జగన్ ఆ జపం మానాలి

వైకాపా ఓటమికి, తేదేపా విజయానికి మధ్య తేడా అయిదులక్షల ఓట్లే. ఇదీ జగన్ ఎన్నికల ఫలితాల వెలువడ్డ నాటి నుంచి నేటికి చెబుతున్న మాట. కార్యకర్తలను ఊరడించడానికో, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికో, లేదా తనను…

వైకాపా ఓటమికి, తేదేపా విజయానికి మధ్య తేడా అయిదులక్షల ఓట్లే. ఇదీ జగన్ ఎన్నికల ఫలితాల వెలువడ్డ నాటి నుంచి నేటికి చెబుతున్న మాట. కార్యకర్తలను ఊరడించడానికో, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికో, లేదా తనను తాను సముదాయించుకునేందుకో జగన్ ఈ మాట చెబుతూ వుండొచ్చు. కానీ పదే పదే అదే మాట చెప్పడం కాస్త ఇబ్బందిగానే వుంటుంది. విజయం విజయమే. అది ఒక్క ఓటుతో గెలిచినా, ఓట్లతో గెలిచినా. 

తొమ్మిది ఓట్లతో గెలిచాడు కొణతాల రామకృష్ణ తొలిసారి. మరి ఆ తరువాత ఇంక గెలవలేదా? ఇంకా ఎక్కువ ఓట్లతో గెలిచారు. అమెరిగా అధ్యక్ష పదవిని బుష్ తొలిసారి 150​ ఓట్ల తేడాతో కైవసం చేసుకున్నారు. కానీ రెండో టెర్మ్ కూడా పాలించారు. అంటే ఎన్ని ఓట్లతో గెలిచినా, పాలించే విధానాన్ని బట్టి, ప్రజాదరణ చూరగొనే వైనాన్ని బట్టి మరోసారి గెలవడమా, ఓడడమా అన్నది ఆధారపడి వుంటుంది. 

అందువల్ల గెలిచినవారైనా, ఓడిన వారైనా ఈ ఓట్ల లెక్క మరిచిపోయి, ప్రజాదరణ కోసం కృషి చేయాల్సి వుంటుంది. చంద్రబాబుకు తెలియదా..తాను అయిదులక్షల ఓట్ల తేడాతోనే గెలిచాననని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాయకులను ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు నిజాలో అబద్ధాలో చెప్పాల్సినవి చెబుతున్నారు. 

నిజానికి ఈ ఓట్ల లెక్కలే తీసుకుంటే, జగన్ ఇంట్లో కూర్చోవచ్చు. అయిదేళ్ల అనంతరం గ్యారంటీగా గెలిచేయచ్చు. ఎందుకంటే అయిదులక్షల ఓట్లు తేడా. ఇప్పడు రుణమాఫీ దొరకని రైతుల సంఖ్య ముఫై లక్షలు. అందులో పదిశాతం మంది అంటే మూడు లక్షల మంది వైకాపా వైపు వచ్చినా గెలుపు సాధ్యం అవుతుంది. అలాగే డ్వాక్రా రుణాలు, ఇంకా అనేక హామీలు నమ్మి వేసిన వారు వుంటారు. వారిలో పావు వంతు మంది వ్యతిరేకమైనా చాలు. 

కానీ అయిదేళ్ల తరువాత ఇలా వుండదు పరిస్థితి. అప్పటి పరిస్థితులపై అప్పటి ఓటింగ్ ఆధారపడి వుంటుంది. అది జగన్ కు ఫేవర్ గా వుంటుందా..బాబుకు ఫేవర్ గా వుంటుందా అన్నది ఇప్పుడు జవాబు చెప్పగలిగిన ప్రశ్న కాదు. అలా అని మరి జగన్ ఏమీ మాట్లాడకుండా, చేయకుండా కూర్చోవాలా అంటే సరికాదు. కానీ మాట్లాడాల్సింది, చేయాల్సింది ఇది కాదు. 

ముందు చేయాల్సింది అయిదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడం. అందుకు ముందుగా పార్టీని బలోపేతం చేయడం. కొత్తగా మారోసారి సభ్యత్వ నమోదు చేపట్టి, పార్టీని నమ్మిన నికార్సయిన కార్యకర్తలు ఎంతమంది వున్నారో కచ్చితంగా తెలుసుకోవడం. వాళ్ల నుంచి కొత్తగా క్రియాశీలక నేతలను తయారుచేసుకోవడం. ప్రజా సమస్యలను ఎక్కడిక్కడ ప్రస్తావించడం. 

ఇలా ముందుకు వెళ్లాలి తప్ప, అయిదులక్షల ఓట్లే తేడా అని కలలు కంటూ, కలవరిస్తే, అధికారం వరించే అవకాశాలు మాత్రం తక్కువ. పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడం వేరు..ధీమా కల్పించడం వేరు. జగన్ తాను భరోసా ఇస్తున్నాను అనుకుంటున్నారు. కానీ దీనివల్ల అయిదులక్షల ఓట్లేగా తేడా అని వాళ్లు ధీమాపడితే పరిస్థితి ఏమిటి? అన్నిది గమనించాలిగా?