బియాస్ నదిలో జరిగినది దుర్ఘటన. దానిలో ఆంధ్ర-తెలంగాణ గొడవేమిటి? అక్కణ్నుంచి తిరిగి వచ్చిన నాయిని నర్సింహారెడ్డి ‘అక్కడకు ఆంధ్రా మినిస్టర్లు వచ్చి హంగు చేశారు. వాళ్లేకం పని? కాలేజీ తెలంగాణలో వుంది, చనిపోయిన విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు. ఆంధ్రోళ్లు ఎందుకు రావాలి?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రేపు భూకంపం వచ్చి పక్క రాష్ట్రాలవాళ్లు సహాయ కార్యక్రమాలకు వచ్చినా ‘ఇది తెలంగాణ భూమి, భూకంపం వచ్చినా, మానినా మాదే, మీరెందుకు వచ్చారు?’ అని అంటారా? సాటి తెలుగు వాళ్లు కదాన్న ఫీలింగుతో ఆంధ్ర మంత్రులు వచ్చి వుండవచ్చు. అది కూడా పెద్ద అంశంగా చూపాలా? మాటిమాటికీ ‘ఆంధ్ర’ పేరు చెప్పి రగడ చేయాలా? ఉద్యమంలో చేశారు సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడానా? ‘ఈ విద్యార్థులందరూ తెలంగాణ వారే’ అన్నారు నాయిని, ఆయన్ని ఆ మాట మీద వుండమనండి. ఫీజు రీఎంబర్స్‌మెంటు దగ్గరకు వచ్చేసరికి వారిలో కొందరు తెలంగాణవాళ్ళు కాదంటున్నారు. వారికి వీళ్లు రీఎంబర్స్ చేయరట. వాళ్లకి ఎవరివ్వాలి? వాళ్ల రాష్ట్రం వాళ్లా? వాళ్లు ఫీజంతా ఇస్తారో, మా రూల్సు ప్రకారం లిమిట్ ఇంతే అంటూ సగమే చేతిలో పెడతారో! ఆ పరిస్థితుల్లో యాజమాన్యం ఈ విద్యార్థుల హాల్‌టిక్కెట్లు ఆపుతుందా? అంతా గందరగోళంగా వుంది. ఇంతకీ తెలంగాణ విద్యార్థుల నిర్వచనం ఏమిటి? లోకల్ కోటాలో సెలక్టయినవారా? అంటే నాలుగేళ్లు వరుసగా ఇక్కడ చదివినవారనా లేక వేరే కొలబద్ద ఏమైనా వుందా? అదేదో తేలితే అన్నిచోట్లా అదే నిర్వచనం వాడాల్సి వస్తుంది. ఉద్యోగుల విషయంలో వేరేలా వాదిస్తే కుదరదు. ఫలానావాడు విద్యార్థిగా తెలంగాణ, ఉద్యోగిగా ఆంధ్ర.. అంటే నప్పదు.
వంతులు పోతున్నారు…
తెలంగాణ పునర్నిర్మాణానికి మాకు ఫలానా ఫలానా సౌకర్యాలు కావాలి అనడం ఒక పద్ధతి. అది కాకుండా ఆంధ్రకు ఏమిచ్చినా మాకు అది ఇచ్చి తీరాలి అని వంతులకు పోవడం హాస్యాస్పదం. మాకు విశ్వనగరం హైదరాబాదు వుంది, ఐటిఐఆర్ వుంది, మెట్రో వుంది, అంతర్జాతీయ విమానాశ్రయం వుంది, పరిశ్రమలు పెట్టడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వుంది అని కెసియార్ ఓ పక్కనుండి చెపుతూ మళ్లీ వీటన్నిటితో పాటు ఆంధ్రకిచ్చేవన్నీ కావాలి అంటే సమంజసంగా వుంటుందా? విడగొట్టినపుడు ఆంధ్రకు అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు. రాజధాని లేదు, హైదరాబాదు ఆదాయంలో వాటా లేదు, పరిశ్రమలు పెట్టడానికి తాడూ బొంగరమూ ఏమీ లేదు, లోటు బజెట్‌తో ప్రభుత్వం ఏర్పడుతోంది. పంపకాలు చేసేటప్పుడు ఆస్తులు తెలంగాణలో! వాటిపై అప్పుల్లో 5% ఆంధ్రకు! అర్థముందా? మామూలుగా ప్రజలకు ఇవన్నీ తెలిసేవి కాదు కానీ, విభజన బిల్లు గురించి విస్తృతంగా చర్చ జరగడంతో అన్నీ అందరికీ తెలిశాయి. విభజన తీరు బాగా లేదని తటస్థులు కూడా అనుకునే సందర్భం ఇది. నష్టపోయినవారికి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినట్లు, ఆంధ్రకు ఏవేవో హామీలు ఇస్తున్నారు. వాటిలో ఎన్ని కార్యరూపం ధరిస్తాయో ఎవరికీ తెలియదు. ప్రత్యేక హోదా కూడా ఇప్పటివరకు పక్కా కాలేదు. ఆంధ్రులు ఆశల ఊపిరితోనే జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లను రెచ్చగొట్టినట్లు ‘మీరు వాళ్లకు ఏం ఇచ్చినా మాకూ ఇవ్వాలి, ఇద్దరికీ ఇవ్వగలిగితేనే ఆ దిశగా ఆలోచించండి’ అంటే ఎలా? ఇద్దరు పిల్లలున్న తలిదండ్రులకు ఈ తిప్పలు తప్పవు. విసుగేసి, ఎవరికీ ఏమీ కొనకుండా కూర్చుంటారు వాళ్లు. తెలంగాణ మంచి పొజిషన్లో వున్నపుడు కూడా ఈ విధంగా జట్టీలకు దిగడం శోభ నివ్వదు.
మర్యాదలు పాటించకపోతే ఎలా?
ఉద్యమసమయంలో కెసియార్ మాట్లాడిన అవాచ్యాలకు హద్దే లేదు. అధికారంలోకి వచ్చాకైనా హుందాతనం ప్రదర్శించాలి. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జాతీయనాయకులు ఆంగ్లేయుల విధానాలను విమర్శించారు తప్ప వ్యక్తిగతంగా ఏమీ అనేవారు కారు. వారిలోవారికి స్నేహం కూడా వుండేది. విదేశీ వస్త్రబహిష్కరణ పిలుపు నిస్తూ గాంధీ దాని వలన ఇంగ్లండ్‌లో నేత పనివారికి కలిగే నష్టం గురించి విచారించారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా మనదేశం కామన్వెల్త్లో సభ్యత్వం తీసుకుంది. వారితో పోల్చి చూస్తే కెసియార్ ప్రవర్తన ఎంత విడ్డూరంగా వుందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా హుందాతనం చూపటం లేదు. టిడిపిలో వుండగా తన సీనియర్ కొలీగ్, పొరుగు రాష్ట్రాధినేత అయిన చంద్రబాబును ప్రమాణస్వీకారానికి పిలవలేదు. ఏం అంటే ‘అటెండరు దొరకలేదు’ అని సమాధానం. అంటే చంద్రబాబు స్థాయి అదే అని చెప్పాలనా? ఇలా అన్నా బాబు హుందా కనబరచి ఈయని ఆహ్వానిస్తే ఈయన వెళ్లలేదు. దేశంలోని ఇతర రాష్ట్రాల నాయకులకు ఈ విషయాలు తెలిసినపుడు ఏమనుకుంటారు? బాబుకున్నంత విజ్ఞత, స్టేట్స్‌మన్‌షిప్ కెసియార్‌కు లేదనుకోరా?
మెట్రోపై పేచీలో తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోణం
మెట్రో విషయంలో కెసియార్ ఎల్అండ్టితో తగవు వేసుకుంటున్నారు. అసెంబ్లీ, సుల్తాన్ బజార్ వంటి చారిత్రక కట్టడాలకు విఘాతం కలుగుతుంది కాబట్టి మెట్రోను అడ్డుకుంటామని విపక్షంలో ఉండగా గొడవ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, మెట్రో నిర్మాణం చురుగ్గా సాగిపోతున్న దశలో తగ్గాలి. అబ్బే, ఆ ప్రాంతాల్లో చోట్ల అండర్ గ్రౌండ్లో కట్టాల్సిందే, ఇప్పటిదాకా కట్టిన స్తంభాలు కూల్చాల్సిందే అని పేచీ పెడుతున్నారు. చారిత్రక కట్టడం అనేదానికి కొలబద్ద ఉండద్దా? అయినా వాటిని మెట్రోవాళ్లు కూల్చడం లేదు కదా! పక్కనుంచి వెళుతున్నారు. ఇప్పటిదాకా కట్టినది కూల్చేయడం, అండర్ గ్రౌండ్లో మళ్లీ కట్టడం అంటే ఎంత ధనం, సమయం వృథా? ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? కంపెనీ భరించాలా? లేక కెసియార్ ప్రజాధనం ఇస్తారా? అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా డిజైన్లు మారుస్తామంటే ఎవరైనా కాంట్రాక్టు తీసుకుంటారా? చివరకు కెసియార్‌కు ఎవరైనా నచ్చచెప్పి ఊరుకోబెట్టినా ప్రజలే మనుకుంటారు? ఎల్‌అండ్‌టి వారు మేనేజ్ చేశారు అనుకుంటారు. కెసియార్ ఇమేజి దెబ్బతింటుంది. తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తాం అంటున్నారు. మెట్రో వ్యవహారం చూశాక వాళ్లు వస్తారా? కొత్త పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ బేరాలాడుకోవాలేమో అని భయపడరా? ఇదంతా ఒక ఎత్తయితే ఈ వివాదంలోకి ఆంధ్రను ఈడ్చి ‘ఆంధ్ర నాయకులు తెలంగాణ సంస్కృతిని నాశనం చేశారు, మేం కాపాడతాం’ అంటూ దానికి కల్చరల్ కలర్ ఒకటి ఇవ్వడం మరీ వింతగా వుంది.
ఆంధ్రలో జరుగుతున్నది ఏమీ లేకపోయినా, మీడియా పుణ్యమాని హంగామా మాత్రం బాగా జరుగుతోంది. మెట్రో వచ్చేస్తోంది, సూపర్ కాపిటల్ వచ్చేస్తోంది అంటూ… తెలంగాణలో డబ్బున్నవాళ్లు అక్కడ రియల్ ఎస్టేటులో పెట్టుబడి పెడుతున్నారు. హైదరాబాదులో రియల్ ఎస్టేటు స్తంభించింది. దాంతో కొందరు బెంగుళూరులో, మరి కొందరు మైసూరులో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కణ్నుంచి కాపిటల్ వెళ్లిపోతే నిర్మాణరంగం దెబ్బ తింటుంది. ఆ మేరకు నిరుద్యోగులు పెరుగుతారు. అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడి పెట్టే శాంతియుత వాతావరణం కల్పించారు. ఘర్షణ వుంటే ఎవరు ముందుకు వస్తారు?
మీడియా వివాదంలోనూ ఆంధ్రను వదలలేదు
ఇవి చాలనట్లు మీడియాతో కూడా కెసియార్ పేచీ పెట్టుకున్నారు. నిజానికి టీవీల్లో వచ్చే కొన్ని కార్యక్రమాలు రోత పుట్టిస్తాయి. ఒక కార్టూన్ ఫిగర్ వచ్చి చిత్తం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తూ వుంటుంది. ఎంతోమంది అనుచరులన్న నాయకుణ్ని పట్టుకుని ‘రేయ్’ అంటుంది. చాల్లే కూర్చో అంటుంది. మాటమాటకీ వెక్కిరిస్తుంది. మరో కార్యక్రమంలో నాయకుల మాస్కులు పెట్టుకుని కొందరు డాన్సులు చేస్తారు, తమలో తాము సర్కస్ బఫూన్లలా కొట్టుకుంటారు. నిజానికి అన్ని పార్టీల నాయకులు కలిసి ఈ కార్యక్రమాలను నియంత్రించాలి. సంస్కారయుతంగా కార్యక్రమాలు నడపాలని సూచించాలి. అయితే ‘మీరు సంస్కారయుతంగా మాట్లాడితే మేమూ అలా వుంటాం’ అని మీడియా అంటే వీళ్లకు చిక్కు. అనేకమంది నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. హరీశ్‌రావు సబ్ ఇన్స్పెక్టరుపై బూతులు కురిపించినది కూడా టీవీల్లో వచ్చేసింది. బహిరంగ ప్రదేశాల్లో సభ్యంగా ప్రవర్తించడం నాయకులు నేర్చుకోవాలి. గతంలో కెసియార్ అసభ్యకరమైన భాష ఉపయోగించి ‘ఇది తెలంగాణ భాష’ అని దబాయించేవారు. ఇప్పుడు అది కుదరదు. చుట్టూ అందరూ తెలంగాణవారే. అందరూ ఆయనపై అదే భాష ప్రయోగించగలరు.
టీవీ9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను కేబుల్ ఆపరేటర్స్ సంఘం చేత నిషేధింపచేసినా, దాని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. మీడియాతో గొడవ పెట్టుకోవడం సరే, దానికి ఆంధ్ర ముద్ర వేయడం లేనిపోని వివాదానికి దారి తీసినట్లే కదా. ఆ ఛానెల్స్ తెలంగాణ యాసను, సంస్కృతిని కించపరిచాయని సంఘం వాళ్లు కనిపెట్టారు. ఆ కార్యక్రమాలేవిటో చెప్పి, వాటిని తొలగించమని అడగడం కాకుండా, మొత్తం ప్రసారాలను నిషేధించేశారు. సినిమాలపై కూడా గతంలో ఇలాంటి ఆరోపణలే చేశారు. వాటినీ నిషేధిస్తారా? తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోసిన ఆంధ్రజ్యోతికి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి రావడం విడ్డూరంగా వుంది. తను తెలంగాణవాణ్నని రాధాకృష్ణగారు అనుకోగానే సరిపోలేదు, ఇప్పుడు ‘ఆంధ్ర’ మచ్చ పడింది. ఎవరు తెలంగాణ? ఎవరు ఆంధ్ర? అనేది తేల్చకుండానే పుష్కరం పాటు ఉద్యమం నడిపారు. తెలంగాణ వచ్చేశాక అధికారపార్టీకి నచ్చనివారందరూ ఆంధ్రులే అని తేలుస్తున్నారు. వైఎస్ ఎంతసేపూ ‘ఆ రెండు పత్రికలూ’ అంటూ సరిపెట్టారు కానీ కెసియార్ రెండు టీవీ ఛానెల్స్‌ను ఏకంగా నిషేధింపచేశారు. ఇది తెలంగాణలోని యావత్ మీడియాకు హెచ్చరిక లాంటిది. ఇది జాతీయ మీడియా హర్షించదు. మీడియా అంతా ఒకటే జాతి. తాము ఎవరినైనా ఏమైనా అనవచ్చు. తమని మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. ఇక వాళ్లు తెలంగాణ ప్రభుత్వంపై పగబట్టి వ్యతిరేక కథనాలు ప్రచురించడం ఖాయం. తనకు నచ్చని, తమ ఛానెల్స్‌కు, పత్రికకు పోటీగా వున్న మీడియాపై ‘ఆంధ్ర’ ముద్ర కొట్టి యాగీ చేయడం కూడా జాతీయ స్థాయి పాత్రికేయులు తప్పుపడతారు.
అంతశ్శత్రువులను తయారుచేసుకున్నట్లే
‘ఆంధ్రుల్ని ఎంత తిట్టినా మననేం చేయగలరు’ అనుకోకూడదు కెసియార్. వాళ్లు ఎక్కడో పరదేశంలో లేరు, ఆయన ప్రజల్లో నాల్గవవంతు మంది ఆంధ్రులో, ఆంధ్రమూలాలు వున్నవాళ్లో. ఆంధ్రులతో చుట్టరికాలు కలుపుకున్నవారో, వ్యాపారవాణిజ్యబంధాలు ఉన్నవాళ్లో, ఆంధ్రయో, తెలంగాణయో నిర్వచనానికి దొరకని వాళ్లో వున్నారు. ఆయన ప్రభుత్వంలో, తెలంగాణలోని ఇతర ప్రయివేటు సంస్థల్లో కీలకస్థానాల్లో కూడా ఇలాంటివాళ్లు వున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం హిందువులను ఎలా హింసించినా చెల్లిపోతుంది, అక్కడ వాళ్లు సంఖ్యాపరంగా చాలా తక్కువ కాబట్టి! భారతప్రభుత్వం ముస్లిములతో జాగ్రత్తగా వ్యవహరించవలసి వస్తుంది. వాళ్లు అనేక నియోజకవర్గాల ఫలితాలను తారుమారు చేయగలరు కాబట్టి! ఇదే సూత్రం ఆంధ్ర, తెలంగాణలకు వర్తిస్తుంది. ఆంధ్రలో తెలంగాణవారి సంఖ్య బహు తక్కువ. తెలంగాణలో ఆంధ్రులను రెచ్చగొడితే ఇంట్లోనే శత్రువులుగా మారి ఎసరు పెట్టగలరు. సమయం చూసి కీలెరిగి వాత పెట్టగలరు. ఇకనైనా ఈ నినాదాలు మాని అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిది.
– ఎమ్బీయస్ ప్రసాద్