ఎక్కడ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు ప్రారంభించినా కొన్ని లాభాలు వుంటాయి..మరి కొన్ని నష్టాలు వుంటాయి. కానీ మేథావులు, వామపక్ష భావ జాల ప్రభావితులు ఎక్కువగా సాదా సీదా జనాల కష్టలవైపే వుంటారు. ప్రభుత్వ ప్రాజెక్టు వల్ల కొంత లాభం వున్నా కూడా, ఈ నష్టాన్నే వారు అడ్డుకోవడానికి చూస్తారు. మేథాపట్కర్ లాంటి వాళ్లు వీరు
అలాగే మరికొంత మంది వుంటారు. పౌరహక్కుల జనాలు. సాదా సీదా, బీదా బిక్కీ అన్యాయమైపోతుంటే, వ్యవస్థకు ఎదురొడ్డి నిలిచి పోరాడేవాళ్లు. దివంగత బాలగోపాల్ లాంటి వాళ్లు.
వీరు కాక వామపక్షాలు వుంటాయి. పేదలకు, వ్యయసాయ కూలీలకు వీసమెత్తు అన్యాయం జరుగుతుందని తెలిసినా అక్కడ వాలి ఉద్యమాలు చేపట్టి, జనాన్ని ముందుకు నడిపించేవారు. ఘనత వహించిన రాఘవులు, నారాయణ లాంటి వాళ్లు.
వీరు కాక..పర్యావరణ ప్రియలు అనే బాపతు జనాలు కూడా వుంటారు. గడ్డి పరక మొలవని భూముల్లో ప్రాజెక్టు చేపట్టినా, గుండెలు బాదేసుకుని బాధపడి, పర్యావరణానికి న్యాయం చేయమని గగ్గోలు పెట్టే వాళ్లు. నిజంగా ఇలాంటి వాళ్లు వుండబట్టే ఈ భూమి ఇంకా ఇలా వుంది. ప్రొఫెసర్ శివాజీరావ్ లాంటి శాస్త్రవేత్తలు
మరి ఏరీ..వీళ్లంతా ఎక్కడ?
పచ్చటి పైరు భూములు, ఏడాది పొడవునా నాలుగు పంటలు పండే నేల, నదులు, 50 వేల మంది వ్యవసాయ కూలీల ఉపాథి, వేలాది రైతుల ఆస్తి..అడ్డగోలుగా, అక్కర్లేని భేషజాల కోసం ప్రభుత్వం ఒక్క సారిగా లాగేసుకునే ప్రయత్నం చేస్తుంటే,,ఏమైపోయారు వీళ్లంతా?
ఆఖరికి కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి కోరగా మేధాపట్కర్, వందనా శివ వస్తున్నారు ఈ నెల 11, 12 తేదీల్లో.
మన రాష్ట్ర జనాలు ఏమైపోయారు. వ్యవసాయ కూలీల పునాదులపై ఏర్పడిన వామపక్షాల దృష్టికి ఈ సమస్య ఎందుకు సోకలేదు. నారాయణా లాంటి వాళ్లు పాపం ఈ ప్రాంత జనాల కోసం రెండు రోజులో, రెండువారాలో చికెన్ తినడం మానేస్తానన్న మాట అయినా వినిపించడం లేదేం?
అన్నట్లు ఇంకో తరహా జనాలు కూడా వుండాలి. వారు బాబుకు సంబంధించిన కార్యక్రమం ఏదైనా అంటే చాలు ఢిల్లీ నుంచి వాలిపోతారు. అది బాబు పాదయాత్రయినా కావచ్చు…ప్రమాణ స్వీకారమైనా కావచ్చు..వారే జాతీయ జర్నలిస్టులు. మరి వారికి ఇక్కడ రాజధాని గురించి జరుగతున్న రగడ తెలియడం లేదా. టైమ్స్ ఆఫ్ ఇండియా నిత్యం రాస్తున్న కథనాలు కనిపించడం లేదా?
ఇప్పుడు కదుల్తారట
నిన్న మున్నటి దాకా వైకాపా ఒక్కటే పోరుతోంది. కానీ దాని గోల అరణ్య రోదన అయింది. అయితే ప్రజల ఆందోళన అంటూ వినిపించడం మొదలయ్యాక, ఏదో ఒకనాడు రాష్ట్రం మొత్తం వినిపించకపోదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేస్తోందని, తమ చాతకాని తనం, తమ పట్టించుకోని తనం బట్టబయలు అయిపోతోందని వామపక్షాలు, పేరులోనే సత్తాను నింపేసుకున్న లోక్ సత్తా గుర్తించాయి. అందుకే ఇక లాభం లేదని మొక్కుబడి పరామర్శలకు బయల్దేరాయి.
కొత్త వ్యూహం
16గ్రామల జనం ఎలా పోతేనేం..వాళ్ల బాధలు, బయటి ప్రపంచానికి స్వర్గసుఖాల్లా కనిపించాలి. అదే పని జరుగతోంది ఇప్పుడు. జనం అంతా ఈ పదహారు గ్రామాల భూములు కొనడానికి ఎగబడుతున్నారని, అందువల్ల పావలా ఖరీదు చేసే భూములు ఇప్పుడు కోట్లు పలికేస్తున్నాయని ‘పచ్చ’పాత పత్రికలు రాయడం ప్రారంభించాయి. మిగిలిన ప్రాంతాల రైతులు..’అబ్బా..ఆ 16 గ్రామాల రైతులది ఏం అదృష్టం’ అని అసూయపడాలి. అదీ వ్యూహం. అక్కడి వారి బాధలు అక్కడిక్కడే సమాధి అయిపోవాలి. బయటకు తెలియకూడదు.
మరి ఇప్పుడైనా మహా మహా మేధావులు, వ్యాసకర్తలు, రచయితలు కలం, గళం, పదం కలిపి కదలరేమి?