంటుందని ఎప్పుడో ఆరేడు నెలల క్రితమే వెల్లడించాం. అయితే ఇది అవునని కానీ, కాదని కానీ యూనిట్ నుంచి ఎటువంటి ప్రకటనా లేదు. లేటెస్ట్ గా తెలుస్తున్నది ఏమిటంటే, ఈ రెండు భాగాలకు రెండు పేర్లు కూడా వేరు వేరుగా వుంటాయని వినిపిస్తోంది.
టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, తొలి భాగానికి ఎన్టీఆర్-సినీ నాయకుడు, మలి భాగానికి ఎన్టీఆర్-ప్రజానాయకుడు అని టైటిళ్లు వుంటాయని తెలుస్తోంది. మెయిన్ టైటిల్ గా ఎన్టీఆర్ అన్నదే వుంటుంది. టైటిళ్ల సంగతి అలా వుంచితే అసలు తొలిభాగం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి సింహాసనం అధిష్టించడం వరకు వుంటుందన్నది పక్కాగా తెలుస్తోంది.
మరి నాదెండ్ల ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ లో వుంటుందా? రెండోపార్ట్ లో వుంటుందా? అన్నది తెలియడం లేదు. రెండోపార్ట్ లో కిలో రెండురూపాయల బియ్యం, ఇళ్ల పథకం, ఇంకా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు వంటివి మాత్రం వుంటాయని తెలుస్తోంది.
వీటన్నింటి సంగతి అలా వుంచితే, అసలు రెండు బయోపిక్ ల మధ్య గ్యాప్ ఏ మేరకు వుంటుందన్నది అసలు ప్రశ్న. జనవరిలో ఓ పార్ట్ విడుదలయితే, మలిపార్ట్ ఎప్పుడు వుంటుందో అన్నది తెలియాలి.