కాంగ్రెస్ మహా మహా ద్రోహం చేసింది ఆంధ్ర దేశానికి. అడ్డగోలుగా, ఎవరికీ చెప్పకుండా విభజించింది రాష్ట్రాన్ని. పాపం, చంద్రబాబు అప్పటికీ విభజన వద్దు అని, సమైక్యమే ముద్దు అని శత విధాలా చెప్పారు,..పోరాడారు. ఇక వెంకయ్యనాయుడు, ఆయన పార్టీ అయితే చెప్పనక్కరలేదు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసాయి రాష్ట్రం విడిపోకూడదని.
కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ చేసిన తీర్మానం కూడా తూచ్..ఉత్తుత్తునే. అన్నాయి. అందుకే జనాలు చంద్రబాబు తప్పు అస్సులు లేదు..భాజపా తప్పు అంతకన్నా లేదు అని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా వేయకుండా ఓడించారు. తగిన శాస్తి జరిగింది. తెలంగాణలో కూడా తెలుగుదేశం సమైక్య వాది, భాజపా అంతకన్నాను అని ముద్రవేసి, అరకొర సీట్లు ఇచ్చారు.
ఇవన్నీ జరిగి ఆరు నెలలు అయిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా సైలెంట్ అయిపోయారు. ప్రజలకు మొహం చూపించలేక ఇళ్లలో వుండిపోయారు. గంటా శ్రీనివాసరావు, రాయపాటి, టిజి వెంకటేష్, లాంటి తెలివైన వాళ్లు ముందే తెలుగుదేశంలోకి చేరుకుని, విభజన పాపం కడిగేసుకుని పవిత్రులైపోయారు కాబట్టి, జనం వారిని గెలిపించారు. అందుకేవాళ్లు గతం మరిచి పొరపాటున కాంగ్రెస్ ఊసు ఎత్తరు.
కానీ..మనం చంద్రబాబు మాత్రం కలలో కూడా కాంగ్రెస్ ను మరిచిపోలేకపోతున్నారు. ప్రజల ముందుకు ఆయనైనా, ఆయన చినబాబు అయినా వెళ్లారంటే, డీఫాల్ట్ డైలాగులు వినిపోస్తారు ఇలా. ఆవు వ్యాసం స్టయిల్ లో చదువుకోవచ్చు.
కాంగ్రెస్ అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని. అందుకే ప్రజలు తగిన శాస్తి చేసారు. అప్పులు జనాభా ప్రాతిపదికన, ఆస్తులు సమానంగా పంచారు. (అప్పుడు మరి భాజపా, వెంకయ్య నాయుడు ఎందుకు పార్లమెంట్ లో ఓకె అన్నట్లో?) ఓట్లు సీట్ల కొసం కాంగ్రెస్ నాటకాలాడింది. తేదేపాను దెబ్బ తీయాలని కుట్ర పన్ని కుదేలైపోయారు.
ఇలా సాగిపోతాయి మాటలు. ఇక్కడ అర్థం కానిది ఒక్కటే. ప్రజలు కూడా ఇవన్నీ తెలుసుకునే కదా..కాంగ్రెస్ ను తుంగలో తొక్కేసారు. పైగా ఇప్పుటికిప్పుడు ముంచుకు వచ్చే ఎన్నికలు కూడా లేవు. కాంగ్రెస్ నాయకులు ఏమీ మాట్లాడడం లేదు. మరెందుకు పదేపదే ఇవన్నీ జనానికి గుర్తు చేయడం.
అంటే అయిదేళ్ల తరువాత ఇవే మాటలు ఒక్కసారి చెబితే పనికిరాదు. ఇప్పటి నుంచీ గుర్తు చేస్తూనే వుండాలి. అంటే దాని అర్థం ఒక్కటే చంద్రబాబులో ఏ మూలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ మళ్లీ బలం పుంజుకుని, జనం ముందుకు వస్తుందన్న అనుమానం బలంగా వుండి వుండాలి. అందుకే ఇప్పటి నుంచీ ఈ మాటలు పదే పదే వల్లిస్తూ, జాగ్రత్త పడుతున్నారని అనుకోవాలి.
కౌటిల్య