ఈ డైలాగు ఎన్టీఆర్ దాన వీరశూరకర్ణలో చాల ఫేమస్..'…కాగా కులము కులము అను వ్యర్థ ప్రలాపములెందుకు' అని ధుర్యోధనుడు తమ కుల పెద్దలను నిలదీస్తాడు. భీష్ముడి దగ్గర నుంచి మొదలుపెట్టి గురువు ద్రోణుడి వరకు, వాళ్లు పుట్టుపూర్వోత్తరాలు వెలికి తీసి, కడిగిపారేస్తాడు. కులం ఎందుకు అని నిలదీస్తాడు. ఈ పార్ట్ అంతా ఎన్టీఆర్ చాలా ఇష్టంతో, కొండవీటి వెంకటకవిని దగ్గర పెట్టకుని రాయించుకున్నవి.
కానీ, ఇప్పుడు అదే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కులాల లెక్కలు తీస్తోంది. ఆంధ్ర దేశంలో ఏయే కులాల వారు తమ పార్టీలో ఎంత మంది వున్నారు వంటి లెక్కలు సేకరిస్తోంది. అందుకు గాను, పార్టీ సభ్యత్వ నమోదును అవకాశంగా తీసుకుందట.
భవిష్యత్ లో భాజపాతో పొత్తు లేకుండా, ఒంటరిగా పోటీ చేయాల్సిన అవసరం వచ్చినా కూడా, కులాల ఈక్వేషన్లు తెలుసుకుని, ఆ విధంగ ముందుకు పోవడానికి వీలుగా తెలుగుదేశం పార్టీ పథకరచన చేస్తోంది. ఇందుకోసం పార్టీ సభ్యత్వం ఇచ్చేటపుడే వేరేగా కులాల డేటాను కూడా సేకరిస్తోందట. దీనిమైన ఓ జాతీయ దినపత్రిక, ఈ సభ్యత్వ నమోదు వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న కిమిడి కళా వెంకటరావును ప్రశ్నించింది.
''..ఇందులో మాకు, వేరే దురుద్దేశాలు ఏమీ లేవు..రాజకీయాలను, ఎన్నికలను కులాలు ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయన్నది తెలుసుకోవడం కోసం తప్ప వేరే ఉద్దేశం లేదు..'' అని బదులిచ్చారు కళా వెంకటరావు
నిజానికి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇంతకు ముందు ఏ రాజకీయ పార్టీ కూడా సభ్యత్వ నమోదులో కులాల లెక్కలు తీసిన దాఖలాలు లేవు. అయితే మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా వున్నా ఆంధ్ర ఎన్నికల్లో కులాల ఈక్వేషన్లు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయన్నది వాస్తవం. కమ్మ సామాజికవర్గం తొంభైశాతం తెలుగుదేశం వైపు, అలాగే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపూ వున్నాయన్నది తెలిసిన సంగతే.
అలాగే మాల, మాదిగ కులాలకు కూడా చెరో వైపు వున్నాయి. ఇక కీలకమైన కాపు సామాజికవర్గం ఎన్నిక ఎన్నికకు స్టాండ్ మార్చుకుంటూ వస్తోంది. అందువల్ల అసలు తమ పార్టీ సభ్యులు ఎంతమంది, వారిలో ఏయే కులాల వారు ఎంతమంది వున్నారు. దీన్ని బట్టి, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి వంటి వాటిపై ఓ అంచనాకు రావడానికే తెలుగుదేశం పార్టీ ఈ లెక్కలు తీస్తోందని తెలుస్తోంది.
ఏదైతేనేం..మొత్తానికి మన రాజకీయం మొత్తం కులాల గోడలపై నిర్మాణమైపోతోంది. మంది వున్న కులానిది, లేదా ప్రభావితం చేయగల కులం అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. అది లేని కులాల వారు మౌనంగా భరించడం మినహా చేసేదేమీ లేదు.