పవన్ పార్టీ ప్రకటన అయిపోయింది. ఆయన చెప్పాల్సింది చెప్పేసారు. చేయాల్సింది మిగిలి వుంది. ఆయన పాటికి ఆయన చెప్పాల్సింది చెప్పారు కానీ, మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ప్రశ్నలు వినడానికి కానీ, సమాధానాలు చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు. నిజానికి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే, వందలాది ప్రశ్నలు ఆయనకు ఎదురయ్యేవి. ఓ రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్న తరుణంలో మీడియాతో ఆయన ఒకసారి అయినా సమావేశం కావాల్సి వుంది. కానీ ప్రశ్నించే హక్కు జనానికి కావాలని అంటున్న ఆయన మీడియాకు మాత్రం ఆ అవకాశం ఇచ్చే ఉద్దేశంలో వున్నట్లు కనిపించడం లేదు. అందుకే ఈ ప్రశ్నలు.
Advertisement
- కేవలం కాంగ్రెస్ ను అధికారం నుంచి దించడం ద్వారా మీరు భావిస్తున్న సమస్త సమస్యలు పరిష్కారమైపోతాయా?
- మీ దృష్టిలో తెలంగాణ విభజన అవసరమా? అనవసరమా? అవసరమే కానీ సరిగ్గా జరగడం లేదు అనడం అంటే మీరు కూడా చంద్రబాబు ప్రతిపాదిస్తున్న సమన్యాయం గురించి మాట్లాడుతున్నట్లేగా?
- తెలంగాణ విభజనలో భారతీయ జనతాపార్టీ పాత్ర ఎంత అని మీరు భావిస్తున్నారు. ఆ విషయాన్ని మీ సుదీర్ఘ ప్రసంగంలో ప్రస్తావించలేదు ఎందుకని?
- రాష్ట్ర విభజనకు అనుకూలంగా తెలుగుదేశంతో సహా వివిధ పార్టీలు లెఖలు ఇచ్చిన సంగతి మీకు తెలిసా?తెలియదా?దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
- రాష్ట్రాన్ని విభజిస్తూ కెంద్ర మంత్రివర్గం తీర్మానించిన తరువాతే పార్లమెంటు ముందుకు బిల్లు వచ్చింది. ఆ మంత్రివర్గంలో మీ సోదరుడు చిరంజీవి కూడా వున్నారు. మరి ఆయన తప్పు లేదని మీరు ఎలా సమర్థిస్తారు?
- ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినపుడు యువరాజ్యం సారథిగా మీ పాత్ర ఏమీ లేదా? మీరు అప్పుడు ఎందుకు మౌనం వహించారు?
- ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అంతా కుళ్లిపోయిందని, పాడైపోయిందన్నది మీ అభిప్రాయం కదా.. మరి అలాంటి వ్యవస్థలో వున్న పార్టీలకు మీ మద్దతు ఏ విధంగా అందిస్తారు?
- విభజనకు కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యెలు అందరూ వేరు వేరు పార్టీలకు చేరిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ లేదా పార్టీలకు మీరు మద్దతు ఇవ్వడం ద్వారా మీరు వారిని గెలిపించడం అంటే ఏమని అర్థం చేసుకోవాలి?
- విభజనకు కారణమైన వారిని వేరే పార్టీల ద్వారా మీరు గట్టెక్కించి, కాంగ్రెస్ ను ఓడించండి అని పిలుపు ఇవ్వడంలో మీ అవగాహన ఏమనుకోవాలి?
- అధికారంలోకి రాకుండా, సమస్యలు పరిష్కారం చేయడం ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో సాధ్యమా?
- గోడదూకని వారికే మీ మద్దతు అంటున్న మీరు, చంద్రబాబు, చిరంజీవి కూడా గోడ దూకినవారే అని అంగీకరించగలరా?
- నా పర్సనల్ విషయాలు ఎత్తితే, మీ పర్సనల్ విషయాలు యూట్యూబ్ లో పెడతానని అంటున్నారు. అంటే మీకు చాలా మంది పర్సనల్ విషయాలు తెలిసీ దాస్తున్నారని అనుకోవాలా?
- తిలక్, శ్రీశ్రీ, గద్దర్ లను చదివిన మీకు..పబ్లిక్ లో నిల్చుంటే ఏమైనా అంటాం అన్న శ్రీశ్రీ మాటలు తెలియవా?
- సామాన్యులకు ఓ న్యాయం, డబ్బున్న వాడికి ఓ న్యాయం అని ఆవేదన వ్యక్తం చేస్తున్న మీరు, కొ్నాళ్ల క్రితం మీ అన్న చిరంజీవి బాడీగార్డులు, రామ్ చరణ్ ల సంఘటనను ఏమని సమర్థిస్తారు?
- రాజకీయ రంగంలోని అవకతవకలను విమర్శిస్తున్న మీరు, సినిమా రంగంలోని అవకతవకలను, థియేటర్లను బ్లాక్ చేయడం వంటి వ్యవహారాల గురించి ఏమంటారు?
- సినిమా రంగంలో చిరకాలంగా వున్న మీరు ఏ నాడూ మీ పారితోషికాన్ని కొంతమేరకైనా బ్లాక్ లో తీసుకోలేదని మనసాక్షి ప్రమాణం చేసి చెప్పగలరా?
చాణక్య