రాష్ట్రంలో సార్వత్రిక ఫలితాలు ఇంతలా అంచనాలకు అందకుండా వుండడం చాలా కాలం తరువాత ఇదే. ఎన్నికల పోలింగ్ జరిగిపోయిన సాయంత్రానికే అసలు లెక్కలు కట్టేసి, గెంతేసే వాళ్లు గెంతులేస్తారు..మొహం దాచుకునే వాళ్లు దాచుకుంటారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించలేదు. పోలింగ్ సాయంత్రం చంద్రబాబు కాస్త డల్ గా కనిపించారు కానీ, మర్నాటికి తేరుకున్నారు. వందకి పదివేల శాతం తామే అధికారం చేపడతామన్నారు. జగన్ అయితే ఫలితాలు కెరటంలా వస్తాయన్నారు. దాంతో జనాల్లో ఉత్కంఠ. బెట్టింగ్ వీరులు చెలరేగిపోయారు. కోట్ల కొద్దీ బెట్టింగ్ లు ఇప్పుడు నడుస్తున్నాయి. కోట్లు బెట్టింగ్ కాసినవాళ్లు, టెన్షన్ తట్టుకోలేక, ఇచ్చాపురం నుంచి కర్నూలు దాకా వాళ్లే స్వంత సర్వేలు కూడా చేసేసుకున్న దాఖలాలున్నాయి. ఇలాంటి సమయంలో మున్సిపల్ ఫలితాలు వచ్చాయి. వైకాపా ఆశలను నిలువునా ముంచేసేలా జనం తీర్పు చెప్పారు.
సరే, తక్కువ ఓట్లు కదా, మెజారిటీ ఓటర్లు తీర్పు వేరేగా వుంటుందని ఆ పార్టీ సర్ది చెప్పుకుంది. కానీ మర్నాడే పల్లె జనాల ఓఠ్లు తీర్పు కూడా వచ్చింది. ఇక్కడ వైకాపాకు కొంచెం ఊరట లభించింది కానీ, పూర్తి స్థాయి నమ్మకం మాత్రం కలగడం లేదు. ఎందుకంటే వెయ్యి ఎంపీటీసీ స్థానాలు, వంద జెడ్పీటీసీ స్థానాలు తేడా కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. అంటే సుమారు యాభై నియోజకవర్గాలు. ఇది కాక, జిల్లాలకు జిల్లాలు లేచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, అనంతరపురం వంటి జిల్లాలు తెలుగుదేశానికి అండగా అలా నిల్చుండిపోయాయి. ఇదే ఓటర్లు మరో మూడు నాలుగు వారాల తరువాత అసెంబ్లీకి, పార్లమెంటుకు ఓట్లు వేసారు. ఇక్కడ సమస్య ఒకటే. అంతలోనే ఓటర్ల మైండ్ సెట్ మారుతుందా? మారిందా అన్నిది. 13జిల్లాలకు దాదాపు మూడు వంతుల జిల్లాల్లో తెలుగుదేశం ఏకపక్ష పోలింగ్ కనిపిస్తోంది. మహా మారితే రెండు మూడు శాతానికి మించి మారే అవకాశం కనిపించడంలేదు.
కానీ చిత్రంగా ఎంపీటీసీ, మున్సిపల్ ఫలితాలు వెలువడక ముందే వివిధ ప్రసార మాధ్యమాలన్నీ ఎగ్జిట్ పోల్ చేసాయి. అవన్నీ వైకాపాకు అనుకూలంగానే వచ్చాయని విశ్వసనీయ సమాచారం. అలాగే ఇంటిలిజెన్స్ విభాగం కూడా వైకాపాకు అనుకూలంగానే తమ నివేదిక ఇచ్చింది. కానీ వాస్తవ ఫలితాలు చూస్తే ఇలా వున్నాయి. అంచనాలు చూస్తే అలా వున్నాయి? ఏది నిజమవుతుంది అన్నది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. సర్వేలు చేసిన మీడియా సంస్థలు కూడా స్థానిక ఫలితాలు చూసిన తరువాత తమ సర్వేపై తామే అనుమానపడ్డాయి. ఒక్క 10టీవీ మాత్రం ఏమయితే అయిందని బయటపెట్టింది. ఆ అంకెలు అంచనాలే కానీ శాస్త్రీయ సర్వే కాకపోవచ్చు. శాస్త్రీయ సర్వే చేసిన ఎన్టీవీ కూడా ఫలితాలు బయటకు వెల్లడించలేదు. ఈనాడుకు తన సర్వే తాను చేసుకోవడం అలవాటే, కానీ జోస్యం చెప్పడం అలవాటు లేదు. ఈనాడు సర్వేలో తెలుగుదేశానికే అనుకూలమని తేలినట్లు తెలుస్తోంది. మరి మిగిలిన సర్వేలు ఎందుకిలా వచ్చాయి, ఇంటిలిజెన్స్ ఎందుకు నివేదిక అలా ఇచ్చింది. ఓ ఇంటిలిజెన్స్ అధికారి ఈ విషయమై మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై భాజపా, మోడీ ప్రభావం, కొంత రెబెల్స్ ప్రభావం పడిందని, దాని వల్ల కొంత మేరకు తేడా వస్తుందని అన్నారు. నిజానికి రెబల్స్ వచ్చిన మాట వాస్తవమే కానీ, చంద్రబాబు చాలా చాకచక్యంగా వారిని తప్పించగలిగారు.
పైగా సమైక్యాంధ్ర జనాలను తన వైపు తిప్పుకోగలిగారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పూర్తిగా తేదేపా వైపు మళ్లించడంలో అక్కడ కొత్తగా పార్టీలకి జంప్ అయిన జనాలు బాగా కృషి చేసారని వినికిడి. పైగా పార్టీలొకి అధికారికంగా రావడం ఆలస్యమైనా, స్థానిక ఎన్నికల వేళకే గంటా, తోట వగైరా కాపు నాయకులు తెలుగుదేశం వైపు తిరిగిపోయారు. ఆ ప్రభావం విశాఖ, తూర్పు జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే క్షత్రియులు ఈ సారి కలిసికట్టుగా వైకాపాకు వ్యతిరేకంగా పనిచేయడం అన్నది బహిరంగంగానే జరిగింది. ఆ ప్రభావం పశ్చిమ గోదావరిపై కనిపించింది. ఇక ఇది అసెంబ్లీకి మాత్రం ఎందుకు మారుతుంది.మారే వీలు కనిపించడం లేదు. ఎటొచ్చీ ఏమన్నా మారితే సీమ జిల్లాల్లో కొంత మారొచ్చు. ఎందుకంటే వైఎస్ లేదా జగన్ పై అభిమానంతో, సిఎమ్ గా చూసుకొవాలని ఎవరికన్నా వుంటే, వారు అటు ఓటేసే అవకాశం వుంది. అక్కడ స్థానికత, ఇతరత్రా వ్యవహారాలు వుండవు కాబట్టి. మన ఓటర్లకు ఇలా అటు, ఇటు వేయడం అన్నది, ఓసారి అటు వేసాం, ఈ సారి ఇటువేద్దాం అనుకునే వ్యవహారం అలవాటే. అయితే ఇలా ఆలోచించేవారి శాతం ఏమేరకు వుంటుందన్నది చూడాలి.
నిన్న మొన్నటి ఫలితాల ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం సెంచరీ సాధించడం పెద్ద కష్టం కాదనిపిస్తోంది. అయితే లగడపాటి సర్వే ప్రకారం అంతకన్నా ఎక్కువే వస్తాయంటున్నారు. కానీ సెంచరీ సాధ్యమవ్వచ్చేమో కానీ, దాటడం కష్టమనే అంచనాలు వున్నాయి. కానీ వేవ్ అనేది ఇప్పుడు ఎటు వుందన్నది స్పష్టమైంది కాబట్టి, లగడపాటి సర్వే నిజం కావడానికే ఎక్కువ అవకాశాలు వున్నాయని అనేవారూ వున్నారు.
మొత్తానికి అంచనాలు ఇలా..అంకెలు అలా..చెబుతుంటే 16న ఫలితాలు ఎలా వుంటాయన్నదానిపై ఉత్కంఠ పెరిగిపోతోంది అంతకంతకూ.
చాణక్య