సినిమా రివ్యూ: ఐస్‌ క్రీమ్‌ 2

రివ్యూ: ఐస్‌ క్రీమ్‌ 2 రేటింగ్‌: 1/5 బ్యానర్‌: భీమవరం టాకీస్‌ తారాగణం: జె.డి. చక్రవర్తి, నవీన, నందు, సిద్ధు, ధన్‌రాజ్‌, జీవా తదితరులు సంగీతం: శ్రీరామ్‌-సత్య కౌశిక్‌ ఫ్లో సౌండ్‌ డిజైనర్‌: శేషు…

రివ్యూ: ఐస్‌ క్రీమ్‌ 2
రేటింగ్‌: 1/5

బ్యానర్‌: భీమవరం టాకీస్‌
తారాగణం: జె.డి. చక్రవర్తి, నవీన, నందు, సిద్ధు, ధన్‌రాజ్‌, జీవా తదితరులు
సంగీతం: శ్రీరామ్‌-సత్య కౌశిక్‌
ఫ్లో సౌండ్‌ డిజైనర్‌: శేషు కె.ఎం.ఆర్‌.
ఛాయాగ్రహణం: కౌశిక్‌ అభిమన్యు
నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ
కథ, కథనం, దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
విడుదల తేదీ: నవంబర్‌ 21, 2014

‘ఐస్‌ క్రీమ్‌’ చిత్రానికి 2, 3, 4, 5… ఇలా సీక్వెల్స్‌ తీస్తూనే ఉంటానంటూ ప్రకటించిన రామ్‌ గోపాల్‌ వర్మ ‘ఐస్‌ క్రీమ్‌’కి సెకండ్‌ ఎడిషన్‌ రిలీజ్‌ చేసారు. ‘ఐస్‌ క్రీమ్‌ 2’ విశేషాల్లోకి వెళితే…

కథేంటి?

తాము తీద్దామనుకుంటున్న సినిమాకి నిర్మాత దొరక్కపోవడంతో తమ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోవడానికి షార్ట్‌ ఫిలిం తీసి చూపిద్దామని… ఒక మూత పడ్డ కెమికల్‌ ఫ్యాక్టరీకి షూటింగ్‌ కోసం వెళతారో స్నేహితుల బృందం (నవీన, నందు, సిద్ధు, ధన్‌రాజ్‌ తదితరులు). బ్యాంక్‌ దోపిడీ చేసి పారిపోయి వచ్చిన ఓ ముఠా (జెడి చక్రవర్తి, జీవా తదితరులు) వీరిని బంధిస్తుంది. ఆ తర్వాత వీరందరిపై ఒక అగంతకుడు దాడి చేస్తూ వరుసగా అందర్నీ చంపేస్తుంటాడు. 

కళాకారుల పనితీరు:

అడవిలోకి ఎంటర్‌ అయింది మొదలు ఏ చిన్న శబ్ధం విన్నా కానీ భయపడిపోతూ చెట్టుకొకరు, పుట్టకొకరు చొప్పున పారిపోవడమే ఇందులోని నటీనటులకి అప్పగించిన పని. ఆ పని ఎవరు బాగా చేసారనేది విశ్లేషించుకోవాల్సిన పని లేదు. అనుభవజ్ఞుడైన జె.డి. చక్రవర్తి… విచిత్ర వేషధారణతో, ‘హుష్‌ హుష్‌’ అంటూ సౌంజ్ఞలు చేసే పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో మర్చిపోలేని చిత్రాలు అందించి, తనకి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిన వర్మపై గౌరవంతో ఈసారి తనకి ఏం చెప్తే అది ఎందుకని అడగకుండా చేసేసినట్టున్నాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

బడ్జెట్‌ లిమిటేషన్స్‌ వల్ల సాంకేతిక పరంగా చెప్పుకోతగ్గ క్వాలిటీ లేదు. టీవీలో వచ్చే ‘నేరాలు ఘోరాలు’ తరహా అవుట్‌పుట్‌లా ఉందనిపిస్తే అది మీ తప్పు కాదు. ఫ్లో కామ్‌, ఫ్లో సౌండ్‌ టెక్నాలజీ దీనికంటే ‘ఐస్‌క్రీమ్‌’లోనే ఎఫెక్టివ్‌గా అనిపించింది. 

Video: Ice Creame 2 Open Public Talk

‘ఐస్‌క్రీమ్‌’ సిరీస్‌ ప్లాన్‌ చేయడంలో రామ్‌గోపాల్‌వర్మ మోటివ్‌, టార్గెట్‌ ఏమిటనేది తెలియదు కానీ కథ, కథనం లేకుండా కేవలం కొన్ని హత్యలు చూపించి, భయంకరమైన శబ్ధాలు చేసి ఆడియన్స్‌కి థ్రిల్‌ ఇద్దామనుకుంటే వృధా ప్రయాసే తప్ప ఫలితం ఉండదు. వర్మ తీసిన ‘దొంగల ముఠా’, ‘ఐస్‌ క్రీమ్‌’లాంటి పాయింట్‌లెస్‌, మీనింగ్‌లెస్‌ సినిమాల సరసన ఇది కూడా చేరుతుంది. 

హైలైట్స్‌:

  • సినిమా నిడివి కేవలం తొంభై నిమిషాలే.

డ్రాబ్యాక్స్‌:

  • ఆ తొంభై నిమిషాలు!

విశ్లేషణ:

ఈ చిత్రంలో సినిమా అవకాశం కోసమని ఓ మిత్ర బృందం షార్ట్‌ ఫిలిం తీసి తమ టాలెంట్‌ చూపిద్దామని అనుకుంటుంది. అలాగే సదరు ఫ్లో కేమ్‌, ఫ్లో సౌండ్‌ టెక్నాలజీని ఎండార్స్‌ చేయడానికి ‘ఐస్‌క్రీమ్‌’ సిరీస్‌ని వర్మ తెరకెక్కిస్తున్నారని అనుకోవాలి. మొదటి ఐస్‌క్రీమ్‌కి, దీనికి ఎలాంటి పోలికా లేదు. ఉన్న ఒకే పోలిక ఏంటంటే దాంట్లోను కథ లేదు, దీంట్లోను కథ లేదు. అందులోను ఆరంభం నుంచి చివరి వరకు ఎలాంటి పాయింట్‌ లేకుండా సినిమా సాగుతుంది. ఇందులోను అదే తంతు రిపీట్‌ అవుతుంది. అంతకుమించి 1 అండ్‌ 2 మధ్య సారూప్యమేమీ కనిపించదు. 

కథ, కథనాలు లేకుండా కేవలం ఏదో టెక్నాలజీపై ఎక్స్‌పెరిమెంట్‌ చేస్తే ఆ సినిమాలు ఇలాగే ఎందుకు తీసారో, ఏమి చూసామో అర్థం కాకుండా మిగిలిపోతాయి. మామూలుగా ఒక థ్రిల్లర్‌ సినిమాని తొంభై నిముషాల్లో తీస్తే ‘సూటిగా సుత్తి లేకుండా’ ఉంటుంది. ఆద్యంతం బిగి సడలని కథనంతో ఊపిరి సలపకుండా చేస్తుంది. కానీ తొంభై నిమిషాల సినిమాలో కూడా అస్సలేమీ చూపించకుండా కాలక్షేపం చేయవచ్చునని, ప్లాట్‌ ఏంటనేది తెలియనివ్వకుండా ఇంటర్వెల్‌ ఇచ్చేయవచ్చునని ‘ఐస్‌ క్రీమ్‌ 2’ తెలియజెపుతుంది. 

ఇంటర్వెల్‌ వరకు కనిపించని ఓ హంతకుడు ఇక టైమ్‌ వేస్ట్‌ చేయకుండా సెకండ్‌ హాఫ్‌ మొత్తం చంపే పని మీదే ఉంటాడు. కేవలం హీరోహీరోయిన్ల బృందం మాత్రమే ఉంటే నలభై నిమిషాల పాటు చంపుకోడానికి సరిపడా మనుషులు ఉండరనుకున్నారో ఏమో, వారితో పాటు ఒక దొంగల ముఠాని కూడా జత చేసి… ఆ హత్యలతో ద్వితీయార్థం కానిచ్చేసారు. అలాంటప్పుడు ఫస్ట్‌ హాఫ్‌లో ఆ నస అంతా పెట్టే బదులు మరో రెండు గ్రూపులని కూడా ఎలాగోలా ఇరికించి ఇంటర్వెల్‌ వరకు కూడా సీరియల్‌ హత్యలే చూపించేస్తే పోయేది. 

ఎలాగైనా భయపెట్టాలని చెవులు చిల్లులు పడేలా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ నాన్‌స్టాప్‌గా వినిపిస్తున్నా… వరుసపెట్టి ఎన్నో హత్యలు తెరపై అదే పనిగా జరిగిపోతున్నా… ఎక్కడా కనీసం అదురు బెదురు కలగదు. వారిలో ఎవరు చచ్చిపోతున్నా చివుక్కుమని కూడా అనిపించదు. మిగిలిన వాళ్లు కూడా త్వరగా పోతే ఇంటికెళ్లిపోవచ్చు అనేంతగా క్యారెక్టర్స్‌తో బాండ్‌ ఏర్పడుతుంది. దాదాపు ఎంప్టీ థియేటర్‌లో (బాల్కనీ మొత్తం మీద నలుగురున్నారు) కూర్చుని చూస్తున్నా కానీ ఈ జోనర్‌ సినిమా కనీస భయాన్ని కూడా కలిగించలేకపోయిందంటే.. చిత్రీకరణ ఎంత గొప్పగా ఉందనేది మీరే అర్థం చేసుకోవాలి. 

ఓవరాల్‌గా ‘ఐస్‌క్రీమ్‌’ సెట్‌ చేసిన స్టాండర్డ్స్‌ని మ్యాచ్‌ చేయడానికి ‘ఐస్‌ క్రీమ్‌ 2’లో గట్టి ప్రయత్నమే జరిగింది. ఆ సినిమాని విమర్శించిన వారితోనే అదే బెటర్‌ ఫిలిం అనిపించడానికి చేసిన చిత్రంలా అనిపిస్తుందిది. అయితే కేవలం హీరోయిన్‌ పైనుంచి కిందకి తిరుగుతూ, స్నానం చేస్తూ, బట్టలు మార్చుకుంటూ, ఫోన్లో మాట్లాడుతూ, దెయ్యాల్ని ఊహించుకుంటూ పెట్టే నస కంటే… ఇలా కనిపించిన క్యారెక్టర్లన్నిటినీ చంపుకుంటూ పోవడమే బెటర్‌ అనిపిస్తుంది. ఆ విధంగా ‘ఐస్‌క్రీమ్‌’ని ‘ఐస్‌క్రీమ్‌ 2’ బీట్‌ చేయగలిగింది. స్క్రిప్ట్‌ లేకుండా తయారవుతున్న ఈ సినిమాలు చూస్తుంటే… ‘కామెడీ, యాక్షన్‌, హారర్‌, థ్రిల్లర్‌’ మాదిరిగా ‘ఐస్‌క్రీమ్‌’ అనే కొత్త జోనర్‌ పుట్టుకొచ్చే అవకాశముంది.

బోటమ్‌ లైన్‌: ఐస్‌క్రీమ్‌ 2 – పర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri