అయిదేళ్లకోసారి అపరిమితమైన శక్తిని సంతరించుకుని, విశ్వరూపం ప్రదర్శించి.. రాజులెవరో బూజులెవరో తేల్చేసి.. చప్పున చల్లారిపోయే పాశుపతాస్త్రం ‘ఓటు’!
అయితే ఎన్నికల పర్వంలో ఆ ఓటు ఎవరికి పడుతుందో ఎవరికెరుక! దాన్ని పసిగట్టడానికి నాయకులు ఎన్నిరకాల పాట్లు తమకు చేతకాగలవో అన్ని రకాల పాట్లు పడుతుంటారు. ‘ఎవరి ఓటు ఎవరికి పడునో ఎవరికి ఎరుక… ఏ ఓటెటు పడుతుందో ఎవరినీ ఎవరికీ తెలియకా…’ అంటూ సినిమా పాటలు నేర్పించిన తరహాలో తత్వాలు పాడుకోవడం మినహా ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల ఓటు ఎవరికి అనుకూలంగా ఉంటుందో నిర్దిష్టంగా తెలుసుకోగల కొలబద్ధలు ఏమీ లేవు.. ఉండవు! అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం.. దాదాపుగా ఓటు గమనం గురించిన కచ్చితమైన కొన్ని సంకేతాలు అర్థమైపోతుంటాయి. 1983లో ఎన్టీఆర్ విజయం, 2004 రాజశేఖరరెడ్డి విజయం అలాంటివాటిలోల కొన్ని. సాధారణంగా ప్రజల ఓటుకు అనేక ప్రాతిపదికలు ఉంటాయి. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’, ‘అభివృద్ధి ఓటు’, ‘స్థానిక నాయకుల మీద అభిమానం ఓటు’, ‘స్థానిక సమస్యలతో ముడిపడిన ఓటు’, ‘కులం ఓటు’, ‘మతం ఓటు’… ఇలా అనేక రకాల ప్రాతిపదికలు.
ప్రస్తుతం మనం ఎదుర్కొనబోతున్న చారిత్రాత్మక సార్వత్రిక ఎన్నికల్లో గమనిస్తే.. తెలంగాణ ప్రాంతంలో ఏకైక ప్రాతిపదికగా.. ‘తెలంగాణ అనుకూల-ప్రతికూల ఓటు’ మాత్రమే ఉంటుంది. అయితే అన్ని పార్టీలూ అనుకూల ఓటు తమకే దక్కాలని అనుకుంటుండడం తమాషా. సీమాంధ్ర విషయానికి వస్తే.. తెలంగాణ తరహాలోనే సమైక్యాంధ్ర ఆధారంగా ఓటు విభజన ఉంటుందని అనిపిస్తుంది. అందరూ అలాగే అనుకుంటారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడిన పార్టీలు, సమైక్యాంధ్ర స్ఫూర్తికి ద్రోహం చేసిన పార్టీలు అనేది ప్రజలకు ప్రాతిపదిక అవుతుందని అనుకుంటారు. కానీ ఒకసారి రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత.. తమ బతుకేదో తామే బతకాలని, తమ బాధలేవో తామే అనుభవించాలని ప్రజలు తమ ఆలోచనలను స్థిరపరచుకున్న తరువాత.. ఇక సమైక్యాంధ్ర అనే మాట ప్రజల ఓటుకు ప్రాతిపదిక గా ఉంటుందనుకోవడం భ్రమ. అయితే సీమాంధ్రలో కూడా ఈ ఎన్నికల్లో ఒకే ఒక ప్రాతిపదిక ఓటరన్న ముందుండే అవకాశం కనిపిస్తోంది. సరళంగా చెప్పాలంటే.. అది ‘జగన్ అనుకూల-ప్రతికూల ఓటు’! మరో రకమైన మాటల్లో చెప్పాలంటే.. ‘జగన్‌ను ప్రేమించే- ద్వేషించే ఓటు’!!
దేని పరిణామాలు ఎలా ఉంటాయి. ఎవరికి లాభిస్తాయి. ఎవరికి శోభిస్తాయి. ఎలాంటి పర్యవసానాల్ని అడ్డుకోవడానికి ఎవరి ప్రయత్నాలు, ప్రయాసలు ఎలా సాగుతున్నాయి… అనే అంశాల విశ్లేషణే ఈ వారం గ్రేటాంధ్ర ముఖచిత్ర కథనం.
జగన్ ఒక హేతువు!
జగన్ ఒక వ్యక్తి, ఒక ఎంపీ నుంచి ఒక పార్టీ అధినేత స్థాయికి మారారు. ఇప్పుడు ఆయన ప్రజల దృష్టిలో ఓటుకు ప్రాతిపదికగా నిలవగల హేతువుగా మారారు. ఒక వ్యక్తి కేంద్రీకృతంగా ఎన్నికలు జరిగిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు జగన్ అనుకూల – వ్యతిరేక ప్రచారాలు మంచి ఊపు మీద ఉన్నాయి. నిజం చెప్పాలంటే… జగన్‌కు అనుకూలంగా మాట్లాడేవాళ్లు చెప్పుకోగలిగిన మాట ఒక్కటే. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత.. ఆయన కోరుకున్న హరితాంధ్ర వంటి అభివృద్ధి ఫలాలు లేదా స్వప్నించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాకారం కావడంలో ఆ తర్వాతి పాలకులు అనుసరించిన విధానాలు ప్రజలకు వెగటు పుట్టించాయి. రాజశేఖరరెడ్డిని అభిమానించిన వాళ్లు, ఆయన పరిపాలనను ఆదరించిన వాళ్లు.. ప్రజాహితం పట్టని పాలకులతో విసిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో రాజశేఖరరెడ్డి వారసుడిగా రాజకీయాల్లో ఉన్న జగన్.. ఓదార్పు యాత్రకు కూడా అనుమతించని పార్టీతో విభేదించి బయటకు రావడం.. సొంత పార్టీ స్థాపించుకోవడం.. లాంటి పరిణామాలు.. వైఎస్సార్ పాలన తిరిగి రాష్ట్ర ప్రజలకు దక్కాలంటే.. అది జగన్ ద్వారా మాత్రమే సాధ్యం అనే అభిప్రాయాన్ని కలిగించాయి. జగన్‌కు ఉన్న ఏకైక అనుకూలాంశం అది. అందుకే ఆయన కూడా.. ఆదినుంచి రాజశేఖరరెడ్డి పాలనను తిరిగి తీసుకువస్తాం అనేదే పునాదిగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
జగన్‌కు వ్యతిరేకంగా అనేక ప్రాతిపదికలు ఉన్నాయి. ఆయన ప్రత్యర్థులు సంధిస్తున్న అస్త్రాలు అవినీతి ఆరోపణలు. ఆయన గడిపిన జైలు జీవితం. వేల కోట్ల నుంచి లక్ష కోట్లు, అలాగే లక్షల కోట్లు అవినీతి వరకు ప్రత్యర్థులు జగన్ మీద ఆరోపణల అవినీతి మోతాదును పెంచుకుంటూ పోయారు. తండ్రి సీఎంగా ఉండగానే.. అంతగా రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తి తానే సీఎం అయితే.. ఇక రాష్ట్రం అంటూ మిగలదనేది వారి ఆరోపణ. వైకాపా-యేతర పార్టీలు ఏవైనా కావొచ్చు. కానీ అందరి అజెండా మాత్రం జగన్‌ను అడ్డుకునే ప్రయత్నమే. జగన్ కిందికిలాగడం ద్వారా మాత్రమే తాము పైకి ఎక్కాలని అందరూ తపన పడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో స్పష్టంగా.. జగన్ అనుకూలత- వ్యతిరేకతలు మాత్రమే ప్రాతిపదికగా.. ఈసారి ఓటింగ్ జరగడం అనివార్యం.
ఏకమవుతున్న వ్యతిరేక శక్తులు
జగన్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు మిగిలిన పార్టీలు అన్నీ ఏకం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని తూలనాడి.. ఆ పార్టీనుంచి బయటకు వచ్చిన తర్వాత.. వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లోనే కిరణ్ సొంత పార్టీ పెడుతుండవచ్చు గాక! (లేదా, కొందరు ఆరోపిస్తున్నట్లుగా సోనియాగాంధీ విరచిత స్క్రిప్టు ప్రకారం నడుస్తున్న నాటకంలో కీలక పాత్రధారిగానే ఆయన కొత్త పార్టీని పెడుతుండవచ్చు గాక) అలాంటి కిరణ్‌కుమార్ రెడ్డిని చంద్రబాబునాయుడు తన పార్టీలో వచ్చి చేరమంటూ, యథాలాపంగానైనా ఆహ్వానించడం అనేది.. ఇలా జగన్ వ్యతిరేక శక్తులు ఏకం అవుతున్నాయనే పోకడకు పరాకాష్ట.
ఇలా వ్యాఖ్యానించడానికి ఒక భూమిక ఉంది. కిరణ్‌కుమార్ రెడ్డి తండ్రి తరం నుంచి చంద్రబాబుకు వారితో వైరం ఉంది. నల్లారి అమర్‌నాధ్‌రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కాంగ్రెసులో క్యాంపు రాజకీయాలు నడిపిన చరిత్ర చంద్రబాబుది. ఆ కుటుంబంలో రెండోతరం ప్రతినిధిగా కిరణ్‌తోనూ అదే ద్వేషాన్ని, వైషమ్యాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి కిరణ్ స్పీకరు అయినప్పుడు.. సభా మర్యాదను పాటించి.. స్పీకరు స్థానం వరకు తీసుకెళ్లడానికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన లేచి ముందుకు రాలేదంటే.. ద్వేషం ఏమోతాదులో ఉందో గుర్తు చేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు మాత్రం.. జగన్ వ్యతిరేక ఓటు… రవ్వంత కూడా చీలిపోకూడదనే ఆత్రుతలో కిరణ్‌ను ఏకంగా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాలని ఉత్సాహపడుతోంటే.. ఆయనను కూడా తమ పార్టీలోకి వచ్చేయమంటున్నాడు చంద్రబాబు. పైగా భారతీయ జనతా పార్టీతో పొత్తులకు ఆరాటపడుతుండడం కూడా వ్యతిరేక ఓటులో చీలిక రాకూడదనే ఉద్దేశంతోనే అన్నది స్పష్టం. మోడీ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలనే ఆరాటం ఎంత ఉన్నదో అదేస్థాయిలో.. జగన్ వ్యతిరేకత చీలిపోకూడదనే వ్యూహం కూడా ఉన్నది.
ఇలా.. ఒక రకంగా చెప్పాలంటే.. ‘జగన్’ – ఒక ఓటు ప్రాతిపదికగా మారడానికి వైరిపక్షాలే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు.
పరిమిత పోటీల మర్మం అదేనా..?
విజయం సాధించే అవకాశం లేకపోయినా ఎన్నికల బరిలో దిగే పార్టీలు ప్రతిసారీ కొన్ని ఉంటాయి. పొత్తులు లేని సందర్భాల్లో వామపక్షాలు, ఇటీవలి కాలంలో లోక్‌సత్తా వంటివి అలాంటి పార్టీలు. అయితే వీరికి నిలకడ అయిన ఓటు బ్యాంకు ఉంటుంది. స్థిరమైన ఓటర్లు ఈ పార్టీలకు ఉంటారు. గెలిచే అవకాశం లేని పార్టీలకు ఉండే ఇలాంటి స్థిరమైన ఓటు శాతం.. అభ్యర్థుల విజయావకాశాల మీద ప్రభావం చూపిస్తుంటుంది. 2009 ఎన్నికల్లో జరిగింది కూడా అదే. లోక్‌సత్తా , ప్రజారాజ్యం బరిలో ఉండడం వలన వారు ఓట్లు చీల్చడం వలన మాత్రమే తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైందని.. పాపం చంద్రబాబునాయుడు ఇప్పటికీ తన సన్నిహితుల వద్ద కుమిలిపోతుంటారు.
అయితే ఈసారి మాత్రం ఆయన ముందుగానే మేలుకున్నట్లున్నారు. బరిలో ఉండే ఇతర పార్టీల వలన తన పార్టీకి దక్కే ఓటు చీలకుండా ఉండేలా.. చాలాకాలం ముందునుంచే ఆయన పావులు కదపడం ప్రారంభించారు. తనకు అనుకూలంగా ఉండే మహా మహా శక్తులన్నిటినీ ఆయన అందునిమిత్తం మోహరించారు. మొత్తానికి ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలకు చైతన్యం కలిగించడమే తప్ప.. గెలుపు తమ లక్ష్యం కాదు. అందుకే అన్ని ఎన్నికల్లో పోటీచేస్తుంటాం అని చెప్పే.. లోక్‌సత్తా అధినేత జేపీ కూడా ఈసారి తాము పరిమిత స్థానాల్లోనే బరిలో ఉంటాం అని నర్మగర్భంగా చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ పెట్టబోయే పార్టీ 25 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీచేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే.. కిరణ్ కుమార్ రెడ్డి.. తమ పార్టీ అవసరం ఎక్కడ ఉన్నదో అక్కడ తాము పోటీలో ఉంటామంటూ మరింత డొంకతిరుగుడుగా చెబుతున్నారు. అంటే ఈ పార్టీలన్నీ కొన్ని కొన్ని స్థానాల్లోనే పోటీచేస్తాయన్నమాట.
ఈ ట్రిక్కులన్నీ జగన్ పార్టీకి ఉండే గెలుపు అవకాశాలకు గండి కొట్టడానికేనన్నది పలువురి విశ్లేషణ. జగన్‌కు యువతలో, కొన్ని కీలక సామాజిక వర్గాల్లో, సమైక్యాంధ్ర ప్రియుల్లో ఆదరణ ఉందన్నది స్పష్టం. ఎవరెన్ని చెప్పినా జగన్ ఒక్కడే ఆదినుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి చివరిదాకా నిలిచాడని నిర్దిష్టశాతం ప్రజలు నమ్ముతున్నారు. జగన్ మీద ప్రేమ లేకపోయినా.. సమైక్యాంధ్ర ప్రియులు కొందరు ఆయనకు ఓటు చేసే అవకాశం ఉంది. అలాంటి చోట్ల ఓటు చీల్చడానికి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ, యూత్‌లో, నిమ్నవర్గాలకు చెందిన ప్రజల్లో జగన్‌కు ఉన్న క్రేజ్‌ను చీల్చడానికి అలాంటి ఓటుశాతం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్‌కల్యాణ్ పార్టీ… ప్రధానంగా జగన్‌కు అనుకూలంగా ఉండే నగరాలు, విద్యావంతులు అధికంగా ఉండే ప్రాంతాల్లో.. అవినీతి బూచిని భూతద్దంలో చూపిస్తూ.. జగన్ ఓట్లకు గండికొట్టడానికి లోక్‌సత్తా రంగంలో ఉంటాయనేది విశ్లేషణ. ఆయా పార్టీలో తాము మొత్తం కాకుండా కొన్నేసి స్థానాల్లోనే పోటీలో ఉంటామనడం వెనుక కీలక రహస్యం ఇదేనని ప్రజలు వ్యాఖ్యానించుకుంటున్నారు.
ఏతావతా.. పొత్తులు, అవగాహనలు లాంటి పదాలను మించి.. సీమాంధ్రలోని వైకాపాయేతర పార్టీలన్నీ ఒకరికొకరు సహకరించు కుంటున్నారన్నది నిజం. ఓటరన్న చేతిలో బేరీజు వేస్తున్న తరాజులో ఈ పార్టీలన్నీ ఒక వైపునకు చేరుతున్నాయి.
జగన్ సింగిల్‌గానే వస్తున్నాడు…
ఈ పరిణామాలు అన్నిటినీ గమనించినప్పుడు… రజనీకాంత్ సినిమా డైలాగు గుర్తుకు వస్తుంది. ‘నాన్నా సింహం సింగిల్‌గానే వస్తుంది’ అంటూ రజినీ తన స్టయిల్‌లో శివాజీలో సెలవిస్తాడు. వైకాపా పరిస్థితి అలాగే ఉంది. జగన్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వస్తున్నాడు. సీపీఎం పొత్తులు పెట్టుకునే పుకార్లు ఉన్నప్పటికీ.. సీట్లు పంచుకునే వరకు వాటిని నమ్మడానికి వీల్లేదు. అలాగని వారు అవగాహనతో పోటీచేసే, స్నేహపూర్వక పోటీకి దిగే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. ప్రత్యర్థులు ఎందరున్నా సరే.. తాను ఒంటరిగానే, తన తండ్రి ఆశయబలంతోనే ఎదుర్కోవాలని జగన్ రంగంలోకి వస్తున్న మాట వాస్తవం.
ఎన్నికల్లో ప్రత్యర్థులతో తలపడడానికి సింగిల్‌గా వెళ్లడంలో అర్థముంది. అయితే పార్టీ నిర్మాణం, నిర్వహణ విషయాల్లో కూడా జగన్ ‘సింగిల్’గా వ్యవహరించడంపై అనేక విమర్శలున్నాయి. ఆయన పార్టీని ఏకధ్రువ వ్యవస్థగా నడుపుతున్నారనే విమర్శలున్నాయి. పార్టీలోనే కీలక వ్యక్తులు పలువురు అసంతృప్తితో వేగిపోతుండడానికి ఇవి కారణమౌతున్నాయి. బయటివారితో పోరులో సింగిల్ పోరు వన్నె తెస్తుంది. అదే సొంత పార్టీలో కూడా అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తే.. అది ఒంటెత్తు పోకడగా అపకీర్తి తెస్తుందని జగన్ తెలుసుకోవాలి.
ప్రేమ-ద్వేషం : దేనిది విజయం
సార్వత్రిక ఎన్నికల గంట మోగినదంటే.. రాజకీయ నాయకుల గుండెల్లో గణగణలు ప్రతిధ్వనిస్తుంటాయి. రకరకాల కాంబినేషన్లను పార్టీలు అనుసరిస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సీమాంధ్రలో జగన్ పట్ల ఉండే వ్యతిరేకతను పంచుకోవడానికి ఇప్పుడు నాలుగైదు పార్టీలు ఉన్నాయి. అదే ఆయన పట్ల ఉండే అనుకూలతను దక్కించుకోవడానికి ఒక్కటే పార్టీ ఉంది. అంటే.. జగన్‌ను ద్వేషించే వారు, తిట్టేవారు నాలుగు పార్టీల్లో దేనికైనా ఓట్లు వేయవచ్చు. జగన్‌ను ప్రేమించే వారు మాత్రం ఆయనకే ఓటు ఖచ్చితంగా వేస్తారు. ద్వేషం చీలిపోవచ్చు గానీ.. ప్రేమ చీలిపోయే అవకాశం లేదు.
అయితే సీమాంధ్ర ప్రజ హృదయాల్లో ద్వేషం ఎక్కువగా ఉన్నదా.. ప్రేమ ఎక్కువగా ఉన్నదా? అనే అంశం మీదే ఫలితం ఆధారపడి ఉటుంది.