ఏ వ్యవస్థలో నైనా టాప్ పొజిషన్ లో వున్నవారు అప్పుడప్పుడు భలే జోక్ లు వేస్తుంటారు. అవి సంస్థలైనా, పార్టీలైనా కూడా…'నా వ్యవహార శైలి ఎలా వుంది? ఫరవాలేదా? నేనేమైనా మారాలా?' అన్నదే ఆ జోక్. గతంలో ఇలాంటి జోక్ ను చంద్రబాబు చాలా సార్లు పేల్చారు. నాయకులు మరీ ఇబ్బంది కరం కాని విషయాలు చెప్పేవారు.
వ్యవస్థలోనైనా, పార్టీలోనైనా, అలా మొహం మీద అడిగితే కిందవాళ్లు ఏం చెబుతారు? ఏదో నామ్ కే వాస్తే ఏదో ఓ మాట అంటారు..అడిగారు కనక చెప్పకపోయినా తప్పే అవుతుందని. అందుకే కావచ్చు.. తరువాత తరువాత బాబు ఆ జోక్ పేల్చడం మానేసి…నేను మారాను..మీరూ మారాలి..మీరు నమ్మాలి..అనడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ వారసత్వాన్ని వైఎస్ జగన్ పుచ్చుకుంటున్నట్లుంది.
నిన్నిటికి నిన్న పార్టీ పెద్దల సమావేశంలో 'నేనేమైనా మారాలా?' అని అయన అడిగినట్లు మీడియా కథనం. దానికి పార్టీ నాయకులు, 'మీరు ఊ అంటే ఓదార్పు..ఆ అంటే పరామర్శ..యాత్రలు మానేయండి' అని చెప్పారట.
నిజానికి ఇక్కడ రెండు, మూడు విషయాలు వున్నాయి. నిజంగా తనలో లోపం వుంది, తను మారాలి అనుకుంటే, ఒకర్ని అడగడం కాదు, తను చేస్తున్న పనులను తనకు తాను బేరీజు వేసుకోవాలి. రెండవది పరామర్శ లేదా ఓదార్పుల్లో వైఎస్ చావు ఓదార్పులు హ్యాస్యాస్పదంగా మారాయన్నది వాస్తవం. పరామర్శ, ఓదార్పు అన్న పేర్లు పక్కన పెట్టి, సమస్యల్లో వున్నవారి దగ్గరకు నాయకుడు వెళ్లడం చాలా అవసరం. ఎక్కడైనా భారీ నష్టం, ప్రమాదం జరిగినా, రైతులు ఇబ్బందుల్లో వున్నా వెళ్లి తీరాల్సిందే.
కానీ జగన్ స్వంత మీడియా సాక్షి..ప్రతిదానికీ 'నేడు జగన్ యాత్ర', 'నేడు జగన్ పరమార్శ', 'నేడు జగన్ ఓదార్పు' అంటూ ఏదో ఒక టైటిల్ పెట్టడం ప్రారంభించింది. అసలు ఆ టైటిళ్ల వల్లే జగన్ కార్యక్రమాలు అభాసు అవుతున్నాయి. ఫలానా ప్రాంతానికి నేడు జగన్ అనో, లేదా నేడు ఫలానా చోటికి జగన్ రాక అనో, కాదూ, సమస్యలు వినడానికి వస్తున్న జగన్ అనో అంటే పోయేది. ఒకటే రొడ్డకొట్టుడు రాతలు. దాంతో జగన్ వెళ్లడం అంటే పరమ బోర్ కార్యక్రమంలా తయారయింది.
అందువల్ల నాయకులు సలహా ఇవ్వాల్సింది జగన్ ను తిరగడం తగ్గించమని కాదు. వైఎస్ చావు ఓదార్పులకు స్వస్తి చెప్పి, ప్రజా సమస్యలపై తిరుగుతూనే, వాటికి సినిమా టైటిళ్లలా శీర్షికలు పెట్టే పనికి స్వస్తి చెప్పమని.