మేము సైతం అంటూ టాలీవుడ్ చేస్తున్న 12గంటల సందడికి టైమ్ దగ్గరకి వస్తోంది. క్రికెట్, తంబోలా, సెలబ్రిటీ డిన్నర్, నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ షో..ఇవీ కార్యక్రమాలు. క్రికెట్ వ్యవహారాలు హీరో శ్రీకాంత్ చూసుకుంటున్నారు.
తబోలా, డిన్నర్ కు టికెట్ లు విక్రయిస్తారు. లక్షకు పైగా డొనేషన్ ఇచ్చిన వారిని నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ కు పిలవాలన్నది ఇప్పటికి వున్న ఆలోచన. నిన్న మొన్నటి వరకు ఇది అన్నపూర్ణ ఏడెకరాల స్థలంలో చేయాలని అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ పునరాలోచనలో పడ్డారు..శిల్పకళా వేదిక అయితే బాగుంటుందేమో అన్న డిస్కషన్ మొదలైంది. బహుశా రేపటికి నిర్ణయం వెలువడవచ్చు.
ఇదిలా వుంటే, గమ్మత్తు ఏమిటంటే స్కిట్ లు డ్యాన్స్ షోలకు సంబంధించి చిన్న నటులు, కమెడియన్లు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద హీరోలు ఎవరూ ఇంతవరకు తమ సమ్మతి తెలియచేయలేదని తెలుస్తోంది. తాము తంబోలాకు వస్తామని కొందరు, క్రికెట్ లో వున్నాంగా అని మరి కొందరు, డిన్నర్ ప్రోగ్రామ్ కు అయితే ఓకె అని ఇంకొదరు చెబుతున్నారు.
అయితే టాలీవుడ్ పెద్దలు మాత్రం అందరు హీరోయిన్లకు హుకుం మాత్రం జారీ చేసారు. ముంబాయి నుంచి, చెన్నయ్ నుంచి వచ్చి, నటించి వెళ్లిపోవడం కాదు, ఇక్కడి జనాల కోసం ఏదైనా చేయాల్సిందే అని. కచ్చితంగా ప్రతి హీరోయిన్ స్టేజ్ షో చేసి తీరాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కానీ అదే విధమైన కచ్చితమైన ఆదేశాలు హీరోలకు ఇచ్చేంత ధైర్యం మాత్రం టాలీవుడ్ పెద్దలకు లేనట్లు కనిపిస్తోంది.
ఇదిలా వుంటే స్టేజ్ షోల కార్యక్రమానికి మీడియాను దూరం పెట్టాలని ముందు అనుకున్నారు. అయితే దీనిపై వార్తలు రావడంతో, ఇప్పుడు ప్రింట్ మీడియాను మాత్రం అనుమతించాలని చూస్తున్నారు. సినిమాల ప్రచారం కోసం మాత్రం వెబ్ మీడియా చుట్టూ వెంపర్లాడే సినిమా జనాలు, ఈ కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారిని దూరం పెట్టాలని చూస్తున్నారు.
అదే విధంగా జెమిని టీవీకి హక్కులు ఇచ్చేయడంతో, చానెల్ మీడియాను కూడా అనుమంతించాలా వద్దా అని కిందా మీదా పడుతున్నారు. ఆ విధంగా ఇంకా ఒక నిర్ణయం అంటూ లేకుండా కిందా మీదా అవుతున్నారు మేము సైతం నిర్వాహకులు అని తెలుస్తోంది.