ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల్లో అలజడి. కాస్త దూరంలోనే అయినా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా గుంటూరు జిల్లా ప్రజానీకం మొత్తం ఉలిక్కిపడాల్సి వచ్చింది. పిడుగురాళ్ళ, మాచర్ల ప్రాంతాల్లో స్వల్పంగా కాస్సేపటి క్రితం భూ ప్రకంపనలు సంభవించాయి. దాంతో జనం ఇళ్ళల్లోంచి బయటకు పరుగులు తీశారు.
సాధారణంగా, ఈ తరహా భూ ప్రకంపనలు ఎక్కడో ఓ చోట ఎప్పుడో ఓ సారి కన్పిస్తూనే వుంటాయి. పైగా, ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో స్వల్ప తీవ్రతతో కూడిన ప్రకంపనలు సర్వసాధారణమైపోయాయి. భూమి లోపలి పొరల్లో సర్దుబాట్ల కారణంగా ఈ ప్రకంపనలు ఏర్పడుతుంటాయనీ, వీటి కారణంగా నష్టమేమీ వాటిల్లే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబోయే కొత్త రాజధాని ప్రాంతంలో భారీ కట్టడాలకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న దరిమిలా, కట్టడాల నిర్మాణంలో ‘భూ ప్రకంపనల్ని’ దృష్టిలో పెట్టుకుని, మరింత పటిష్టంగా నిర్మించాల్సి వుంటుంది. రాజధాని ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం లేకపోయినా, స్వల్ప స్థాయి తీవ్రతతో కూడిన ప్రకంపనలు వచ్చే ప్రాంతంగా ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పారు.
కేంద్రం నియమించిన రాజధాని కమిటీ (శివరామకృష్ణన్ కమిటీ) నివేదికలోనూ భూప్రకంపనల అంశాన్ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజధాని పరిసరాల్లో ప్రకంపనలు అన్న వార్త, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఎప్పుడూ తుపాన్ల ధాటికి ఇబ్బంది పడని విశాఖపట్నం మొన్నటి హుద్‌హుద్ తుపాను దెబ్బకు విలవిల్లాడిన విషయం విదితమే.
ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు గనుక.. ప్రమాదాల్ని ముందే ఊహించి, కొత్త రాజధాని విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆ దిశగా చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకుంటుందనే ఆశిద్దాం.