ఎన్నికలు ముగిసాయి. అసలు సిసలు టెన్షన్లు మొదలయ్యాయి. ఎప్పుడూ లేనట్లు ఈ సారి ఏ పార్టీ కానీ, మీడియా కానీ ఇదీ ఫలితం అని కచ్చితంగా అంచనా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి రాష్ట్ర ప్రజల మనోగతం రకరకాలుగా మారింది. దాన్ని దశలవారీగా చూసుకుంటే,
విభజనకు ముందు చంద్రబాబు విజయానికి కిలోమీటర్ల దూరంలో వున్నారు.
విభజన తరువాత చంద్రబాబుకు అనుకూల పరిస్థితి ప్రారంభమైంది.
మోడీతో పొత్తు కుదిరాక కొత్త ఆశలు చిగురించాయి.
పవన్ కళ్యాణ్ తోడయ్యాక బాబుకు సింహాసనం అందేసినట్లు కలలు రావడం ప్రారంభమైంది.
ఎన్నికలకు వారం రోజుల ముందు మోడీ నోటితో జగన్ ను విమర్శింపచేయడంతో బాబు అనుకూల వాతావరణం ఏర్పడింది.
మరో పక్క జగన్ వ్యవహారం దశలు చిత్రంగా వున్నాయి. జైలు నుంచి వచ్చినదాదిగా ప్రచారం సాగించిన చివరి రోజు వరకు రొడ్డ కొట్టుడుగా ప్రచారం సాగించుకుంటూ వెళ్లడమే తప్ప, ఓ వ్యూహం, ఓ ప్రణాళిక, ఓ ఎత్తుగడ వున్నట్లు ఎక్కడా కనిపించలేదు. నిజానికి కులం, మతం కార్డులు వాడుకోవడానికి బాబు ప్రయత్నించినంతగా జగన్ ప్రయత్నించలేదు. ఇలా అంటే చర్చిల్లో మీటింగ్ లు పెట్టలేదా? పాస్టర్లతో పార్టీలు పెట్టలేదా అని ఎవరైన అడగొచ్చు. కానీ ఒక క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ వైకాపాకు ఓటు వేయమని చెప్పలేదు, జగన్ చెప్పించలేదు. కానీ బాబు ఇటు పాల్ చేత, కొందరు క్రిస్టియన్ లీడర్ల చేత, కొందరు ముస్లిం నాయకుల చెత తెలుగుదేశం లెటర్ హెడ్ పై ప్రకటనలిప్పించారు. క్రిస్టియన్ ఓటింగ్ లో చీలిక తేవాలని ప్రయత్నించారు. బిసిలకు, కాపులు ఉపముఖ్యమంత్రి అంటూ కులాలకు తాయిలాలు పెట్టారు. అప్పటికీ జగన్ ఏమీ మాట్లాడలేదు. ఇదో చిత్రమైన పరిస్థితి, దాని వెనుక జగన్ ధీమా ఏమిటో అతగాడికే తెలియాలి.
ఇలాంటి పరిస్థితుల్లో పోలింగ్ ముందురోజుకు, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో తెలుగుదేశం అనుకూల పవనాలు కనిపించాయి. కానీ చిత్రంగా…..పోలింగ్ నాటి సాయంత్రానికి బాబు మొహంలో ధీమా కనిపించలేదు తాము కచ్చితంగా గెలుస్తామని బల్లగుద్దిచెప్పలేకపోయారు. ఓడిపోతే చెప్పాల్సిన సాకుల కోసం రెండు వైపుల నుంచి జరిగిన దాడులను ఏకపక్షంగా చూపిస్తూ నానా హడావుడి చేయడం ప్రారంభించారు. కానీ మర్నాటికి మళ్లీ కాస్త ధీమా హెచ్చింది. నూటికి పదివేలశాతం తమదే అధికారం అన్నారు. వంద సీట్లు ఖాయం అన్నారు. మర్నాటికి ఆ సంఖ్య 110 అయింది. ఆపై 115 అయింది. ఇప్పుడు కొత్తగా 111 అనే సంఖ్య ఒకటి వచ్చింది. అయినా మరోపక్క వైకాపా రాష్ట్రాన్ని పులివెందులగా మార్చే ప్రయత్నం చేస్తోందన్న హడావుడి మాత్రం మానలేదు.
ఏం జరిగింది. ఏం జరుగుతోంది.
పోలింగ్ నాడు, ఆ మర్నాడు తెలుగుదేశం పార్టీ తన యంత్రాంగాన్ని అంతా మోహరించి లెక్కిస్తే 90 నుంచి 95 స్థానాలు వస్తాయని తేలినట్లు వినికిడి. అంటే అత్తెసరు మార్కలు అన్నమాట. అంటే జగన్ కు దగ్గర దగ్గర 80 స్థానాలు దేశం అంచనాలోనే రావాల్సి వుంది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఏ మాత్రం తేడా వచ్చినా 80 కి అయిదు కలిస్తే చాలా ప్రభుత్వం వాళ్లదైపోతుంది.
ఇక వైకాపా అంతర్గత అంచనాలు కాస్త భారీగా వున్నాయి. ఆ పార్టీ తమకు 115 వస్తాయిని లెక్కలు వేసుకుంటోంది. ఇది ఎంతవరకు నిజం అవుతుందన్న సంగతి పక్కన పెడితే, ఈ సారి ఎన్నికల్లో పట్టణ, గ్రామీణ అన్న తేడా లేకుండా, జగన్ కు ఓ ఓట్ బ్యాంక్ అన్నది వున్నట్లు స్పష్టం అవుతోందని తెలుస్తోంది. ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ లు, ఎస్ సి ల్లో మెజార్టీ ఓట్లు వైకాపాకు అనుకూలంగా పడినట్లు తెలుస్తోంది. ఈ ఓట్ల శాతం తక్కువేమీ కాదు. దీనికి వైకాపా అభిమానుల శాతం అదనం. అంటే దగ్గర దగ్గర పాతిక శాతమైన కచ్చితమైన ఓటింగ్ వైకాపాకు వుందని ఓట్ల లెక్కింపునాడు తేలే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి కులాల సంగ్రామం బాగా పెరిగింది. కాపుల ఓట్లు బాగా చీలిపోయాయని వినికిడి. ఆ చీలికలో కూడా కాస్త మొగ్గు తెలుగుదేశం వైపే వుందని, జగన్ కు కాపు, బిసి ఓట్లు ఓ మాదిరిగానే వచ్చాయని లెక్కలు కడుతున్నారు. నిజానికి జగన్ సీట్లు ఎక్కువగానే ఇచ్చినా, కాస్త పెద్ద కాపు నాయకులు తెలుగుదేశం పక్కన చేరడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఒక్క విశాఖ జిల్లాలో స్వల్ప సంఖ్యలో వున్న స్థానిక క్షత్రియులు మినహా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో వున్న క్షత్రియులు తొంభై శాతం తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసారు. ముఖ్యంగా క్షత్రియుల ప్రాబల్యం వున్న పశ్చిమగోదావరిలో వారు చంద్రబాబు గెలుపు తమ గెలుపు అన్నంతగా పనిచేసారని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. వైకాపాతో లేదా జగన్ తో మరి వారికి ఎందుకు తేడా వచ్చిందో తెలియదు కానీ, ఈసారి కాస్త గట్టిగానే తెలుగుదేశం కోసం పనిచేసారు. ఈ ప్రభావం విశాఖ నగరం, విజయనగరం ప్రాంతాలపై కూడా కనిపించింది. ఇక బిసి ఓట్లు కూడా ఈసారి తెలుగుదేశానికి కాస్త అనుకూలంగానే వున్నాయి. ఇక అగ్రకులాలైన కమ్మ సామాజిక వర్గం తేదేపా వైపు, రెడ్డి సామాజిక వర్గం వైకాపా వైపు నిల్చున్న సంగతి తెలిసిందే. మహా అయితే ఓ పదిశాతం మినహాయింపు వుంటుంది.
అంటే తేదేపా సంపాదించుకున్న బలం, ఇటు వైకాపా సమకూర్చుకన్న బలం పోటాపోటీగా వున్నట్లే. ఓటింగ్ రూరల్, అర్భన్ గా కూడా విడిపోయింది. రూరల్ లో హెచ్చు శాతం జగన్ కు అనుకూలమైతే, అర్బన్ లో దేశానికి అనుకూలమైంది. అయితే అక్కడ కూడా సంప్రదాయంగా పార్టీలకు దన్నుగా నిలిచే పాకెట్లు కొన్ని వుంటాయి.
ఇలాంటి పరిస్థితుల వల్ల ఇటుచూసినా, అటు చూసినా దాదాపు సమాన బలాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇక మిగిలిన ఆశ ఓట్ల చీలిక, వేరే పార్టీలు ఏవైనా ఒకటీ రెండు బరిలోవుంటే అవి చూపే ప్రభావం, ఎక్కడన్నా గట్టి స్వంతంత్ర అభ్యర్థులుంటే వారి పలుకుబడి ఇలాంటివి అన్నీ కలిసి, ఏదో ఒక పార్టీకి అదృష్టంగా మారతాయి. సగం సీట్లు అంటే 87అనుకుంటే, ఈ అదృష్టం లెక్క పది సీట్లు. ఇవి ఎవర్ని వరిస్తే వారు అధికారం చేపడతారు. అంటే ఎవరు అధికారం చేపట్టినా 95 సీట్లతో అని అంచనా వేసుకోవచ్చు.
ఇలా కాకుండా పార్టీలు అంచనా వేసుకుంటున్నట్లు ఎవరికి 115 వచ్చినా, అది ఒక విధంగా వన్ సైడ్ కింద లెక్క వేసుకోవచ్చు. ఎందుకంటే మిగిలిన రెండో పార్టీకి మహా అయితే యాభై నుంచి అరవై మధ్యనే వస్తాయి కాబట్టి. ఈ పరిస్థితి గమనించే పార్టీలు మరేమీ మాట్లాడడం లేదు. వైకాపా గెలుస్తాం అని చెప్పి ఊరుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎందుకయినా మంచిది అని ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలపై నానా యాగీ చేస్తోంది. రేపు అదృష్టం బాగుండి గెలిచినా, ఇంత చేసినా తాము నెగ్గామని మీసాలు మెలేయచ్చు. ఓడితే, ఇంత చేసారు కాబట్టి ఓడాం అని స్టేట్ మెంట్ పడేయచ్చు.
మరోపక్క ఇంకో వాస్తవం వుంది. పవన్ ప్లస్ మోడీ ప్రభావం కొంతవరకు దక్షిణ, ఉత్తర కోస్తాల్లో కాస్త ప్రభావం చూపిందనే చెప్పాలి. ఆ సంగతి ఇటు వైకాపా,అటు తేదేపా అంగీకరిస్తాయి. కానీ రెండు పార్టీల నాయకులకు ఎక్కడో చిన్న అనుమానం. ఏదో జరిగింది. ఏం జరిగిందన్నది తెలియదు. అది మాత్రం కౌంటింగ్ తరువాతే అంచనాకు అందుతుంది. అలా ఏదో జరిగింది అన్నది వాస్తవమైతే, వచ్చే సీట్లు సంఖ్య ఎవరికైనా 115దాటిపోతాయి. ఆ జరిగింది జగన్ కు అనుకూలం అన్నది బలంగా వినిపిస్తున్న సంగతి. మరి తేదేపాను ఇన్ని వర్గాలు కాసినా, ఏం జరిగింది, ఎందుకు జరిగింది..ఎలా జరిగిందన్నది 16 తరువాతే తేలుతుంది. అంటే జగన్ కు అనుకూలం అన్న ప్రచారం ఏ మేరకు నిజం అన్నది కూడా అప్పడే తెలిసేది.
చాణక్య