అన్ని సార్లూ కుందేళ్లే గెలవ్వు.ఒక్కోసారి తెలివైన తాబేలు కూడా విజయం చేజిక్కించుకుంటుంది. నవ్విన నాపచేను పండుతుంది. అప్పుడు నివ్వెరపోవాల్సినంత అగత్యమేమీ లేదు. దాని వెనుక వున్న వైనమేమిటి అన్నది ఆలోచించడమే ఉత్తమం. అప్పుడే అర్థమవుతుంది..శక్తి ఒక్కటే చాలదు యుక్తి కూడా కావాలని.
తెలంగాణ ఉద్యమ నినాదం ఇప్పటిది కాదు..పోరుబాట నిన్న, ఈ రోజు నిర్మించింది కాదు. దానిలో సాగిపోయిన పథికులెందరో? కానీ కవాతు చేసి, జనాన్ని కూడా ఆ రాదారిపైకి తెచ్చిన వాడు మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అలియాస్ కెసిఆర్. కెసిఆర్ కు ప్రత్యర్థులు పెట్టుకున్న ముద్దు పేర్లు అన్నీ ఇన్నీ కావు. తోటరాముడు, టోపీ రాముడు, ముక్కోడు..ఇలా ఎవరిష్టం వారిది. కానీ అతన..అతనే..ఆయన శైలి ఆయనదే. అది తర్కానికి నిలవకపోవచ్చు కానీ, తగాయిదాకు సై అంటుంది. వీధిలో నిల్చుని నిలదీసే జనానికి నచ్చుతుంది. తెలంగాణ పాటకు పనికి వస్తుంది. తెలంగాణ మాటకు జీవాన్నిస్తుంది. అదే ఇప్పుడు అధికార సాధనకు జవ జీవమై నిలిచింది,.
మర్రి చెన్నారెడ్టి, చిన్నారెడ్డి, దేవేందర్ గౌడ్, నాగం జనార్థనరెడ్డి, గద్దర్, మంద కృష్ణ మాదిగ ఆఖరికి విజయశాంతి..ఇలా ఎందరు ప్రయత్నించారు తెలంగాణ సాధనకు తమ వంతు సాయం చేయాలని. వాళ్లేం చిన్నవాళ్లా..చితకవాళ్లా..ఎవరి స్థాయిలో వారు మహా మహులే. కానీ అందరివీ విఫలయత్నాలే. కానీ ఒక్క కేసిఆర్ కే ఎందుకు సాధ్యమైంది తెలంగాణ ఉద్యమ నిర్మాణ. ఒక్క కెసిఆర్ కే ఎందుకు సాధ్యమైంది, పిలుపిస్తే, జనం కెరటంలా ముందుకు రావడం, ఒక్క కేసిఆర్ కే సాధ్యమైంది తెలంగాణలోని అన్ని వర్గాల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించడం. అందుకే ఇప్పుడు కెసిఆర్..తెలంగాణ మాగాణికి మకుటం ధరించిన మహరాజు
***
కేసిఆర్ గెలిచాడు… అధికారానికి సరిపడా మెజారిటి సాధించారు కాబట్టి ఈ మాట ఎవరైనా అంటారు. కాని గెలిచాడు అన్న పదం అటు చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది. కాని గెలిచాడు అన్న పదంలో దాగి ఉన్న మరో అర్థం చంద్రబాబుకు వర్తించదు. ఆ అర్థం ఒక్క కేసిఆర్ కే వర్తిస్తుంది. ఆరుదశాబ్దాలుగా ఎందరో నేతలు పోటీ పడి ఓడిపోయిన దానిలో కేసిఆర్ గెలిచారు. కాని చంద్రబాబు గెలిచింది పదేళ్లుగా దూరం చేసుకున్న అధికారాన్ని మాత్రమే. అందుకే కేసిఆర్ గెలిచాడు అన్న దానిలో ఎంతో అర్థం దాగి ఉంది. అదేంటి అన్నది ఎంత విశ్లేషించినా తక్కువే.
ఆయన రాజకీయాల్లో గెలిచారు. ఆయన జీవితంలో గెలిచారు. ఆయన లక్ష్యసాధనలో గెలిచారు. ఆయన ప్రజల మనసులను గెలిచాడు, ఆయన ప్రత్యర్థులను ఓడించి గెలిచారు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విజయాలో. ఎన్నింటిపై గెలవాలో అన్నింటిపై కేసిఆర్ గెలిచారు. గట్టిగా గాలి వీస్తే ఎక్కడ తూలి కిందపడతాడో అనేంతగా ఉండే ఈ బక్క ప్రాణి ఎంతటి దృఢమైన వాడో చెప్పడానికి పదాలు చాలవు. అందుకే ఇప్పుడు కేసిఆర్ నిజమైన బాస్ గా అవతరించారు. తెలుగువారంతా ఒక్క రాష్ట్రంగా ఏర్పడక ముందునుంచి తెలంగాణ వారు ఆంధ్రవారితో కలిసేందుకు విముఖంగానే ఉన్నారు. ఆనాడు ఆంద్రలో కలపకుండా ఉంచడంలో కూడా తెలంగాణ నేతలు విఫలమయ్యారు.
ఆతర్వాత ఆంధ్ర నుంచి విడిపోవడంలో విఫలమయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు, బలిదానాలు జరిగాయి. ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని నిలుపుకోలేకపోయారు, తెలంగాణ సాధించలేకపోయారు. చెన్నారెడ్డి వంటి వాడే కొంత మేర దగ్గరగా వచ్చి బోల్తాపడ్డారు. ఆతర్వాత ఆ స్థాయిలో కూడా ఎవరు రాలేకపోయారు. కాని కేసిఆర్ వారందరిని మించిపోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంతే కాదు ఆ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుని రాజకీయాల్లోను గెలిచారు. ఇది చాలనుకుంటా… కేసిఆర్ గెలుపు ఎంత గొప్పదో చెప్పడానికి.
పోని కేసిఆర్ ఒక్కడే పార్టీ పెట్టి ప్రత్యేక తెలంగాణకు, రాజకీయానికి ముడిపెట్టారు. ఉద్యమానికి రాజకీయాన్ని జోడించారు, ఈ పని ఎవరు చేయలేదు కాబట్టి వారంతా ఓడి పోయారు అని కొట్టిపారేయడానికి కూడా వీలు లేదు. కేసిఆర్ ఆ పని మొదలెట్టాక ఎందరో నేతలు, ఉద్యమకారులు కూడా ఆపనిచేసారు. పట్టుపని పదిరోజుల పాటు కూడా ఆ పథంలో నిలవలేకపోయారు. ఇలాంటి ఉదహరణలు ఎన్నో న్నాయి. మట్టుకు కొన్ని చూద్దాం. గద్దర్… ఈయన రాజకీయ నాయకుడు కూడా కాదు. పైగా తెలంగాణలో మంచి పేరున్నవారు. ఆయన కూడా ఓ పార్టీ పెట్టారు, అయినా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు.
ఉద్యమమే ఊపిరిగా జీవితం గడుపుతున్న గద్దర్ తోనే తెలంగాణ సాధన ఉద్యమం చేతకాలేదు. ఇక రాజకీయ నాయకులంటారా… విజయశాంతి కూడా ఓ పార్టీ పెట్టింది. తెలుగుదేశంలో కేసిఆర్ కంటే కూడా ఎంతో పెద్దలీడర్ గా ఎదిగిన దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టారు. ఏమయింది పార్టీని మళ్లీ ఎత్తేసి బాబు పంచనే చేరారు. ఆయన తర్వాత అంతటి నేత నాగం జనార్దన్ రెడ్డి పార్టీ పెట్టారు. ఏమయిందో అందరికి తెలిసిందే. చిత్రమేమిటంటే తెలంగాణ సాధనకు ఏకంగా పార్టీలు పెట్టిన ఈ ఇద్దరు నేతలే ప్రజాధరణ పొందలేక వారే స్వయంగా ఓటమి పాలయ్యారు. కాని కేసిఆర్ తెలంగాణ సాధించారు, తనతో పాటు తన పార్టీ నంతటిని తెలంగాణ వ్యాప్తంగా గెలిపించారు. అంటే కేసిఆర్ ఎన్ని రకాలుగా గెలిచారో అర్థం చేసుకోవచ్చు.
సరే ఉద్యమం అన్నాకా, రాజకీయం అన్నాకా ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని తట్టుకోవాలి. వారు తట్టుకోలేకపోయారు అనుకుందాం. సరే అవన్నీ అదిగమించి అనుకున్నది సాధించడమే కదా అసలు సిసలైన హీరో లక్షణం. కాని రాజకీయంగా గెలవాలంటే ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వాటిలో పై చేయి సాధించాలి. కాని ఉద్యమంలో అది ఉండదు, అందులో ఉద్యమానికి రాజకీయం జోడించి విజయం రెండు రకాలుగా విజయం సాధించడం నిజంగా గ్రేటే. కేసిఆర్ టిఆర్ఎస్ పెట్టడానికి ముందు ప్రముఖంగా ఎదిగినా నాయకుడే.
2001 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీ పెట్టారు. అంతే కాదు తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పి రాజకీయానికి ఉద్యమాన్ని జోడించారు. పార్టీ పెట్టిన 70 రోజులకే వచ్చిన స్థానిక ఎన్నికల్లోనే పార్టీని రాజకీయంగా తెలంగాణలో నిలేసారు. ఇక అక్కడి నుంచి మొదలయింది కేసిఆర్ రాజకీయోద్యమ ప్రస్థానం. ఇది ఫెయిల్ చేసేందుకు సాగిన కుట్రలు కూడా అంతా ఇంతా కాదు. ఆయనది కుటుంబపార్టీ అన్నారు. తాగుబోతు అన్నారు. తెలంగాణ కోసం కాదు తెలంగాణ సెంటిమెంట్ అడ్డంపెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అన్నారు. ఆయన ఏది చేసినా అందులో తప్పులను ఎత్తి చూపారు. చివరకు ఆయన మేనల్లుడు హరీష్ రావును ఆయనపైకి ప్రయోగించి టిఆర్ఎస్ ను రెండుగా చీల్చే ప్రయత్నం కూడా జరిగింది. అంతెందుకు ఇక తెలంగాణ వచ్చేసింది అని భావిస్తున్న తరుణంలో రఘునందన్ రావు వంటి వారిని కూడా కేసిఆర్ పై ప్రయోగించారు. లెక్కలేనన్ని ఆరోపణలు వాటికి ఆదారాలను బయటపెట్టి పతనం చేయాలని చూసారు కాని వాటన్నింటిని జయించారు. ఆయన వ్యూహాలు, ఆయన మాటకారి తనమే వీటిలో 90 శాతం విజయాలకు కారణం. దీనికి మొక్కవోని ఆయన ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిసి ఆయనకు ఇంతటి విజయాన్ని అందించాయి.
తనే కాదు తన వారిని కూడా పదవులకు రాజీనామాలు చేయిస్తూ పదేపదే ఉపఎన్నికలకు పోయారు. అప్పట్లో ఇదంతా ఆయన స్వార్థం కోసం తననే నమ్ముకున్నవారి జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ అపవాదు మోపే ప్రయత్నం చేసారు. అంతే కాదు ఆయన సొంతపనిపై ఫాంహౌజ్ లో ఉన్నా, ఆరోగ్యం సహకరించక విశ్రాంతి తీసుకున్నా కూడా ఆయనపై నిందలు మోపారు. ఉద్యమానికి ఆయనను దూరం చేసే ప్రయత్నాలు చేసారు. ఆయనే స్థాపించి రాజకీయ జేఏసి ని కూడా దువ్వి ఆయనకు దూరం చేసే ప్రయత్నాలు చేసారు. విడిగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించారు. దానికి కేసిఆర్ ను దూరం చేసారు. కాని కేసిఆర్ లేచి ఉద్యమంలోకి వస్తేనే దానికి ఊపు వచ్చింది. ప్రణభ్ కమిటీ నుంచి రోషయ్య కమిటీ వరకు వేయించారు. ఆయన టిఆర్ఎస్ పెట్టిన ప్రథమంలో తెలంగాణ సాధించే వరకు పక్కకు తప్పుకునేది లేదు, అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అంటూ ప్రజల మనసులు దోచుకున్న ఆయన చివరిదాకా అదే కొనసాగించారు. చివరకు ప్రాణత్యాగానికి సిద్దం అంటూ తన శక్తి మేరకు ఆమరణ దీక్షను 11రోజుల పాటు చేసారు.2009 డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటనకు అదే కారణం.
అదే ప్రకటనపై మళ్లీ వెనక్కు పోతే ఇక అంతే సంగతులు, ఉద్యమం అంటూ వచ్చిన పదవులను వదులుకుంటూ పోతే లాభం లేదంటూ సొంత పార్టీలోని ముఖ్యులే కేసిఆర్ వ్యవహారం పట్ల పెదవి విరిచినా ఆయన అనుకున్నదానిని మాత్రం విడిచిపెట్టలేదు. శ్రీక్రిష్ణ కమిటి వచ్చింది, అతి ఒట్టిదేనని తేలిపోయింది. చివరకు తెలంగాన ఇస్తే చాలు తన పార్టీని తీసేస్తాను, ఇచ్చిన కాంగ్రెస్ తో కలిసిపోతాను అన్నంత వరకు వచ్చారు. తీరా వచ్చాక ఆ మాటనుంచి వెనక్కు తప్పుకుంటే విమర్శించారు. ఆయనది దొరల పార్టీ, గెలిపిస్తే దొరల రాజ్యమే వస్తుంది అని ప్రచారం చేసారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న ఆయన ఆ మాట తప్పడమే దీనికి ఉదహరణ అన్నారు. దీంతో తెలంగాణ వచ్చినా కూడా ఆయన గెలుపు ఒట్టిదే అనుకున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసారు. తెలంగాణ సెంటిమెంట్ ఆయనకే కాదు, ఇచ్చిన కాంగ్రెస్ కు, దానికి కారణమైన బిజేపికి దక్కుతుంది అన్నారు. కాని ఆరెండింటికి ఆ క్రెడిట్ ను ప్రజలివ్వలేదు. అంతే కాదు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న ఉత్తరతెలంగాణకే టిఆర్ఎస్ పరిమితం. సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డిలతో పాటు సగానికి పైగా ఆంధ్రవారే ఉంటే నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో టిఆర్ఎస్ అసలే లేదు అన్నారు. నిజంగా ఉద్యమకాలంలో అంటే ఇన్నాళ్లు ఏ ఎన్నికల్లోను ఆయన ఈ జిల్లాల్లో ఉనికే చాటుకోలేదు. అలాంటింది ఇప్పుడు అక్కడాఇక్కడ అని కాకుండా తెలంగాణ అంతటా ప్రజల మనసును దోచుకున్నారు. నిజమైన విజేతగా నిలిచారు కేసిఆర్.
చాణక్య