దూకుడు పెంచిన మజ్లిస్

మజ్లిస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల అనంతరం కాస్త అటు ఇటుగా వున్న ఆ పార్టీ ఇప్పుడు జూలు విదిలించింది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్ఐఎన్ పక్ష నేత అక్బరుద్దీన్ తన దైన శైలిలో ప్రభుత్వంపై…

మజ్లిస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల అనంతరం కాస్త అటు ఇటుగా వున్న ఆ పార్టీ ఇప్పుడు జూలు విదిలించింది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్ఐఎన్ పక్ష నేత అక్బరుద్దీన్ తన దైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. లైట్ తీస్కుని, బుజ్జగిద్దామని తెరాస నేత హరీష్ రావు లాంటి వాళ్లు చేసిన ప్రయత్నాలు పలించడం లేదు. పైగా అవసరమైతే రాజీనామాకు రెడీ అంటూ సవాళ్లు విసిరేవరకు వెళ్లింది. 

ఏమిటిదంతా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి కెసిఆర్ వీలయినంతవరకు ఎమ్ఐఎమ్ ను దగ్గరకు తీసుకోవాలనే ప్రయత్నిస్తున్నారు. అలాగే ముస్లింలకు కూడా దగ్గర కావాలనే చూస్తున్నారు. అందుకోసం ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖను తన దగ్గరే వుంచుకున్నారు కూడా. మహమ్మద్ ఆలీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే కాకుండా, కీలకమైన రెవెన్యూ శాఖను అందించారు. ముస్లింలకు అనేక వరాలు ప్రకటించారు. మరి ఇంతలా చేస్తున్నా, మజ్లిస్ ఎందుకు కెసిఆర్ కు దన్నుగా నిలవడం లేదు. 

మొన్నటి వరకు కాంగ్రెస్ తో వున్న మజ్లిస్ ఇప్పుడు కూడా అలాగే వుండాలనుకుంటోందా? లేక అధికారంలో వున్న టీఆర్ఎస్ తో వుండాలనుకుంటోందా అన్న అనుమానం ఇన్నాళ్లు వుండేది. కానీ ఇప్పుడు ఈ దూకుడు చూసిన తరువాత టీఆర్ఎస్ కు దూరంగా వుండాలనే అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

ఎన్నికలే కారణమా?

ఎమ్ఐఎమ్ వ్యూహంలో మార్పుకు కారణం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలేనా? లేక ఇంకేమైనా వుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.కేవలం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం అయితే ఇంతలా రెచ్చిపోనక్కర లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చి మజ్లిస్ అవకాశాలను దెబ్బతీసేంత లేదు. ఎందుకంటే మజ్లిస్ సంప్రదాయ ఓట్లకు గాలంవేయడం, అందునా స్థానిక ఎన్నికల్లో ఢీకొనడం అంత సలువు కాదు. అదీకాక, ఇప్పట్లో కెసిఆర్ అసలు కార్పొరేషన్ ఎన్నికలకు దిగుతారన్న నమ్మకమూ లేదు. అందువల్ల కేవలం దీని కోసం ఇంత హడావుడి చేయనక్కర లేదు. 

లెవెల్ పెరుగుతోందా?

మజ్లిస్ తన లెవెల్ ను పెంచుకునే ఆలోచనలో వుందా అన్నది మరో అనుమానం. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సరైన పార్టీ అన్నది లేదు. నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీర్ వదిలి బయటకు రాలేకపోతోంది.  చిరకాలంగా జాతీయ స్థాయికి ఎదగాలని ఓవైసీ సోదరులకు కోరిక వుంది. అంతకు ముందు డెక్కన్ ఏరియాలో పర్యటించి, వివాదాస్పద ప్రసంగాలు చేసి, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఇటీవల మహరాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి, తొలిసారి అక్కడి అసెంబ్లీలో తమ పార్టీకి ప్రాతినిధ్యం సంపాదించారు. ఇక్కడ సంగతి ఎలా వున్నా, జాతీయ మీడియా మాత్రం మజ్లిస్, ఒవైసీ సోదరుల వ్యవహారాలపై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో మజ్లిస్ హీరో అయిపోయే పరిస్థితి లేదు కానీ, ముస్లిం వర్గానికి భవిష్యత్ ప్రతినిధిగా మారే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. 

అందువల్ల తాము ఇక మరీ స్థానిక ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటే లాభం లేదని ఒవైసీ సోదరులు ఆలోచిస్తూ వుండి వుండొచ్చు. అందుకోసం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని అనుకుంటే అనుకుని వుండొచ్చు. కాంగ్రెస్, తేదేపాలు మాత్రమే కాదు, తాము కూడా వున్నామని ప్రజలకు తెలియచెప్పి, ఓ మంచి పార్టీగా ముస్లింయేతర ప్రాంతాల ప్రజల మన్ననలు కూడా చూరగొనాలనే ప్రయత్నం చేస్తుండి వుండొచ్చు. 

పైగా ఇప్పుడు టీఆర్ఎస్ విఫలమైతే భాజపా తెలంగాణలో పాగా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతకన్నా ముందే తాము కూడా బలమైన పార్టీగా, ప్రజాపక్షం వహించే పార్టీగా పేరు తెచ్చుకుంటే, భాజపా విజయావకాశాలకు అడ్డం పడొచ్చు. 

ఇలా చాలా బహుళ ప్రయోజనాలు ఆశించి మజ్లిస్ పార్టీ తన దూకుడు పెంచిందని అనుకోవచ్చు.