కామెడీలేని టాలీవుడ్ సినిమాను ఊహించుకోం లేం. ఇప్పుడు ఫ్యామిలీ, థ్రిల్లర్ ,యాక్షన్, ఇలా జోనర్ ఏదైనా దాని పక్కనే కామెడీ ఎంటర్ టైనర్ అని జోడించుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో కామెడీ ట్రాక్ లు సెపరేట్ గా రాసి వాటిని మెయిన్ సినిమాకు జోడించేవారు. చాలా సినిమాల కథల్లో ముందుగానే రేలంగి, రమణారెడ్డి, చలం, పద్మనాభం, రాజబాబు ఇలా కమెడియన్లకు పాత్రలు తయారుచేసేవారు. రాజకు పక్కన విదూషకుడిలా హీరో పక్కన కమెడియన్ లేకుండా సినిమా లేదు. అప్పలాచార్య వంటి వారు కామెడీ ట్రాక్ లు ప్రత్యేకంగా రాసేవారు. అయితే జంధ్యాల, ఇవివి వచ్చిన తరువాత కామెడీ సినిమాలకు పెద్ద పీట అన్నది ప్రారంభమైంది. శ్రీనువైట్ల ఫార్ములాతో అది సినిమాలో కామెడీ స్టయిల్ నే మార్చేసింది. ఎంత పెద్ద హీరో అయినా కామెడీ చేయాల్సిందే.
అయితే ఇది ఆదిగా తెలుగు సినిమాలో కమెడియన్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఒకప్పుడు హీరోల మాదిరిగా ఎవరో ఒకరిద్దరికే మాంచి డిమాండ్ వుండేది. అది రేలంగి తరం నుంచి బ్రహ్మానందం వరకు. బ్రహ్మానందానికి వచ్చిన స్టార్ స్టాటస్ ఇటీవల ఎవరికీ రాలేదు. స్టార్ స్టాటస్ అక్కరలేదు కానీ అవకాశాలు కావాలి. కానీ ఇప్పుడు కమెడియన్లు లెక్కకు మించి వున్నారు. ఇవివి బతికి వున్నన్నాళ్లు కమెడియన్లకు కావాల్సినన్ని అవకాశాలు. ఎంత మంది కమెడియన్లు వుండేవారో అందిరికీ ఆయన సినిమాలో అవకాశాలు వుండేవి.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా అంటే బ్రహ్మానందం మస్ట్. ఆపై ఎమ్ ఎస్ నారాయణ. మహా అయితే వెన్నెల కిషోర్ మాదిరిగా ఇంకొకరు. అంతే. కానీ ఇప్పుడు కమెడియన్లు ఎంతమంది వున్నారో లెక్క తీస్తే జనం గుర్తుపట్టగలిగేవారు కనీసం రెండు డజన్ల మంది వుంటారు. వీరందరికీ అవకాశాలు అంతంత మాత్రంగా వున్నాయి. ఇప్పుడు సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృధ్వీ, పోసాని తదితరుల టైమ్ బాగుంది. మిగిలిన వారందరికీ అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయి.
ఇలాంటి సమయంలో మరో పక్క కొత్త కొత్త కుర్రాళ్లు తెరపైకి వస్తున్నారు. టీవీ షో ల పుణ్యమా అని కొత్త టాలెంట్ వెలికి వస్తోంది. వాళ్లూ మేమూ కాంపిటీషన్ లో వున్నాం అంటున్నారు. దీంతో పెరుగుతున్న పోటీ చూసి పైకి కొత్త బ్లడ్ రావాలి అంటూనే లో లోపల బాధ పడే పరిస్థితి. అప్పుడప్పుడు అది కమెడియన్ల మాటల్లో బయటపడుతూనే వుంటుంది. ఇలాంటి కొత్త కొత్త కమెడియన్లు పండుగ వేళల్లో వేసే స్పెషల్ బస్సుల లాంటివాళ్లని, బ్రహ్మానందం లాంటి సీనియర్లు రెగ్యులర్ బస్సులని పృధ్యీ అననే అన్నాడు. పైగా జబర్దస్థ్ కామెడీ షోల్లో వేసే నటులు కొందరు సీనియర్లకు సరైన గౌరవం ఇవ్వడం లేదని పరోక్ష సెటైర్లు వేసారు. అందుకే ఇప్పుడు ఆలీ తెగ టీవీ షోలు చేసుకుంటూ బిజీగా వున్నాడు. పృధ్వీ కూడా ఒకటీ అరా షోలు చేస్తున్నారు. కానీ అందరికీ ఆ అవకాశం కూడా రాదు కదా.
మగ కమెడియన్ల సంగతి అలా వుంచితే లేడీ కమెడియన్లే లేకుండా చేసేసారు. రమాప్రభ, శ్రీలక్ష్మి కనిపించడం లేదు. హేమకు ఆ మధ్య బాగానే పాత్రలు వచ్చాయి. కానీ రాజకీయాల్లోకి వెళ్లాక తగ్గాయి. కోవైసరళ తెగ కనిపించేది. ఆమెను వదిలేసారు.
ఈ నేపథ్యంలో కమెడియన్లు అంతా చల్లగా బతకాలంటే, ఈవీవీ లాంటి దర్శకుడు మళ్లీ పుట్టాలి. కామెడీ కుటుంబం అంతటినీ తెరపైకి తేగలిగిన కథలు రావాలి. సినిమాలు రావాలి.
‘చిత్ర’గుప్త