బాబు ఈజ్ బ్యాక్

విజయం అయాచితవరం ఎన్నడూ కాదు. దాని వెనుక అవిరళ కృషి ఎప్పుడూ వుంటుంది. అయితే విజయం అదృష్టాన్ని వెంటబెట్టకు వస్తుంది. అదృష్టం లేకుండా విజయం ఒంటరిగా రాదు. తెలుగుదేశం అధ్యక్షుడు, 13 జిల్లాలో కొత్త…

విజయం అయాచితవరం ఎన్నడూ కాదు. దాని వెనుక అవిరళ కృషి ఎప్పుడూ వుంటుంది. అయితే విజయం అదృష్టాన్ని వెంటబెట్టకు వస్తుంది. అదృష్టం లేకుండా విజయం ఒంటరిగా రాదు. తెలుగుదేశం అధ్యక్షుడు, 13 జిల్లాలో కొత్త ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదంతమే అందుకు ఉదాహరణ. పదేళ్ల కాలం పాటు, ప్రతిపక్ష ప్రవాస జీవితం గడిపిన నాయకుడు. అయిదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకునేందుకు నానా పాట్లు పడినవాడు. ఈసారి అధికారం చేపట్టేందుకు అహరంహం శ్రమించినవాడు..అందుకోసమే అనుక్షణం  తపించినవాడు..అందుకు అవసరమైన ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయనివాడు..ఏ ఒక్కరినీ విస్మరించనివాడు..అతడు చంద్రబాబు. ఇదంతా ఆయన కృషి..దీనికి తోడైంది అదృష్టం. అది రాష్ట్ర విభజన రూపంలో. ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా వుండి వుంటే, ఈ విజయం చంద్రబాబుకు దక్కేది కాదు. రెండు దఫాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబుకు ఈ సారి అధికార పీఠం అందేది కాదు. పార్టీని విజయతీరాలకు నడపడంలో బాబు కృషి, విభజన రూపంలో కలిసి వచ్చిన అదృష్టం వెరసి, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో మరోసారి అధికారం.

సుమారు నెల రోజుల ఉత్కంఠకు తెరపడింది. నెలలు…వారాలై..వారాలు..రోజులై..రోజులు గంటలై ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. అసలు బేరీజు వేయలేని రీతిలో జరిగిన పోరులో జనం చంద్రబాబు వైపే మొగ్గుచూపారు. రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ విభజిస్తుంటే ఏమీ చేయలేకపోయిన జనం, కనీసం మిగిలిన ముక్కనైనా అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబును అందుకు తగిన సారథిగా భావించి, ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ లక్ష్యం ముందు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పైనా, అతని కుటుంబం పైనా వున్న అభిమానాన్ని సైతం పక్కన పెట్టారు. జగన్మొహన రెడ్డిని తోసిరాజన్నారు. 

*******
చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తున్నారు. హైదరాబాద్ స్వరూప, స్వభావాలను తన విజన్ తో మార్చేసిన వ్యక్తి. అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. దాని వెనుక ఆయన స్వప్రయోజనాలు కూడా నెరవేరాయని ఎవరైనా అంటే అననీండి. కానీ రాష్ట్రం కూడా ప్రయోజనం పొందింది. కొన్ని వందల కుటుంబాలు ప్రయోజనం పొందాయి. కానీ రెండు సార్లు ఎన్నికల్లో జనం ఆయనను అధికారానికి దూరంగా వుంచారు. ఇప్పుడు వారే దగ్గరకు తీసుకున్నారు. ఎందుకలా? అప్పుడేమైంది..ఇప్పుడేం జరిగింది.

********

రెండవ దఫా ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబులో ధీమా హెచ్చింది. అదే సమయంలో దేశం, ప్రపంచం ఆర్థిక సంస్కరణల వైపు దృష్టి సారిస్తున్నాయి. మిగిలిన వారికంటే కాస్త ముందుగా ఆలోచించే చంద్రబాబు వాటిని అందిపచ్చుకున్నారు. ఒకేసారి అన్నింటినీ ముందుకు నడిపించారు. దాంతో ఒక్కసారి జనంలో కలకలం రేగింది. మన నేటివిటీ ఏమిటన్నది బాబు కాస్సేపు మరిచిపోయారు. వ్యవసాయం, మధ్యతరగతి, ఈ రెండు వర్గాలను ఆయన విస్మరించారు. ధరలు పెరిగాయి. విద్యుత్ భారమైంది. వ్యవసాయానికి సాయం కరువైంది. ప్రజల్లో కనిపించిన ఈ ఆందోళనను దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా తెలివిగా అందుకున్నారు. పాదయాత్రతో జనానికి దగ్గరయ్యారు. విజయం సాధించారు. విజయం సాధించిన వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు మరోసారి ఆయనకు అందలం అందించాయి. కానీ ఆయన అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. 

అక్కడ కథ అడ్డం తిరిగింది. ఒక్కొక్కటిగా వైఎస్ హయాంలో జరిగిన అవకతవకలు బయటకు రావడం ప్రారంభమైంది. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అరెస్టయ్యారు. దీంతో ఆయన ప్రజల్లోకి వెళ్లారు. తనను వేధిస్తున్నారన్న ప్రచారం ప్రారంభించారు. ప్రజలు రెండుగా చీలారు. నమ్మిన వారు..నమ్మని వారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు కాస్త చేష్టలుడిగినట్లు కనిపించారు. అలాంటి సమయంలో మరో పిడుగు పడింది. అది తెలంగాణ విభజన రూపంలో. చటుక్కున జగన్ సమైక్య స్టాండ్ తీసుకున్నారు. ఇది చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టింది. తెలంగాణలో పార్టీని కాపాడాలి. సీమాంధ్రలో నిలబెట్టాలి. రెండూ భిన్న పార్శ్వాలు. అక్కడే చంద్రబాబు చాణక్యం కనిపించింది. 

సమన్యాయం అనే కొత్త నినాదం తలకెత్తుకున్నారు. విభజన అంగీకారమే కానీ సమన్యాయం జరిగితేనే అన్న మెలిక ప్రాతిపదికగా ఆయన ముందుకెళ్లారు. ఎన్నికల ముందు రాష్ట్ర విభజన వుంటుందని అప్పటికి నాలుగేళ్ల ముందు నుంచి అందరూ ఊహిస్తున్నదే. అదే పనికి ఒడిగట్టింది సోనియా. అంతే చంద్రబాబును అదృష్టం వెదుక్కుంటూ వచ్చింది. అంత దగ్గరలో ఎన్నికలు వుండడంతో, ప్రజలకు విభజన కలిగించిన ఆగ్రహం తట్టుకోలేమని కాంగ్రెస్ నుంచి వలసలు వెల్లువెత్తాయి. అయితే అప్పటికి చాలా కాలం ముందుగానే ఎన్నికలకు రెడీ అయిపోయి, లోపాయికారీగా అభ్యర్థిత్వాలు కూడా రెడీ చేసుకుని కూర్చున్న జగన్ ఈ వలసలను ఉపయోగించుకోలేకపోయారు. తన తలుపు తట్టిన గంటా, జెసి, తోట, ఇంకా చాలా మందికి..నో..నో అని చెప్పుకుంటూ పోయారు. అదే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు చంద్రబాబు. వచ్చిన వాళ్లందరినీ రానిచ్చారు. పార్టీలో వున్నవారికి సర్ది చెప్పుకున్నారు. హామీలు ఇచ్చేవారికి హామీలు ఇచ్చారు. దాంతో ఆ గండం గట్టెక్కింది.

ఆదుకున్న మోడీ ఫ్యాక్టర్

అందరికన్నా ముందుగా మోడీ వేవ్ ను పసిగట్టింది చంద్రబాబే. గతంలో అప్పటి పరిస్థితుల రీత్యా భాజపాతో చేసుకున్న తెగతెంపులను ఆయన చాలా చాకచక్యంగా ప్యాచప్ చేసుకున్నారు. అవసరమైనపుడు తామే ముందుకు వెళ్లాలన్న సంగతి గుర్తెరిగి, అంత రాజకీయ సీనియార్టీని పక్కన పెట్టి, పదే పదే ఢిల్లీకి వెళ్లి పొత్తు కు బాటలు వేసుకువచ్చారు. ఆపైన పొత్తు కోసం ఆయన తన సకల ప్రయత్నాలు చేసారు. అడ్డం పడిన తెలంగాణ భాజపా నేతలకు ఆ పార్టీ అధిష్టానం చేతనే బ్రేకులు వేయించగలిగారు. అలా మొత్తానికి మోడీ అండ సంపాదించారు. అలాంటి సమయంలో ఆయన వేసిన మరో ఎత్తగడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

'పవర్' తోడైంది

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వుందని, మీడియా టైకూన్ రామోజీ తదితరులతో చర్చలు సాగుతున్నాయని తరచు వదంతులు వినిపించడం ప్రారంభమైంది. నమ్మిన వారు నమ్మారు..నమ్మని వారు నమ్మలేదు. సరిగ్గా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి సినిమాటిక్ గా పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేసారు. పార్టీ పెడతారు, చంద్రబాబుకు మరో చిరంజీవిలా అడ్డం పడతారు అని అందరూ అనుకంటే, చిత్రంగా పక్కన నిలిచారు. దాంతో ఒక్కరనుకున్నది ముగ్గురయ్యారు. మూడు ఒకట్లు నూట పదకొండు అంటే, పంగనామాలు అన్నవారికి త్రిమూర్తులం మేమంటూ సమాధానమిచ్చారు.  

బలగాలు వుంటే చాలదు

బలగాలు వుంటే సరిపోదు. వాటిని సరైన దిశలో నడిపించే సేనాని కావాలి. ఆ సేనానికి అందుకు తగిన చాకచక్యంక కావాలి. అవన్నీ పుష్కలంగా వున్నాయి చంద్రబాబుకు. పని పూర్తి చేయడం అంటే మనమే అలిసిపోవడం కాదు, మన కిందివాళ్లతో చేయించగలగడం. జగన్ జనంలోనే తిరిగాడు. అలిసిపోయాడు. మొహం కందిపోయింది. కానీ ఫలితం? చంద్రబాబు పాదయాత్ర తరువాత అలసినది లేదు. కానీ తన తరుపున ఎందరు పనిచేసారని.  ఎంతమంది మహామహులు..హేమా హేమీలు..ఢిల్లీలో కార్య చక్కబెట్టడానికి, సర్దుబాట్లు చేయడానికి, సమాచార సేకరణకు, సమాచార విస్తృతికి ఇలా ఒకటేమిటి ప్రతిదానికీ బాబు దగ్గర బలగం వుంది. వారిని సవ్యదిశగా నడిపించే చాకచక్యం ఆయన దగ్గర వుంది. కొత్తనీరు బయటనుంచి వస్తుంటే కార్యకర్తలు బుస్సుమన్నారు. టికెట్ ఆశించినవారు, వేరే వారు తన్నుకుపోతే అలిగారు. కానీ ఏమయింది. అందరినీ అన్ని విధాలా బుజ్జగింపులు. ఎలా విన్న వారికి అలా. వినని వారిని వారి మానాన వారిని వదిలేసాడు. హరికృష్ణ, జూనియర్ సైలెంట్. బాలయ్యకు టికెట్ ఇచ్చి వారిని కదలకుండా చేసారు. 

వైఎస్ వ్యూహాలే శరణ్యం 

వైఎస్ ఎన్నికల్లో ఎలా గెలిచారో చూసారు. సరిగ్గా అవే ఎత్తుగడలువేసారు. పాదయాత్ర చేసారు. జనంలోకి వెళ్లారు. ఆపై రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటివి తిరుగులేని బాణాలు ప్రయోగించారు. అన్నింటికి మించి బిసిలకు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అన్న నినాదాన్ని ఇచ్చారు. గెలవని చోట నినాదం ఏమిటనుకున్నారంతా. కానీ దాని ప్రభావం దానికి వుంది. ఆపై అది చాలదన్నట్లు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు ప్రకటించారు. కాపులకు, బిసిలకు ఎరవేసారు. ఆపై వైఎస్ మాదిరిగానే కాపులను దగ్గరకు తీసారు. గంటా, తోట వగైరాల ద్వారా అది సాధించారు. ఇవ్వాళ బాబు విక్టరీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు కీలకపాత్ర వహించాయి. చిత్రంగా ఇదే తూర్పుగోదావరి జగన్ కు అభిమాన  జిల్లాగా వుండేది. ఊ..అంటే చాలు జగన్ అక్కడే ఎక్కువ సార్లు తిరిగేవారు. కానీ చివర్న చేసి ఫలితం బాబు పరమైంది. 

ఒక్క కాపు, బిసి కులాలపైనే కాదు దాదాపు అన్ని కులాలపైనా గురిపెట్టారు. మంద కృష్ణమాదిగ తన వంతు సాయం తాను చేసారు. ఎక్కడో కర్నూలులో టిజి వెంకటేష్ వచ్చి ఏం సాధిస్తారు అనుకున్నారు. రోశయ్య తరువాత రాష్ట్రంలో వైశ్యులకు మిగిలిన పెద్ద నాయకుడు. ఆ ప్రభావం వుండదా? పశ్చిమ గోదావరి క్షత్రియులను దగ్గరకు తీసారు. ఇలా ప్రతి ఒక్క కుల బలం సంపాదించారు. ఆఖరికి ఎన్నడూ లేనిది ఈసారి ఉద్యోగులు కూడా బాబుకు దగ్గరయ్యారు. ఏ ఉద్యోగులైతే ఆయన ఓటమికి కారణమయ్యారో, వారే ఇప్పుడు గెలుపు బాటలు వేసారు. 

నినాదాలు-ప్రచారం

జాబు రావాలంటే బాబు రావాలి. రాజధానిని నిర్మించగల సామర్థ్యం బాబుకే వుంది. అనుభవం కలగినవాడు బాబే. సీమాంధ్రను సింగపూర్ చేస్తాం..ఇలాంటి నినాదాలన్నీ జనంలోకి చొచ్చుకుపోయాయి. సహజంగానే చదువుకున్న యువతరం అవినీతిని ద్వేషిస్తారు. సామాజిక వెబ్ సైట్ల ద్వారా ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఆ రీతిలో ప్రచారం సాగించారు. 

అన్నింటికి మించి, బాబు ఇంత చేసినా, అంతకు అంతా ఫలితం దక్కడానికి కారణం బలమైన మీడియా అనుకూలంగా వుండడం. జగన్ కు ఒక్క సాక్షి అండగా వుంటే, మిగలిన మీడియాలో తొంభై శాతం బాబుకు అనుకూలంగా పనిచేసింది. బాబు వేసిన ప్రతి ఎత్తుగడ పారే దిశగా కథనాలు వండి వార్చాయి. బాబు ఒకటి తలచి, మీడియా వేరోకటి తలిస్తే ఫలితం వేరుగా వుండేది. ఇక్కడ సింపుల్ ఉదాహరణ విశాఖ నుంచి దాదాపు రెండు దశాబ్ధాల కాలంగా చాలా మంది స్థానికేతరులే పోటీ చేసి గెలుస్తున్నారు. 

ఇప్పుడు అక్కడున్నవారిలో సగానికి పైగా స్థానికేతర రాజకీయనాయకులే. కానీ అప్పుడు పట్టించుకోని ప్రచార సాధనాలు, విజయమ్మ వచ్చేసరికి పట్టించుకున్నాయి. విశాఖ కూడా కడప మాదిరి మారిపోతుందన్న ప్రకటనలకు ప్రాధాన్యత హెచ్చింది. ఫలితం విజయమ్మ ఓటమి. ఇలా బాబు ఏమి అనుకుంటే, ఆ రీతిలో ప్రచారం సాగింది. అందుకు తగినట్లు దేశం మీడియా సెంటర్ ను బలోపేతం చేసారు. ఎప్పటికప్పుడు మీడియాకు ఫీడ్ బ్యాక్ అందించారు. ఆఖరికి పవన్ స్టార్ కు కూడా ఎక్కడిక్కడ పాయింట్లు అందించింది మీడియా వర్గాలే అన్న టాక్ వచ్చింది. మరి జగన్ కు మీడియా లేదా అంటే వుంది. లేనిదల్లా దాని మేనేజ్మెంట్. 

ఇలా ఒకటేమిటి? ఆఖరికి తెల్లవారి ఏ ఛానెల్ కు ఎవరు వెళ్లాలి? ఏ నాయకుడు ఎక్కడ మాట్లాడాలి? ఏ ప్రెస్ నోట్ ఎవరు ఇవ్వాలి? ఇలా ప్రతి ఒక్క చిన్న విషయం విస్మరించలేదు బాబు. అదీ మేనేజ్ మెంట్. అందులో సరిలేరు బాబు కెవ్వరూ..అందుకే హీ ఈజ్ బ్యాక్.

చాణక్య

[email protected]