టాలీవుడ్‌: అక్టోబర్‌ బాక్సాఫీస్‌ రివ్యూ

సక్సెస్‌మాట పక్కనపెడితే ప్రతినెల కాస్త బజ్‌ ఉన్న సినిమాలు 3-4 రిలీజ్‌ అవుతుంటాయి. అక్టోబర్‌లో కూడా అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. కానీ బ్లాక్‌బస్టర్‌ రేంజ్‌కు మాత్రం వెళ్లలేకపోయాయి. మొదటి వారంలో నోటా వచ్చింది.…

సక్సెస్‌మాట పక్కనపెడితే ప్రతినెల కాస్త బజ్‌ ఉన్న సినిమాలు 3-4 రిలీజ్‌ అవుతుంటాయి. అక్టోబర్‌లో కూడా అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. కానీ బ్లాక్‌బస్టర్‌ రేంజ్‌కు మాత్రం వెళ్లలేకపోయాయి. మొదటి వారంలో నోటా వచ్చింది. గీతగోవిందం లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఓపెనింగ్స్‌ కుమ్మేశాయి. కానీ సినిమాలో పసలేదు. అలా రిలీజైన మొదటిరోజే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది నోటా. ఈ విషయాన్ని విజయ్‌ దేవరకొండ కూడా ఒప్పుకున్నాడు.

నోటాతో పాటు థియేటర్లలోకి వచ్చిన దేశంలో దొంగలు పడ్డారు, భలే మంచి చౌకబేరమ్‌ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. కమెడియన్‌ అలీ బ్యాకింగ్‌తో థియేటర్లలోకి వచ్చింది దేశంలో దొంగలు పడ్డారు సినిమా. క్రైమ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక మారుతి బ్రాండ్‌తో వచ్చిన భలే మంచి చౌకబేరమ్‌ సినిమా, టైటిల్‌కు తగ్గట్టే మహా చౌకగా, నాసిరకంగా ఉంది.

అరవింద సమేత రాకతో అక్టోబర్‌ బాక్సాఫీస్‌కు ఓ ఊపొచ్చింది. అక్టోబర్‌లో సినిమా సందడి మొత్తం అరవింద సమేతలోనే కనిపించింది. అక్టోబర్‌ నెలలోనే కాదు, ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్‌ మూవీస్‌లో ఒకటిగా రిలీజైంది ఈ సినిమా. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ కావడంతో జనాలు ఏవేవో ఊహించుకున్నారు. ఫ్యాన్స్‌ అయితే మరీ ఎక్కువగా ఆలోచించారు. కానీ ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది 'అరవింద'.

కంప్లీట్‌ ఎమోషనల్‌ మూవీగా తెరకెక్కిన అరవింద సమేత, అటు త్రివిక్రమ్‌ మార్క్‌లో లేదు సరికదా.. కనీసం ఇటు ఎన్టీఆర్‌ మార్క్‌ కూడా లేదు. జనతాగ్యారేజ్‌ రేంజ్‌లో ఎన్టీఆర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందని భావించిన ఈ సినిమా, అతడి కెరీర్‌లో ఒక ఎబోవ్‌ యావరేజ్‌ చిత్రంగా మాత్రమే నిలిచింది. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబోలో ఓ హిలేరియస్‌ మూవీని లేదా ట్రయాంగులర్‌ లవ్‌ స్టోరీని ఆశించిన ప్రేక్షకులకు, అరవింద సమేత షాకిచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లపై భారీ స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నప్పటికీ, సినిమా రిజల్ట్‌ మాత్రం రిలీజైన 3 రోజులకే ఫిక్స్‌ అయిపోయింది. అదే వారంలో అరవింద సమేత సినిమాతో పాటు వచ్చిన బేవర్స్‌, మూడు పువ్వులు ఆరుకాయలు సినిమాల్ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.

అరవింద సమేత వచ్చిన వారం రోజులకే దసరా కానుకగా రామ్‌ నటించిన హలోగురు ప్రేమకోసమే సినిమా వచ్చింది. కంప్లీట్‌గా ఫార్ములాను నమ్ముకొని, రొటీన్‌ కథతో తెరకెక్కడమే ఈ సినిమా చేసుకున్న పెద్ద తప్పు. ఈమధ్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాల్లో ఇంత నాసిరకమైన క్లైమాక్స్‌ ఎందులోనూ లేదంటే, రామ్‌ సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికీ ఈ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా హీరోహీరోయిన్లు తెలుగు రాష్ట్రాల్ని చుట్టేస్తున్నారు. కానీ రిజల్ట్‌ మాత్రం యావరేజ్‌. ఇదే వారంలో రామ్‌ సినిమాతో పాటు విశాల్‌ నటించిన పందెంకోడి-2 కూడా వచ్చింది. సరిగ్గా పుష్కరం కిందట ఏ సినిమాతోనైతే తెలుగులో మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్నాడో, మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమాకు సీక్వెల్‌ తీయడంలో.. ప్రేక్షకులంతా పందెంకోడి-2పై అంచనాలు పెట్టుకున్నారు. కానీ అప్పటి మెరుపులు సీక్వెల్‌లో కనిపించలేదు. బి,సి సెంటర్లకు మాత్రమే పరిమితమై ఓ సాధారణ చిత్రంగా మాత్రమే మిగిలింది పందెంకోడి-2.

ఇక అక్టోబర్‌ ఆఖరి వారంలో అత్యథికంగా 5 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అన్నీ ఫ్లాపులయ్యాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా వీరభోగవసంతరాయలు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాను ఓ కల్ట్‌ మూవీగా చెప్పుకొచ్చారు మేకర్స్‌. ప్రతిఒక్కరూ మెచ్చుకుంటారంటూ ఊదరగొట్టారు. కానీ ఇది కల్ట్‌ కాదు కదా, కనీసం ఆ పదానికి దరిదాపుల్లో కూడా లేదు. పరమ రోత సినిమాగా పేరుతెచ్చుకుంది. నారారోహిత్‌, సుధీర్‌ బాబు, శ్రీవిష్ణు, శ్రియ.. ఇలా చెప్పుకోవడానికి తెలిసిన ముఖాలు చాలానే ఉన్నప్పటికీ సినిమాను భరించడం నరకప్రాయం.

వీరభోగవసంతరాయలు కంటే ఒకరోజు ముందొచ్చిన బంగారి బాలరాజు, ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన రథం, ఐశ్వరాభిమస్తు, 2 ఫ్రెండ్స్‌ సినిమాలు అట్టర్‌ ఫ్లాప్స్‌ అయ్యాయి. ఈ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఎలిమెంట్స్‌ కూడా ఏమీలేవు. థియేటర్లు దొరికాయి కాబట్టి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయంతే.

ఓవరాల్‌గా అక్టోబర్‌లో డబ్బింగ్‌తో కలుపుకొని 15 సినిమాలు రిలీజ్‌ అయితే, వాటిలో బ్లాక్‌బస్టర్‌ ఒక్కటి కూడా లేదు. అరవింద సమేత, హలోగురు ప్రేమకోసమే సినిమాలు మాత్రమే ఓ మోస్తరుగా ప్రేక్షకులను అలరించాయి. అలా ఈ ఏడాది దసరా బాక్సాఫీస్‌ బోసిపోయింది.

ఆత్మ గౌరవమా తోటకూర కట్టా.. కాంగ్రెస్ తరపున కొత్త దళారీ చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్