బాబు తూణీరంలోంచి మరికొన్ని బాణాలు

నిజంగా ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించదు…వ్యవహరించకూడదు. నవ్యాంధ్ర రాజధాని భూముల వ్యవహారం గురించే ఇదంతా. ఒక్కసారి ఈ రాజధాని నిర్ణయం దగ్గర నుంచి, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను రివైండ్ చేసుకుని చూడండి..ఎంత గోప్యత..ఎంతటి…

నిజంగా ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించదు…వ్యవహరించకూడదు. నవ్యాంధ్ర రాజధాని భూముల వ్యవహారం గురించే ఇదంతా. ఒక్కసారి ఈ రాజధాని నిర్ణయం దగ్గర నుంచి, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను రివైండ్ చేసుకుని చూడండి..ఎంత గోప్యత..ఎంతటి దాపరికం..ఎంతటి చాణక్యం. అవసరమా ఇదంతా? 

ఇదేమీ ప్రయివేటు వ్యవహారం కాదు..వ్యక్తిగత వ్యవహారం కూడా కాదు. ఇలా వ్యవహరించడానికి. ప్రభుత్వం ఏమీ ఆలోచిస్తోందో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం వుంది. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ రాజ రహస్యాలు అన్నవి చాలా తక్కువ వుంటాయి. సమాచార హక్కు యుగం నడుస్తోంది ఇప్పుడు. అలాంటపుడు అసలు రాజధాని ఎక్కడన్నది స్పష్టంగా చెప్పడానికే నెలలు పట్టింది. ఇప్పుడు ఆ రాజధాని భూ సేకరణ వ్యవహారం కూడా అలాగే వుంది. 

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతా తెలుసు. ఆయన మదిలో మొత్తం బ్లూప్రింట్ వుంది. కానీ ఒక్కొక్కటిగా మెలమెల్లగా బయటకు తీస్తున్నారు.. ఇప్పుడు రాజధాని సరిహద్దులు, భూసేకరణకు ఇవ్వదలిచిన పరిహారం వరకు బయటకు వచ్చాయి.

తాజాగా ఈ రోజు మరి కొన్ని బయటకు వచ్చాయి. అందులో ఒకటి ఈ రాజధాని నిర్మాణం కోసం ఓ ప్రత్యేక అధారిటీ ఏర్పాటు చేయడం. ఇదిలా వుంటే దీని విధి విధానాలు,నిబంధనలు ఇంకా తెలియాల్సి వుంది. దానికి అంటూ ఓ బైలా వుంటుంది కదా.

అది అలా వుంచితే రైతులకు ఇవ్వదలచిన ప్యాకేజీలో ఈ రోజు మరో అంశం చేరింది. ఇది భూముల ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశం ఇవ్వడం. ఇది చిన్న విషయం కాదు. చాలా కీలకమైనది. అంటే  భూములు కోల్పోయిన వారికి ఆర్ కార్డులు ఇవ్వడం అన్నమాట. రీహాబిలిటేషన్ కార్డులు ఇస్తారనుకోవాలి? ఇదేదో ముందే చెబితే ఇప్పుడు ఆందోళన చెందుతున్న రైతుల్లో చాలా మంది వెనక్కు తగ్గేవారేమో కదా..అలా చెప్పలేదు. అలాగని ఇప్పడూ స్పష్టంగా చెప్పడం లేదు.

ఎందుకంటే ఇప్పుడు కడుతున్నది ప్యాక్టరీ కాదు..రాజధాని.మరి ఈ ఉపాధి ఎక్కడి నుంచి వస్తుందన్న అనుమానం వుండనే వుంది. అందుకే బాబు తన మదిలోని మరో మాట బయటకు తీసారు. కేంద్రం మంజూరు చేసేవి ముందుగా రాజధాని పరిథిలోనే నిర్మిస్తాం అని. అంటే ఇన్నాళ్లు వికేంద్రీకరణ, మిగిలిన ప్రాంతాలకు కూడా ప్రాధాన్యం అన్నది ఏమని అనుకోవాలి? అంతే కాదు, రాజధానిలో పారిశ్రామిక వ్యవహారం వుండదని ముందు అన్నారు. ఇప్పుడు వుంటాయి అంటున్నారు. 

అప్పుడు ఈ ముఫై వేల ఎకరాలు ఏ మూలకు? అంటే అందరూ అనుమానపడుతున్నట్లు లక్ష ఎకరాలు సేకరిస్తారని అనుకోవాలా?  సరే ఎంత భూమి ఇస్తే ఉపాధి ఇస్తారు? ఎకరాకు, పది ఎకరాలకు ఒకటేనా? ఎన్నాళ్లలోగా ఉపాధి కల్పిస్తారు? ఇంకా అనేకానేక ప్రశ్నలు ప్రశ్నలుగానే వున్నాయి.

ఇక్కడ అర్థంకాని విషయం ఒక్కటే, హడావుడిగా విభజించారని కాంగ్రెస్ ను ఆడిపోసుకుంటున్న బాబు, తను మాత్రం ఎందుకు అన్నీసవివరంగా ఆలోచించి, సమగ్రమైన ప్రణాళిక రచించి, దాన్ని బయటపెట్టి, అప్పుడు రైతుల దగ్గరకు వెళ్లకూడదు. ఎందుకీ గోప్యం? ఇప్పుడు రైతుల మదిలో ఇవే ఆలోచనలు, ఆలస్యం చేసి, ప్రతిఘటించిన కొద్దీ ఇంకా ఎన్ని మదిలో మాటలు బయటకు వస్తాయో అని? బాబు మదిలోని మొత్తం ప్రణాళిక బయటకు రావడానికి ఇంకెన్ని రోజుల పడుతుందో?