ఇలా అంటే ఇదేదో కిట్టని మాటగా, 'పచ్చ'ని పొత్తులో చిచ్చు మాదిరిగా అనిపిస్తుంది..పసలేని ఊహాగానాలు అనుకుంటారు..కానీ ఏ బాబు పెట్టుకున్న ఏ పొత్తు చూసినా ఏమున్నది..చివరంటా సాగిన వైనాలు మచ్చుకైనా కనిపించవు. వామపక్షాలు, భాజపా, తెరాస అన్నీ బాబుతో పొత్తుపెట్టుకున్నవే..చిత్తయి వెనక్కు పోయినవే. పైగా వామపక్షాలు, భాజపా కూడా బాబు అవినీతిపై పుస్తకాలు ప్రచురించినవే. తెరాస అయితే ఇప్పుడు బాబు మాటెత్తితే నిప్పులు చెరుగుతుంది. ఇప్పటికే తేదేపాతో పొత్తువల్లే తెలంగాణలో చిత్తయ్యామని భాజపా బహిరంగంగా గొంతెత్తింది. అదేంటి..అలా అని గట్టిగా అనరాదు.,వేరొకరు వినరాదు అని భాజపా అధిష్టానం ఏమీ అనలేదు కాక అనలేదు. అంటే భవిష్యత్ లో తెలంగాణలో భాజపా-తేదేపా బంధం వుంటుందా, ఊడుతుందా అన్నది అనుమానం. ఇక నవ్యాంధ్ర ప్రదేశ్ లో సంగతేమిటి? మోడీతో ఇప్పటికిప్పుడు బంధం తెంచుకునే ఉద్దేశం అయితే బాబుకు ఏ కోశానా లేదు. అందుకే ఎవరు అడగకుండానే, భాజపా నుంచి ఏ ప్రతిపాదన లేకుండానే, తన మంత్రివర్గంలో భాజపా ఎమ్మెల్యేలకు చోటిచ్చారు. ఆ విధంగా తమ బంధానికి మరింత ఫెవికాల్ పూసే ప్రయత్నం చేసారు. అయినా కూడా ఈ మొరమొచ్చు వ్యవహారాలకు మోడీ ఏమంత పడిపోయే రకం కాదని, బాబు ఇప్పటికే ఇరకాటంలో వున్నారని, ఫైకి ఏమీ మాట్లాడలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. నిజానికి భాజపాతో కటీఫ్ అంటే బాబుకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం లేదు. అయిదేళ్ల తరువాత సంగతి. ఎవరు ఎవరికి ఏమవుతారో అప్పుడు చూసుకోవచ్చు అని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే బాబు ముందు పెనుసవాళ్లు వున్నాయి. వాటిని గట్టెక్కాలంటే మాత్రం మోడీ అండా దండా ఈ అయిదేళ్లు కావాలి. కానీ అదే అంత సులవుగా లభిస్తున్నట్లు, లేదా లభిస్తుందని ఆశించడానికి పెద్దగా ఏమీ కనిపించడం లేదు.
వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, రైల్వే లాంటి శాఖలు అడిగితే కాదని రాష్ట్రాభివృద్ధికి పెద్దగా సహకరించని విమానాల శాఖ ఇవ్వడంమేమిటి? సహాయ మంత్రులు ఇద్దరు వుంటారనుకుంటే, తూచ్…అవసరం లేదని పక్కన పెట్టేయడమేమిటి? రుణమాఫీపై ఆర్బీఐ అంత వెంటనే ఎందుకు లేఖ రాసింది. పోనీ బాబు కేంద్ర ఆర్థిక, వ్యవసాయ మంత్రులను వదిలేసి కేవలం ఆర్బీఐ దృష్టికి రైతుల కష్టాలు తేవడమేమిటి? బాబు కరెంటు ఒప్పందాలపై ఇలా నిర్ణయం తీసుకుంటే, తెలంగాణ కోరకుండానే, కేంద్రం జోక్యం చేసకుని కుదరదు పొమ్మనడమేమిటి? ఆఖరికి గుంటూరు-విజయవాడ అని వెంకయ్య నాయకుడు, చంద్రబాబు నాయకుడు తెగ ప్రకటనలు గుప్పిస్తుంటే, కేంద్రం కనిపించని బ్రేకు ఎందుకు వేసింది? ఇప్పుడు వున్నట్లుంది వెంకయ్య నోట విజయవాడ-గుంటూరు పాట ఎందుకు ఆగింది? ఇలాంటి సవాలక్ష అనుమానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు
నిజమే..నిప్పు లేనిదే పొగరాదు. కానీ సినిమాలు, రాజకీయాల్లో విషయం వున్నా లేకున్నా పగలు..పొగలు తప్పవు. చంద్రబాబు తన తెలివితో, మోడీ ప్రభంజనాన్ని ముందే పసిగట్టి, పట్టుబట్టి, పొత్తు పెట్టుకుని, అధికారాన్ని పట్టుకోగలిగాడు. అంతవరకు బాగానే వుంది. కానీ బాబు మోడీని సరిగ్గా అంచనా వేసారో లేదో, తెలిసినా, చూద్దాంలే అనుకున్నారో మరి. నిజానికి మోడీ టార్గెట్ వేరు. అన్ని రాష్ట్రాల్లో తన బలం అంటూ ఒకటి వుండాలి. అది అంతకంతకూ బలపడాలి. ఈ పొత్తులపై ఎన్నాళ్లు ఆధారపడి వుంటామనేది ఆయన లెక్క. అందుకే పవన్ ను చేరదీసాడు. ఎన్నికల అనంతరం కూడా మరిచిపోకుండా గుర్తు పెట్టకున్నారు. మరి అవసరార్థం పాదసేవ అనేది బాబు టైపు.
కేబినెట్ బోణీ
కానీ ఇద్దరికి తొలి ఢీ..మంత్రివర్గం దగ్గర తగిలింది. ఓ కేబినెట్, రెండు సహాయ పదవులు వస్తాయనో,లాగుదామనో అనుకున్నారు. కానీ మోడీ దానికి ససేమిరా అనిపించేసారు..రాజనాథ్ తో. సరిపెట్టుకోక తప్పలేదు. పోనీ ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో అన్నది తాను డిసైడ్ చేస్తాననుకుంటే, ప్రోబబుల్స్ జాబితా ఇమ్మని మోడీ అడిగారని టాక్. అందులోంచి తన ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం సేకరించి, అన్నివిధాలా అనువైన వారిని మోడీ ఎంచుకున్నారని వదంతి. అలా సుజనకొ, గరికపాటికో రావాల్సిన పదవి రాకుండా పోయింది.
రుణానుబంధం లేదా?
సరే ఇక్కడకు ఇది అయిపోయింది. రుణమాఫీ అన్నది బాబు గుండెలపై కుంపటి. మోడీ తలుచుకుంటే దాన్ని దింపడమో, చల్లార్చడమో పెద్ద కష్టం కాదు. కానీ ఆయన చూస్తే, బాబు గుండెలపై ఆ కుంపటి వున్న స్పహే వున్నట్లు కనిపించడం లేదు. కేంద్రం ఈ విషయంలో కిమ్మనడం లేదు. నిజానికి బాబు చెబుతున్న కారణాలు అన్నీ కేంద్రానికి చెబితే, సాయం చేయాల్సిన బాధ్యత దానిదే. ఎందుకంటే, రిజర్వు బ్యాంకు కు రాసిన లేఖలో ఏకరవు పెట్టిన కారణాలు అలాంటివి. పంటలు పండకపోవడం, రైతులు ఆత్మహత్యలు.. ఇట్లాంటివి అన్నీ కేంద్రానికి చెప్పి, సాయం పొందడానికి అర్హమైనవే. కానీ బాబు మరి ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు. అంటే అడిగి లేదనిపించుకోవాలనా? లేక మీ హామీ మేము నెరవేర్చితే, మీరు క్రెడిట్ కొట్టేస్తారా అన్న ఆలోచన భాజపా చేస్తుందనా? ఇదిలా వుంటే, అసలు ఈ రుణ మాఫీ మీద కోటయ్య కమిటీ అని, మరోటి అని బాబు తన ప్రయత్నాలు తాను చేస్తుంటే, తగుదునమ్మా అని రిజర్వు బ్యాంకు ఎందుకు అర్జెంటుగా లేఖ రాసింది? విషయం అంతవరకు వెళ్లలేదు కదా? బ్యాంకర్లతో ఒకటి రెండు సమావేశాలు మాత్రం జరిగాయి. అప్పుడు కూడా బేసిక్ డేటా సమీకరణ తప్ప, నిర్ణయం అన్నది లేదు. ఆర్భీఐ కి కూడా ప్రభుత్వం రుణమాఫీపై లేఖ రాసినట్లు ఎక్కడా వినిపించలేదు. మరి ఆదికి ముందే, తనంతట తాను ఆర్భీఐ ఎందకు కుండ బద్దలు కొట్టాల్సి వచ్చింది? దీని వెనుక ఎవరన్నా వున్నారా? అనుమానమే. సరే, దానికి బదులుగా బాబు ఆర్బీఐకి బదులు రాసారు..అనేకానేక కారణాలు ఏకరవు పెట్టారు. బాగానేవుంది. మరి ఆర్బీఐ ని ప్రభావితం చేయగలినగిన కేంద్ర ప్రభుత్వానికి కానీ, విత్తమంత్రికి కానీ కనీసం కాపీ అయినా పంపలేదేం? అంటే వారి జోక్యం అక్కరలేదు అనుకుంటున్నారా? లేదా ఫలితం వుండదనుకుంటున్నారా? మళ్లీ అనుమానమే. కేంద్రం ఈ వ్యవహారంలో వేలు పెడితే, రెండు రాష్ట్రాలకు కలిపి లక్ష కోట్ల మేరకు బ్యాంకులు, అదీ కేవలం రెండుచిన్న రాష్ట్రాల్లో మూలన పడేసుకోవాల్సి వుంటుంది. అసలే, కష్టమైనా, నష్టమైనా, నిష్టూరమైనా సరే, కఠిన నిర్ణయాలు తప్పవన్న వైఖరి మోడీది. అందుకే ఈ రుణమాఫీ తతంగాన్ని ఆయన చూసీ చూడనట్లు వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీలు ప్రజల్లో పలుచనయితే, భాజపాకు లాభమే కదా.
రాజధాని రగడ
ఇక రాజధాని రగడ వేరేలా వుంది. విభజన దగ్గర నుంచి, ఎన్నికల ముందు వరకు రాజధాని గురించి ఇటు వెంకయ్య నాయకుడు కానీ, చంద్రబాబు నాయకుడు కానీ పల్లెత్తు మాట అనలేదు. విజయవాడ, కృష్ణాజిల్లాల ఉద్ధరణకే తాము కంకణం కట్టుకున్నామని మాట మాత్రమైనా అనలేదు. ఇలా అధికారం అందిందో లేదో అలా ఈ కొత్త భజన ప్రారంభించారు. కానీ వున్నట్లుండి, ఏమయిందో ఇప్పుడు వెంకయ్య నాయకుడు ఆ మాట వదిలేసారు. అసలేమీ ఈ విషయమై మాట్లాడకుండా మౌనం వహించి, తెరవెనుక మాత్రం చక్రం తిప్పేపనిలో పడ్డారు. పైకిమాత్రం మహా డిప్లమాటిక్ గా, కమిటీ కలిసిందని, అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం వున్న చోటే రాజధాని పెడతామని అందని చెప్పారు. అంతేకానీ తాను విజయవాడ, గుంటూరు సూచించానని మాటమాత్రానికైనా అనలేదు. లోపల సూచించి, వుండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకిలా? అదో అనుమానం. అయితే అదృష్టం కొద్దీ సీమ వాదులు నోరు విప్పడం లేదు. కష్టాల్లో పడ్డవారు కష్టాల్లో వున్నారు. తేదేపా పంచన చేరినవారు అక్కడ కిక్కరుమనకుండావున్నారు.లేకుంటే కర్నూలులో ఎయిమ్స్ ఏర్పాటు అని ముందుగా చెప్పి, ఇప్పుడు దాన్ని తెలివిగా కృష్ణాజిల్లాకు తీసుకుపోయినా ఇంత మౌనంగా వుండివుండేవారు కాదు. ఇప్పుడు వెంకయ్య నాయకుడు కేంద్రంలో బయటకు మాట్లాడడం తగ్గించారు. తెరవెనుకే చక్రం తిప్పాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. దీని వెనుక కారణం మోడీ తప్ప మరేమీ కాకపోవచ్చు.
కరెంటు సమస్య
కరెంటు సమస్యకు పరిష్కారం బాబు బుర్రకు అమోఘంగా తోచింది. దాంతో గతకాలపు ఒప్పందాలు రద్దు అంటూ హడావుడి చేసారు. ఇలా హడావుడి ప్రారంభమైందో లేదో, తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇంకా మాటల తూటాలు విసురుతోందో లేదో, సెంట్రల్ జొక్యం చేసేసుకుంది. ఇలాంటి పప్పులు ఉడకవు పొమ్మంది. తెలంగాణ ప్రభుత్వం కోరకుండానే కేంద్రం అంత ఆగమేఘాల మీద ఎందుకు కలుగుచేసుకున్నట్లో? పోనీ అక్కడితో ఆగిందా. ఇఆర్సీ కూడా రెండు రాష్ట్రాలు కలిపి చెబితేనే ఒప్పందాలు రద్దు చేస్తాం అంది. ఒక ముఖ్యమంత్రి చెప్పిన తరువాత నో అనడమైనా, సంస్థలు ఆచి, తూచి వ్యవహరిస్తాయి. మెల్లగా చెప్పాల్సింది చెబుతాయి. కానీ ఇలా స్పీడ్ పోస్టులో రియాక్టు కావడం చూస్తుంటే..మళ్లీ అనుమానం.
రేపటి సంగతేమిటి?
రాష్ట్రంలో ఏవో కొన్ని పనులైతే చేయాలి. అందుకోసం బాబు ప్రభుత్వానికి మిగిలిన ఆప్షన్లు రుణాలు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితిలో ప్రపంచబ్యాంకు లాంటివి రుణాలివ్వడం అప్పుడే జరగదు. ఇక మిగిలింది, స్వరాష్ట్ర అప్పు. అంటే ప్రభుత్వం బాండ్లు విడుదల చేసి, వాటికి 10శాతం లాంటి మంచి వడ్డీ ఆశచూపి, అంటగట్టడం. సాధారణంగా వంద,వేయికోట్ల మేరకు ఇలాంటి బాండ్లు ప్రభుత్వాలు అప్పుడప్పుడు విడుదల చేయడం మామూలే. కానీ దీనికీ కేంద్రం అనుమతి అవసరం. కానీ ఇప్పుడు బాబు విడుదల చేయాల్సిన బాండ్ల విలువ మొత్తం లక్ష కోట్లకు పైగానే అని వినికిడి. మరి ఇంత మొత్తంలో బాండ్ల విడుదలకు కేంద్రం, లేదా కేంద్ర సంస్థలు ఓకె అంటాయా అన్నది చూడాలి. అక్కడా చుక్కెదురైతే..మళ్లీ అనుమానమే..
ఎంతో కాలం అక్కరలేదు..మో'ఢీ'నో..మో'దువ్వడమో' తేలిపోవడానికి.
-చాణక్య