ఈ రోజుల్లో ఏదైనా సినిమా మీద వివాదం చెలరేగింది అంటే ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసినట్లే. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి టైమ్ లో అందరూ కలిసి అదే పనిచేసారు. అందులో వున్న కిస్ సీన్లు, డైలాగుల మీద నానా హడావుడి చేసి, ఆ సినిమా జనాల్లోకి వెళ్లేలా చేసారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి హడావుడే స్టార్ట్ అయింది.
విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా నోటాను తెలంగాణలో విడుదల చేయకూడదని ప్రొటెస్ట్ మొదలైంది. చెన్నయ్ లో వుంటూ, చెన్నయ్ తెలుగు సంఘం అంటూ, ఆంధ్రలో ప్రెస్ నోట్లు విడుదల చేసే కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఈ ప్రొటెస్ట్ కు తెరతీసారు. ఆయనదో చిత్రమైన వ్యవహారం. ఆయన చెన్నయ్ లో వుంటూ, చెన్నయ్ తెలుగు సంఘం అంటూ, ఇక్కడ హైదరాబాద్ లో సినిమా వ్యవహారాలపై తరచు ఏదో ప్రెస్ నోట్ విడుదల చేస్తుంటారు.
లేటెస్ట్ గా ఆయన వాదన ఏమిటంటే, నోటా సినిమాను తెలంగాణలో విడుదల చేయకూడదని. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల వాతావరణం వుంది కాబట్టి, నోటా అనే ఫెసిలిటీని ఆ సినిమాలో తక్కువ చేసి చూపించి వుంటారనే అనుమానం వుందని, అందువల్ల ఎన్నికల కమిషన్ ఆ సినిమాను చూసి కానీ విడుదలకు అనుమతించకూడదని కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు సంబంధిత వ్యక్తులందరికీ ఆయన విన్నపాలు పంపిచేసారన్నది మామూలు పాయింటే.