మార్కెట్ లో పాతుకుపోయిన ఒక ప్రొడక్టు స్థానంలో, పోటీగా మరో ఉత్పత్తిని తీసుకురావడం అంటే అంత చిన్న విషయం కాదు. అలా తీసుకువచ్చిన దాన్ని మార్కెట్ ఎక్కించడం అంటే మరీ కష్టం. ఇలాంటి సాహసాలు చేసిన వారు ఎందరో వున్నారు. అలాంటి వాళ్లలో ఒకడు హీరో సైకిల్స్ వ్యవస్థాపకుడు ఓం ప్రకాష్ ముంజాల్.
సైకిల్ అంటే హంబర్..ర్యాలీ అనే తప్ప మరో పేరు వినిపించని కాలం. 1956లో పంజాబ్ లో ప్రారంభించినా, దేశంలోని మిగతా ప్రాంతాలకు దాన్ని విసర్తింపచేయడానికి చాలా కాలం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్ లోకి 70వ దశకంలోకి వచ్చేసరికి, జనం పెదవి విరిచారు. ఇది సైకిలా..సైకిల్ అంటే హంబర్..(ఈ సైకిల్ కారణంగానే హంబర్ ఫిట్టింగ్ అన్న పదం పుట్టింది) ర్యాలీ అనేవారు. పైగా హీరో సైకిల్ బరువులో మార్కెట్ లో వున్నవాటి వంటి కంటే చాలా తక్కువగా వుండేది.దాంతో అంత మంచి క్వాలిటీ కాదనే అభిప్రాయం జనాలకుకలిగింది. అప్పట్లో ర్యాలీ, హంబర్ సైకిళ్ల ధర ఆరువందలకు అటు ఇటుగా వుండేది. అలాంటిది హీరో కేవలం మూడు వందలకు అటు ఇటుగా మార్కెట్ లోకి వచ్చింది. సగానికి సగం రేటు తక్కువే అయినా జనం అంత సులువుగా దానిని ఆదరించలేదు. దీంతో హీరో సంస్థ కొత్త మార్కెట్ వ్యూహం పాటించింది. అప్పట్లో సైకిళ్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు ఎక్కువగా వుండేవి. అలాంటి దుకాణాలు కొన్ని ఎంపిక చేసి ఒకటి రెండు సైకిళ్లు ఉచితంగా, లేదా అంటే తక్కువ మొత్తానికి వాయిదా పద్దతిలో ఇవ్వడం ప్రారంభించేవారు. అద్దెకు కదా, కొత్తగా కనిపించే సైకిల్ ను జనాలు తీసుకెళ్లడం ప్రారంభించారు. అందులో వున్న సౌలభ్యం, క్వాలిటీ జనాలకు నెమ్మది నెమ్మదిగా తెలియడం ప్రారంభించింది. అంతే హీరో సైకిల్ నిజంగా హీరో అయిపోయింది. దాని ధాటికి హంబర్, ర్యాలీ పక్కకు తప్పుకున్నాయి.
తరువాత అదే హీరో సైకిల్స్ సంస్థ, జపాన్ హోండాతో కలిపి తొలిసారి మార్కెట్ లోకి 80వ దశకంలో హీరో హోండా ఎస్ ఎస్ బైక్ ను తొలిసారి మార్కెట్ లోకి తెచ్చింది. అప్పుడూ మళ్లీ అదే సమస్య. అప్పటికి యజ్డీ, బుల్లెట్, వంటి 250, 350 సిసిల బళ్లు వుండేవి. ఒక్క రాజ్ దూత్ మాత్రమే తక్కువ సిసి. అలాంటిది వంద సిసిల బైక్ అంటే జనం ఎగా దిగా చూసారు. కానీ అది ఇచ్చే మైలేజ్, అస్సలు శబ్దం చేయని ఇంజన్ చూసి, కొద్ది కాలంలోనే దాని వైపు మొగ్గారు. మళ్లీ కథ రిపీట్..యజ్డీ, బుల్లెట్ దారి ఇచ్చి పక్కకు తప్పుకున్నాయి.
ఇలాంటి ఎన్నో విజయగాధలకు మూలమైన ఓం ప్రకాష్ ముంజాల్ తన 86 వ ఏట ఈ రోజు కన్నుమూసారు. వీళ్లే భావి తరాలకు స్ఫూర్తి. మరెన్నో విజయగాధలకు పునాది.