ఈ క్షణంలో ఈ మాటలేమిటి వెంకయ్యా?

భారతీయ జనతా పార్టీకి సరిపడా మెజార్టీ రాకపోయినా, మోడీ అభ్యర్థిత్వం మాత్రం మారదు. Advertisement ఇవీ భాజపాలో మీడియా టైగర్ గా పేరు పొందిన వెంకయ్య నాయడు ఢిల్లీలో ఈ రోజు చెప్పిన మాటలు.…

భారతీయ జనతా పార్టీకి సరిపడా మెజార్టీ రాకపోయినా, మోడీ అభ్యర్థిత్వం మాత్రం మారదు.

ఇవీ భాజపాలో మీడియా టైగర్ గా పేరు పొందిన వెంకయ్య నాయడు ఢిల్లీలో ఈ రోజు చెప్పిన మాటలు. ఎన్నికలు పైనల్ ఫేజ్ కు వచ్చిన తరుణంలో భాజపాకు ఎందుకు ఈ అనుమానం వచ్చిందన్నది పెద్ద ప్రశ్న. 275 స్థానాల వరకు వివిధ మీడియా సంస్థలు మోడీకి వస్తాయిని అంచనా వేసాయి. అయితే మోడీ గడచిన రెండు మూడేళ్లుగా చేస్తున్న మీడియా మేనేజ్ మెంట్ ఇంతా అంతా కాదు. ఆఖరికి అది ఫలించి ఇప్పటికి జనంలోకి మోడీ పేరు చేరింది. జనంలో మోడీ ఫీవర్ కనిపించింది. అంత మాత్రం చేత భాజపాకు సీట్లు వస్తాయన్న నమ్మకం అటు మోడీకి కూడా లేదు. హైదరాబాద్ సభకు వచ్చినపుడే మోడీ చెప్పేసారు తన పేరు ఒక్కటే సీట్లు తెచ్చి పెట్టదని, నాయకులు కూడా కృషి చేయాలని. 

కానీ భాజపాకు నాయకులు ఎక్కడ? ఆంధ్ర ప్రదేశ్ లాంటి చోట్లు వెంకయ్య నాయుడు లాంటి వాళ్ల పుణ్యమా అని తమకు కావాల్సిన తమ వారిని తప్ప మిగిలిన వారందరికీ ఎప్పుడో పొగ పెట్టేసారు. భాజపాను కూడా తెలుగుదేశం పార్టీ మాదిరిగా తన సామాజికవర్గానికి అండగా నిలిచే మరో పార్టీగా చేయాలన్న ఆయన ప్రణాళిక, సంప్రదాయబద్ధంగా ఆరెస్సెస్, విహెచ్ పి వంటి సంస్థల సభ్యులను భాజపాకు దూరం చేసాయన్నిది వాస్తవం. 

ఇప్పుడు తాజా ఎన్నికల్లో, ఇంత మోడీ చరిష్మా వుండి కూడా రెండు రాష్ట్రాల్లో కలిపి, భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీ ల సంఖ్య రెండంకెల స్థాయిని దాటుతుందా అంటే అనుమానమే. నిజానికి ఇది పార్టీ నిర్మాణానికి సరైన టైమ్. తెగించి, పార్టీలోకి నాయకులను తెచ్చి స్వతంత్రంగా పోటీ చేసి వుంటే, కనీసం వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి ఓ బలమైన కార్యకర్తల శ్రేణి ఏర్పడేది. కానీ ఎప్పటికప్పుడు తేదేపా పల్లకి మోయడంతోనే భాజపాకు సరిపోతోంది. ఆ కాడికి, ఆ పార్టీలో చేరడం ఎందుకని జనం దూరంగా వుంటున్నారు. ఇదే పరిస్థితి కాకున్నా, ఇంచు మించు సంస్థాగత బలం లేని పరిస్థితి అటు కేరళ, ఇటు తమిళనాట కూడా వుంది. మరి దక్షిణాది నాలుగు రాష్ట్రాలకు మూడింట సీట్లు రాకుంటే కేవలం ఉత్తరాదిపై ఆధారపడి ఎంతవరకు ఈదగలరన్నది అనుమానం. అందుకే అప్పడే జయలలితను ప్రసన్నం చేసుకోవడానికి భాజపా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. 

కానీ మాయావతి, నితీష్ కుమార్ లాంటి వాళ్లు మోడీ అంటే మండి పడుతున్నారు. రేపు బొటాబొటీ నెంబర్లు వస్తే, మోడీని కాకుంటే, తాము మద్దతు ఇస్తామంటే భాజపా అవకాశాన్ని వదులుకుంటుందా? మోడీని పక్కన పెట్టి అధికారాన్ని అందుకోవడానికి ఆరెస్సెస్ అడ్డం పడుతుందా. కాంగ్రెస్ ను దించి మరోసారి అధికారం చెపట్టే చారిత్రాతమ్మక అవకాశాన్ని ఒక్క మోడీ కోసం భాజపా వదులుకుంటుందా? ఈ సంగతి తెలిసీ వెంకయ్య ఈ ఆఖరు క్షణాల్లో ఇలా ఎందుకు మాట్లాడాలి? కాదు, మోడీకి సరిపడా మెజారిటీ మేం సాధిస్తాం అనాలి కానీ, మెజార్టీ రాకున్నా మోడీనే అభ్యర్థి అనడం వెనుక కావాలని, వైరి వర్గాలను రెచ్చగొట్టాలని వెంకయ్య చూస్తున్నట్లుంది. ఇప్పుడు మోడీ భజన చేస్తున్నా వెంకయ్య అద్వానీ శిష్యుడు అన్నది మరవడానికి లేదు. ఇక్కడ ఆ రాజకీయం ఏమైనా దాగి వుందేమో?

చాణక్య

[email protected]