రెండు లెక్కింపులు-ఓ విశ్లేషణ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఒకదాన్ని పట్టణ ఓటరు, మరో దాన్ని పల్లె ఓటరు డిసైడ్ చేసారన్నది సహజంగా అనుకునేది. కానీ ఇక్కడ ఈ రెండింటి నడుమ సెమీ…

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఒకదాన్ని పట్టణ ఓటరు, మరో దాన్ని పల్లె ఓటరు డిసైడ్ చేసారన్నది సహజంగా అనుకునేది. కానీ ఇక్కడ ఈ రెండింటి నడుమ సెమీ అర్బన్ అనే కొత్త కేటగిరీ కూడా వచ్చి చేరింది. పెద్ద పంచాయతీలను మున్సిపాల్టీలుగా చేయడంతో ఈ కొత్త తరహా వర్గం ఏర్పడింది. నగర శివార్లు, కొత్తగా ఏర్పడని మున్సిపాల్టీలు ఈ  వర్గం కిందకు వస్తాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఈ తరహా ఓటింగ్ కూడా వుంది. దాని ఫలితమే వైకాపాకు పట్టణ పోలింగ్ లో వచ్చిన ఓట్ల శాతం లేదా వార్డుల లెక్క. అలాగే ఎంపీటీసీ ఓట్లలో వైకాపా కాస్తే తేరుకోవడానికి, తెలంగాణలో తెరాస ముందంజలో వుండడానికి కూడా ఈ తరహా సెమీ అర్బన్ ఓటింగ్ కు దగ్గరగా వుండే రూరల్ ఓటింగ్ కారణం అనుకోవాలి. అందువల్ల ఎంపీటీసీ ఫలితాలు వైకాపా కు కాస్త ఊరట నిచ్చి 16వరకు డీలా పడిపొకుండా కాపాడతాయి. అయితే 16న ఫలితాలు ఎలా వుంటాయన్నదాన్ని మళ్లీ మరొసారి ఆలోచించాల్సిన పరిస్థితిని ఎంపీటీసీ లెక్కింపు కలుగచేసింది. అలా అని వైకాపా మరీ ఎక్కువ అశలు పెట్టుకోవడానికి కూడా వీలు కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు పరిస్థితులు ఏర్పడితే తప్ప, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, మున్సిపల్, ఎంపీటీసీ ఫలితాలకు భిన్నంగా వుండే అవకాశం కనిపించడం లేదు. 

ఎందుకంటే,  పోలింగ్ కు ముందు చాలా మంది లెక్క వేసుకున్నది సీమ జిల్లాల్లో వైకాపా 70శాతం సీట్లు, ఆంద్ర ప్రాంతంలో 50శాతం సీట్లు గెల్చుకుంటుంది. తేలుగుదేశం అక్కడ ముఫై, ఇక్కడ యాభై శాతం సీట్లు గెల్చుకుంటుందని. కానీ  తీరా పోలింగ్ తరువాత అంచనా వేసింది. వైకాపా అక్కడ, తేదేపా ఇక్కడ 70శాతం సీట్లు గెల్చుకుంటాయని. ఎవరికి ఎక్కడ కాస్త ఎక్కువ ఎడ్జ్ వుంటే వారికి అధికారం అందుతుందని. కానీ ఇప్పుడు ఈ రెండు లెక్కింపులు పూర్తయ్యాక తెలుస్తున్నదేమిటంటే, సీమలో వైకాపా అనుకున్న మేరకు సీట్లు గెలుచుకోలేకపోతోందని. సీమలోని పల్లెల్లో కూడా తెలుగుదేశం అనుకూల వైఖరి వుండడం అంటే అది కచ్చితంగా వైకాపాకు మైనస్సే అవుతుంది. దీన్ని అంగీకరించక తప్పదు. అదే సమయంలో ఉత్తర, దక్షిణ కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలు తెలుగుదేశం పార్టీకి 'కాపు' కాస్తున్నాయని స్పష్టమైంది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నుంచి తెలుగుదేశంలోకి నాయకులు చేరడం ప్లస్ అయిందనే అనుకోవాలి. విశాఖ జిల్లాలో గంటా అండ్ కో, ఈస్ట్ లో కాపు నాయకులు, అనంతపురం లో జెసి బ్రదర్స్ చేరిక తెలుగుదేశానికి కలిసి వచ్చిందనే అనుకోవాలి. 

అంటే పోలింగ్ తరువాత అనుకున్న అంచనాలు ఈ లెక్కల వల్ల పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పుడు సీమలో ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుందనుకుంటే, ఆంధ్రలో 60-40 కావడానికి అవకాశం కనిపిస్తోంది. అంటే టోటల్ గా 110-90 కింద తేలుతుంది. దీన్ని సీట్లలోకి మారిస్తే, 95 నుంచి 100 స్థానాలు తెలుగుదేశానికి, 75 నుంచి 80 స్థానాలు వైకాపాకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అంటే మున్సిపాల్టీ, ఎంపీటీసీ ఫలితాల వెలువడడానికి ముందు తెలుగుదేశం పార్టీ అంతర్గతం చర్చలో తనకు వేసుకున్న సీట్ల సంఖ్య కూడా 90 నుంచి 95. అది కేవలం గాలి లెక్క కాదు. ఆపార్టీ సంస్థాగతంగా సేకరించిన లెక్కలకు అనుగుణంగా వేసుకున్న సంఖ్య. అందువల్ల అది వాస్తవం అవడానికే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం వేవ్ అన్నది కొన్ని జిల్లాల్లో వుందని ఈ ఫలితాలు రుజువుచేసాయి. ఆ వేవ్ కొనసాగితే,. మాత్రం మరో పదని స్థానాలు అటు, వైకాపాకు ఇటు అయ్యే అవకాశం కూడా వుంటుంది. అయితే ఈ ఫలితాలకు, సార్వత్రిక ఫలితాలకు కొంచెం తేడా వుండే అవకాశం మాత్రం ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. పోలింగ్ ముందుకు, పోలింగ్ తరువాతకు తెలుగుదేశం ఓట్లు మూడు శాతం తగ్గాయని, వైకాపాఓట్లు 7శాతం పెరిగాయని సిఎన్ఎన్-ఐబిఎన్ తన సర్వేలో తేల్చిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. పైగా ఎంపీటీసీ, మున్సిపాల్టీ ఓట్ల శాతం మధ్య తేడా కన్నా, సీట్ల సంఖ్య మధ్య తేడా ఎక్కువగా వుంది. కారణం, సీట్లకు వుండే ఓట్ల పరిమాణం చాలా తక్కువ కాబట్టి. కానీ ఇదే అసెంబ్లీకి వస్తే చాలా ఎక్కువగా వుంటుంది.

మొత్తం మీద అసెంబ్లీ ఫలితాలు మళ్లీ మరోసారి ఆసక్తి రేకెత్తించేలా మారబోతున్నాయి. మున్సిపాల్టీ ఫలితాలు కాస్త ఏక పక్షంగా సాగితే, రూరల్ ఓటు వున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు కాస్త అటు ఇటుగా వున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో లెక్కింపు అయిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఓటర్లు ఏ మేరకు తమ నిర్ణయం ప్రకటించారో వేచి చూడాల్సిన ఉత్కంఠ తప్ప లేదు.,

చాణక్య

[email protected]