“ఆనలుగురు”, “మీ శ్రేయాభిలాషి” లాంటి గర్వించదగ్గ ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మొదట్లో ఈ చిత్రానికి బేవర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్ కి కూడా వస్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఈ చిత్రం చూస్తే అర్దమవుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు… పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం.
నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తన మనసు, ప్రాణంపెట్టి రాసిన.. తల్లి తల్లి నా చిట్టి తల్లి పాటను ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోరు. ఈ పాట రాసిన సుద్దాలకు నా మనసు ఇచ్చేస్తున్నాను. జీవితంలో నేను చేసిన అద్భుతమైన పది సినిమాల్లో నేను గర్వంగా చెప్పుకునే పది సినిమాల్లో బేవర్స్ ఉంటుంది. మన జీవితాన్ని ఆవిష్కరించే సినిమా. నేను హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఉండే వ్యక్తి రమేష్ చెప్పాల. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
సునీల్ కశ్యప్ ఇక్కడికి రాలేదు. మంచి పాటలిచ్చాడు. ఈ చిత్ర హీరో సంజోష్ కు మంచి ఫ్యూచర్ ఉంది. తెలుగులో మంచి హీరో కావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాల్లో మంచి సినిమాలు బాగా ఆడుతాయి. నా చిత్ర నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. అని అన్నారు.
చిత్ర కథానాయకుడు సంజోష్ మాట్లాడుతూ… ఇది కుటుంబ కథా చిత్రం. మిడిల్ క్లాస్ సినిమా. తండ్రిలాగా రాజేంద్రప్రసాద్ గారిని చూశాను. రమేష్ గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ గారితో కలిసి నటిస్తానని అనుకోలేదని అన్నారు.
నిర్మాతలు పొన్నాల చందు, డాక్టర్ మూర్తి, ఎమ్. అరవింద్ లు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ గారు నటించిన అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి ఓకటి. అలాంటి చిత్రానికి రైటర్ గా పనిచేసిన రమేష్ చెప్పాలా దర్శకుడిగా రాజేంద్రప్రసాద్ గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బేవర్స్. అక్టోబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము
దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ… రాజేంద్ర ప్రసాద్ వంటి నటుడితో కలిసి వర్క్ చేయడం నా ఆదృష్టం. శ్రేయోభిలాషి చిత్రం ద్వారా కలిశాను. ఈ సినిమాతో దర్శకుడిగా నటకిరీటితో కలిసి వర్క్ చేశానని అన్నారు.